మంజీర.. ఇది మహిళల బ్రాండ్‌!

నిన్న మొన్నటివరకూ ఊరే ప్రపంచం... వంటగదే జీవితంగా బతికారు వాళ్లు. అయితే వదాన్యుల చేయూత, ఐకమత్యమూ వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చాయి. వారిప్పుడు బహుళజాతి సంస్థలతో పోటీ పడుతున్నారు.

Updated : 18 May 2023 07:46 IST

నిన్న మొన్నటివరకూ ఊరే ప్రపంచం... వంటగదే జీవితంగా బతికారు వాళ్లు. అయితే వదాన్యుల చేయూత, ఐకమత్యమూ వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చాయి. వారిప్పుడు బహుళజాతి సంస్థలతో పోటీ పడుతున్నారు. సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. ఓ చిన్న ఔట్‌లెట్‌ నుంచి జపాన్‌కు ఎగుమతి వరకూ వీరి స్ఫూర్తి ప్రయాణం తెలుసుకుందామా!

‘అవకాశాలను సృష్టించుకోవడమే కాదు... వచ్చినవి వినియోగించుకోవడమూ తెలియాలి. అప్పుడే అభివృద్ధినీ, వాటి ఫలాల్నీ చూడగలం’ అనే పుల్కల్‌ మండలం గొంగ్లూరు మహిళల విజయానికి వారి ఐకమత్యమూ ఓ కారణం. ఈ పల్లె సంగారెడ్డి నుంచి సింగూరు జలాశయానికి వెళ్లే దారిలో ఉంది. ఈ ఊళ్లో ఎక్కువ శాతం వ్యవసాయ కుటుంబాలే. సాగు ఖర్చు ఎక్కువ కావడం, ఊళ్లో ఉపాధి దొరక్క పోవడంతో కొందరు వలసెళ్లి పోయారు. మరికొందరు అలానే బతుకీడ్చేవారు. ఆ సమయంలోనే ఐఆర్‌ఎస్‌ అధికారుల బృందం ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. అప్పుడు కొందరు మహిళలు ఉపాధి అవకాశాలు కల్పించమని వారిని కోరారు. ఎన్నో చర్చల తర్వాత ‘సర్వోదయ మహిళా పారిశ్రామికవేత్తల’ ఆలోచనకు బీజం పడింది. వీరితో సబ్బులు, పప్పులు, గానుగ నూనెల తయారీ చేయించాలని అనుకున్నారు. మరి, పెట్టుబడి ఎలా? ఎక్కడో రుణాలు తీసుకోవడం కంటే తలా కొంత జమ చేసుకుని ముందుకెళ్లడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారందరూ. ఇందులో 135 మంది వాటాదారులున్నారు. వీరిలో 72 మంది స్థానిక మహిళలు, మిగిలిన వారిలో 63 మంది డాక్టర్లూ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లూ, వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో పని చేస్తోన్న అధికారిణులు. వీరంతా సర్వోదయ మహిళలకు అండగా నిలబడటానికి ముందుకు వచ్చారు. రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకూ తలా కొంత పెట్టుబడి పెట్టారు. మొత్తం కలిపి రూ.2 కోట్లతో భవనం, యంత్రాలు, సామగ్రిని సమకూర్చుకున్నారు. జనవరి 2022 నుంచి సంస్థ కార్యకలాపాల్ని ప్రారంభించారు.

50 రకాల ఉత్పత్తులు...

‘మంజీర’ బ్రాండ్‌తో మల్టీనేషనల్‌ కంపెనీలతో పోటీపడాలనేది వీరి తపన. అందుకే ఉత్పత్తుల తయారీ నుంచి మార్కెటింగ్‌ వరకూ ఎక్కడా రాజీపడటం లేదు. వీరందరికీ నిపుణులతో శిక్షణ ఇప్పించారు. టొమాటో, బొప్పాయి, గులాబీ వంటి 15 రకాల నేచురల్‌ హ్యాండ్‌మేడ్‌ సబ్బులను విపణిలోకి తెచ్చారు. పల్లీలు, పొద్దుతిరుగుడు, నువ్వులు, కొబ్బరినూనెలను కోల్డ్‌ ప్రెస్డ్‌ విధానంలో తీసి అమ్ముతున్నారు. అన్ని రకాల పప్పుదినుసులనూ ప్రాసెస్‌ చేసి, మార్కెటింగ్‌ చేస్తున్నారు. ఇలా మొత్తం 50కి పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వీటికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా), జీఎంపీ (గుడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రొడక్ట్‌) వంటి జాతీయ సంస్థల లైసెన్స్‌లూ, కాస్మెటిక్‌ ఉత్పత్తులకు ఆయుష్‌ విభాగం అనుమతులూ సాధించారు. ప్రస్తుతం కోల్డ్‌ప్రెస్‌ నూనెల్ని జపాన్‌కి ఎగుమతి చేసే సన్నాహాల్లో ఉన్నారు. సంగారెడ్డిలో ఔట్‌లెట్‌ తెరిచారు. ఐఐటీ హైదరాబాద్‌ సాంకేతిక సహకారంతో ఆన్‌లైన్‌ అమ్మకాల కోసం వెబ్‌సైట్‌నీ తెచ్చారు. ఈ కృషితో సంస్థ మొదటి ఏడాదిలోనే రూ.70లక్షల టర్నోవర్‌ సాధించగలిగింది. 8 మంది కీలక సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహణంతా సాగుతోంది.

మార్పు ఎంతో...

వాటాదారుల్లోని 22 మంది మహిళలు... ఇందులోనే పనిచేస్తూ నెలవారీ వేతనాలు పొందుతున్నారు. ‘ప్రైవేటు టీచర్‌గా చేసేదాన్ని. కరోనా తర్వాత ఉద్యోగం పోయింది. అదే సమయంలో ‘సర్వోదయ మహిళా పారిశ్రామికవేత్తల’ అంశం తెరమీదకు వచ్చింది. నేనూ రూ.50వేలు పెట్టుబడి పెట్టా. ఇక్కడే పనిచేస్తున్నా. ఉన్న ఊళ్లోనే.. సొంత సంస్థలో పనిచేస్తుండటం ఎంతో తృప్తినిస్తోంది’ అంటున్నారు’ ఎస్‌.సునీత. ‘పిల్లల బాధ్యత చూసుకుంటూ ఇంట్లోనే ఉండేదాన్ని. ఇప్పుడు నాకూ ఒక సంస్థలో వాటా ఉంది. ఏడాది పొడవునా ఇక్కడ ఉపాధి దొరుకుతోంది. కుటుంబ అవసరాల కోసం సంపాదించగలగడం గర్వంగా ఉంద’ని చెబుతున్నారు పి.సంతోష.

- రాజేందర్‌ సురకంటి, సంగారెడ్డి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని