స్నేహితుడే కదా అనుకుంటే...

లావణ్యకి(పేరుమార్చాం) ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇన్నాళ్లూ హాయిగా గడిచిపోయిన ఆమె జీవితంలో ఇప్పుడో కుదుపు.

Updated : 09 Dec 2022 13:14 IST

పారాహుషార్‌

లావణ్యకి(పేరుమార్చాం) ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇన్నాళ్లూ హాయిగా గడిచిపోయిన ఆమె జీవితంలో ఇప్పుడో కుదుపు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ ఆమె ఫోనుకి రోజూ అసభ్యకరమైన సందేశాలు. తనతో గడపకపోతే ఆమె ఫొటోలు పోర్న్‌ వెబ్‌సైట్‌లో పెడతామంటూ బెదిరింపులు. భర్తకి తెలిస్తే ఏమవుతుందోననే భయంతో చాన్నాళ్లు తనలోనే  దాచుకుంది. రోజురోజుకీ ఆ బెదిరింపులు ఎక్కువవడంతో ధైర్యం చేసి పోలీసులని సంప్రదించింది. తన సమస్యని తీర్చి తన కాపురాన్ని నిలబెట్టమని కోరింది. మరి దీన్నెలా పరిష్కరించారో చెబుతున్నారు సైబరాబాద్‌ డీసీపీ జానకీ షర్మిల.

ఫిర్యాదు అందుకున్న మా పోలీసు బృందం రంగంలోకి దిగింది. తనకి మెసేజ్‌లు ఏ మార్గంలో వస్తున్నాయో పరిశీలించింది. అవి ఫేస్‌బుక్‌ ద్వారా వస్తున్నాయని తెలుసుకుని ఆ అకౌంట్‌ని బ్లాక్‌ చేయమని ఫేస్‌బుక్‌కి మెయిల్‌ పెట్టాం. మరో పక్క ఆ ఖాతా ఏ ఐపీ నుంచి వాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఆమె స్నేహితుల జాబితాపై కూడా నిఘా పెట్టాం. సరిగ్గా పదిహేను రోజులకే అతనెవరో తెలిసింది. అతను కరీôనగర్‌ జిల్లాకు చెందిన అభిరామ్‌. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని హాస్టల్‌లో ఉంటున్నాడు. అతను ఆమెతో పదోతరగతివరకూ కలిసి చదువుకున్న వ్యక్తి. ఇప్పుడు పాత స్నేహితుడిగా ఆమెను ఫేస్‌బుక్‌లో పలకరించాడు. లావణ్య కూడా ఒకప్పుడు కలిసి చదువుకున్నామనే ఉద్దేశంతోనే అతడితో మాట్లాడటం మొదలుపెట్టింది. స్నేహానికి ఓకే చెప్పింది. ఫేస్‌బుక్‌ ఛాటింగ్‌తో మొదలైన వాళ్ల స్నేహం క్రమంగా వాట్సాప్‌ ఛాటింగ్‌, ఆ తరువాత నేరుగా ఫోన్లు చేసేవరకూ వచ్చింది. అయితే అతను ఇవన్నీ చేస్తూనే ఓ కొత్త ఫేక్‌ ఖాతాను సృష్టించి ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఆమె తన స్నేహితుల ఫేస్‌బుక్‌ ఖాతాలకు ట్యాగ్‌ చేసిన పలు ఫొటోలను సేకరించేవాడు. వాటన్నింటినీ నగ్నచిత్రాలో కలిపి మార్ఫింగ్‌ చేశాడు. చివరకు వాటిని ఆమెకు చూపించి పోర్న్‌ సైట్‌లలో పెడతానని బెదిరించాడు. విచ్చలవిడిగా అంతర్జాలాన్ని ఉపయోగించుకునే అవకాశం, టెక్నాలజీపై పట్టు, నీలిచిత్రాలపై వ్యామోహం వంటివన్నీ అతడిని అడ్డదారి తొక్కేలా చేశాయి. చివరకు ఐపీ అడ్రస్‌ ఆధారంగా అతడిని గుర్తించగలిగింది మా బృందం. మందలించేసరికి నిజాన్ని ఒప్పుకున్నాడు. అతను ఉపయోగించిన మొబైల్‌, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుంది. అతడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచింది. పాత స్నేహితులే అయినా మితిమీరిన కబుర్లు చేటు చేస్తాయనడానికి ఈ సంఘటనే నిదర్శనం. అలానే ఫేస్‌బుక్‌లలో ఫొటోలు ఉంచడం, ట్యాగ్‌లు చేయడం వంటివన్నీ కూడా కొన్నిసార్లు తెలియకుండానే చిక్కుల్లో పడేస్తాయడానికి లావణ్య సంఘటన ఓ ఉదాహరణ. ఎదుటివారు బెదిరిస్తున్నారు అనే సందేహం వస్తే ఆలస్యం చేయకుండా పోలీసుల్ని ఆశ్రయించడమే పరిష్కారం. లేదంటే సమస్యలు పెరగొచ్చు. అలాగే సైబర్‌ నేరాలపై ఫిర్యాదులుంటే ఈ కింది...
sho_cybercrimes@cyb.tspolice.gov.in కి సంప్రదించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్