సునామీ.. సేవకు మళ్లించింది

దర్శకురాలు కావాలనేది ఆమె కల. అంతలో వచ్చిన సునామీ ఆమె మార్గాన్నీ.. మళ్లించింది. భిక్షాటన చేసే సంచార జాతుల చిన్నారులను చూసి ఆమె మనసు ద్రవించింది. వారి ఆకలి తీర్చి, చదువు

Updated : 11 Sep 2022 06:46 IST

దర్శకురాలు కావాలనేది ఆమె కల. అంతలో వచ్చిన సునామీ ఆమె మార్గాన్నీ.. మళ్లించింది. భిక్షాటన చేసే సంచార జాతుల చిన్నారులను చూసి ఆమె మనసు ద్రవించింది. వారి ఆకలి తీర్చి, చదువు చెప్పించాలన్న ఆమె ఆలోచన వందల మందిని విద్యావంతులను చేసింది. ట్రస్టు స్థాపించి వందల మంది మహిళలకు.. సాధికారతను కల్పిస్తున్న రేవతి రాధాకృష్ణన్‌ స్ఫూర్తి కథనమిది...

ప్రముఖ సినీదర్శకుడు వాసుదేవ మీనన్‌ వద్ద అసోసియేట్‌గా చేరింది తమిళనాడుకు చెందిన రేవతి రాధాకృష్ణన్‌. 2004లో వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సునామీ ఆమె జీవిత మార్గాన్ని మార్చకపోతే.. ఇప్పుడు తను దర్శకుల జాబితాలో ఉండేది. చిన్నప్పటి నుంచి సేవాభావం ఉన్న రేవతి, సునామీ సమయంలో నాగపట్టణం రేవులో గుట్టలుగా పడి ఉన్న శవాలను తొలగించడానికి వలంటీరుగా వెళ్లింది. అక్కడ భిక్షాటన చేస్తున్న ఓ చిన్నారి, ఆమె చేతిలో బలహీనంగా ఉన్న నెలల పసికందును చూసి చలించిపోయింది. తనకు సాయం చేద్దామని  మరుసటి రోజు వాళ్లుండే చోటికి వెళ్లింది. అక్కడ బూంబూం మాట్టుకారన్‌ అని పిలిచే సంచార గిరిజన జాతికి చెందిన 43 కుటుంబాలున్నాయి. తరాలుగా వారి జీవనోపాధి బిక్షాటనే అని తెలిసి విస్తుపోయింది. అక్కడ చిన్నారులందరూ పోషకాహారలోపంతో శుష్కించి ఉన్నారు. తనంతకు ముందు రోజు చూసిన పసికందు చనిపోయిందని తెలిసి రేవతి తీవ్ర వేదనకు గురైంది. వెంటనే వారందరికీ ఆహార పదార్థాలను అందించింది.

విద్యతో..
అప్పటి వరకు వారిలో ఎవరూ చదువుకోలేదు. బాల్యవివాహాలెక్కువ. ఇవన్నీ చూసి ఆ చిన్నారులను భిక్షాటనకు దూరం చేయడం, పోషకాహారం అందించడం, చదివించడం.. ఈ మూడింటిని లక్ష్యాలుగా పెట్టుకున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న వీరిని అందరిలో ఒకరిగా కలపాలనుకున్నారు రేవతి. ‘దానికోసమే 2005లో ‘వానవిల్‌ ట్రస్టు’ స్థాపించా. వెల్లూరు గ్రామంలో ఓ చిన్న స్థలం అద్దెకు తీసుకుని పాఠశాల ప్రారంభించా. ఆ కుటుంబాలను కలిసి పిల్లలను బడికి పంపించమని అడిగా. ఆహారం అందిస్తామని చెప్పా. చాలా కష్టమ్మీద వాళ్లను ఒప్పించి స్కూల్‌కు మొదటి బ్యాచ్‌లో 35 మందిని చేర్చగలిగా. అప్పటివరకు పాఠశాల ఎరగని వాళ్లకు బోధించడం ఛాలెంజ్‌గా నిలిచింది. తోటి వలంటీర్ల సాయంతో ప్రత్యేక పద్ధతిలో చదువు చెప్పడం ప్రారంభించాం’ అని వివరిస్తారు రేవతి.

17 ఏళ్లలో..
తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వానవిల్‌ ట్రస్టు ముందడుగు వేసింది. కొద్ది కాలంలోనే ఈ ట్రస్టు సేవలను ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ విద్యావిభాగం అనాథ చిన్నారులు, నిరుపేద పిల్లలనూ వీళ్లకు అప్పగిస్తోంది. అలా నాగపట్టణం, తిరువారూరు జిల్లాల్లో 6 గ్రామాల్లో ట్రస్టు ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల సహా చిల్డ్రన్‌ హోమ్స్‌ను రేవతి నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల, కళాశాలకు వెళుతుంటారు. ఇలా చదువుకున్న వారిలో సాఫ్ట్‌వేర్‌, విజువల్‌ కమ్యూనికేషన్‌ రంగాల్లో స్థిరపడ్డారు. ఇప్పటి వరకు ఈ ట్రస్టు 850 మందిని విద్యావంతులను చేయగా, వీరిలో సంచారజాతి పిల్లలు 437 మంది. వీరిలో 64 మంది పట్టభద్రులయ్యారు. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో 15వేల కుటుంబాలకు ఆహారపంపిణీ చేసిన ఈ ట్రస్టు మహిళలకూ చేయూతనందిస్తోంది. స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి మహిళలతో పాల కేంద్రాలు ప్రారంభింపజేసింది. అలా దాదాపు 400 మంది మహిళలకు సాధికారతను కల్పించింది. ఈ కుటుంబాలకు రేషన్‌, ఆధార్‌కార్డులు, కమ్యూనిటీ ధ్రువపత్రాలు వంటివి పొందేలా సాయపడుతోంది. తమిళనాడు వ్యాప్తంగా 19 జిల్లాల్లో ఈ గిరిజన జాతి నివసిస్తుండగా, ఇప్పటివరకు వానవిల్‌ ట్రస్టు మూడు జిల్లాల్లో సేవలు అందిస్తోంది. త్వరలో మిగతా జిల్లాల్లోనూ సేవలను విస్తృతం చేయనున్నట్లు చెబుతున్న 46 ఏళ్ల రేవతి ఎందరో దాతల చేయూతతోనే ఇవన్నీ చేయగలుగుతున్నామని వినమ్రంగా చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్