నడవలేదు... కూర్చోలేదు... అయినా సాధించింది!

వైకల్యం ఆమెని కుదురుగా కూర్చోనిచ్చేది కాదు.. మరుగుజ్జు రూపం. ఏ పనైనా పడుకొనే చేయాల్సిన దయనీయత. అలాంటి అమ్మాయిని పసిబిడ్డగానే భావించి కాలేజీ వరకూ మోసుకెళ్లిన ఆ అమ్మకు ఆ బిడ్డ ఇచ్చిన కానుకేంటో తెలుసా! యూజీసీనెట్‌లో 99.31శాతం మార్కులు. ఇంతకంటే ఆ అమ్మకు ఏం కావాలి?

Updated : 10 Nov 2022 12:37 IST

వైకల్యం ఆమెని కుదురుగా కూర్చోనిచ్చేది కాదు.. మరుగుజ్జు రూపం. ఏ పనైనా పడుకొనే చేయాల్సిన దయనీయత. అలాంటి అమ్మాయిని పసిబిడ్డగానే భావించి కాలేజీ వరకూ మోసుకెళ్లిన ఆ అమ్మకు ఆ బిడ్డ ఇచ్చిన కానుకేంటో తెలుసా! యూజీసీనెట్‌లో 99.31శాతం మార్కులు. ఇంతకంటే ఆ అమ్మకు ఏం కావాలి?
‘నేను కడుపులో పడగానే... భూమ్మీదకు ఎప్పుడెప్పుడు వస్తానా? బుజ్జి బుజ్జి అడుగులు వేస్తూ ఎప్పుడు సందడి చేస్తానా అని అమ్మ ఎంతగానో ఎదురు చూసిందట. అయితే పుట్టాక చూసి అమ్మ ఎంత కుమిలిపోయిందో నాకే తెలుసు. ఆ బాధను కొంతైనా తగ్గించాలంటే నేను ఉన్నతంగా స్థిరపడాలనుకున్నా’ అంటోంది పియాషా. అందుకే ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని బోధనా వృత్తిలో స్థిరపడటానికి బాటలు వేసుకుంటోంది. ఆ ప్రయత్నంలోనే ‘యూజీసీ నెట్‌’ రాసింది. 99.31 శాతం స్కోరుతో శభాష్‌ అనిపించింది.

వదిలించుకోమన్నారు...

పియాషా వాళ్ల నాన్న ఉత్తమ్‌ మహల్దార్‌ కోల్‌కతాలో పోలీసు. తల్లి సుప్రియా. తను గర్భంలో ఉన్నప్పుడే ‘ఫోకో మెలియా’ అనే వ్యాధి బారిన పడింది. దాంతో చేతులూ, కాళ్లూ, మరుగుజ్జు ఆకృతిలో ఉండిపోయాయి. నడవడం కాదు కదా, ఏ సాయమూ లేకుండా పట్టుమని ఒక్క నిమిషమూ కూర్చోలేదు. దాంతో అమ్మే అన్నీ తానయ్యింది. చాలామంది ఆ పసిబిడ్డని వదిలించుకోమంటూ సలహాలు ఇచ్చారు. అయినా సరే, అమ్మ మనసు మారలేదు... ఆ తండ్రీ బరువనుకుని వదిలేయాలనుకోలేదు.

వీపున మోస్తూ...

పియాషాకి చిన్నప్పటి నుంచీ జ్ఞాపకశక్తి ఎక్కువ. తమ్ముడు చదువుతుంటే... విని ఇట్టే గుర్తు పెట్టుకునేది. అది గమనించారు అమ్మా నాన్న. అయితే బళ్లో చేర్పించడానికి భయపడ్డారు. ఆమె తపనని చూసి ఎంత తిరిగినా, ఏ బడిలోనూ చేర్చుకోలేదు. చివరికి ఓ ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టారు పెద్ద మనసు చేసుకున్నారు. అదే పియాషా జీవితాన్ని మలుపు తిప్పింది. రోజూ అమ్మ సుప్రియ తనని వీపున మోస్తూ బడికి తీసుకెళ్లి, తీసుకొచ్చేది. అక్కడ తను బెంచీ మీద పడుకునే పాఠాలు వినేది. పరీక్షలు రాసేటప్పుడూ ఇలానే.

సైన్స్‌ చదవాలన్నది పియాషా కల. కానీ ప్రాక్టికల్స్‌, ల్యాబొరేటరీల్లో ఇబ్బందని ఆర్ట్స్‌లో చేరింది. ఎంత కష్టమైనా ఏరోజూ కాలేజీ మానలేదు. ఇంటర్‌ రెండో ఏడాదిలో తరగతి గది మొదటి అంతస్థులోకి మారింది. తనని మోసుకెళ్లడానికి అమ్మ పడే ఇబ్బంది గమనించి... ఇంట్లోనే చదువుకుంది. 75 శాతం మార్కులతో పాసయింది. సహాయకుడి సాయం తీసుకునే అవకాశం ఉన్నా పరీక్షలన్నీ సొంతగానే రాసింది. అలానే డిగ్రీ, కల్యాణీ యూనివర్సిటీలో ఎమ్మే చదివింది. ఇప్పుడు పీహెచ్‌డీ చేయనుంది. ఇన్ని అడ్డంకుల్నీ చిరునవ్వుతో అధిగమించిన ఆమె కన్నా స్ఫూర్తిప్రదాత ఎవరుంటారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని