Google: స్టార్టప్స్ నెలకొల్పిన మహిళలకు గూగుల్ తోడ్పాటు!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంకుర సంస్థల్లో అమెరికా, చైనా తర్వాత మన దేశం మూడో స్థానంలో ఉంది. మన దేశంలో 100కు పైగా అంకుర సంస్థలు యూనికార్న్ (100 కోట్ల డాలర్ల విలువైన) హోదాను దక్కించుకున్నాయి. అందులో 22 సంస్థలు ఈ సంవత్సరమే....

Updated : 17 Jun 2022 18:42 IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంకుర సంస్థల్లో అమెరికా, చైనా తర్వాత మన దేశం మూడో స్థానంలో ఉంది. మన దేశంలో 100కు పైగా అంకుర సంస్థలు యూనికార్న్ (100 కోట్ల డాలర్ల విలువైన) హోదాను దక్కించుకున్నాయి. అందులో 22 సంస్థలు ఈ సంవత్సరమే ఈ జాబితాలో చేరాయి. ఇందులో ఈ-కామర్స్‌, ఫిన్‌టెక్‌, హెల్త్‌టెక్‌ వంటి రంగాలు ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని రంగాల్లో అడుగుపెట్టడానికి పలు స్టార్టప్‌లు సిద్ధంగా ఉన్నాయి. దేశం ఆర్థికంగా పురోగతి సాధించాలంటే మహిళల పాత్ర చాలా కీలకం. కానీ, ఒక అధ్యయనం ప్రకారం ప్రస్తుతమున్న అంకుర సంస్థల్లో కేవలం 15 శాతం మంది మహిళలు మాత్రమే స్టార్టప్స్‌కి వ్యవస్థాపకులుగా లేదా సహ వ్యవస్థాపకులుగా వ్యవహరిస్తున్నారు. దీనిని గమనించిన టెక్‌ దిగ్గజం గూగుల్ అంకుర సంస్థలను నెలకొల్పిన మహిళలకు వివిధ అంశాల్లో అవసరమైన సహకారం అందించాలన్న లక్ష్యంతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది.

అందుకోసమే ఈ కార్యక్రమం...

ఇప్పటికీ చాలా సంస్థలు మహిళలకు తగిన నైపుణ్యాలున్నా పురుషుల అనుభవాన్నే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. ఇందుకు మహిళలు పనిచేయడానికి తగిన పరిస్థితులు లేకపోవడమూ ఒక కారణమని గూగుల్‌ భావించింది. ఈ క్రమంలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి పలు అనుకూల పరిస్థితులను సృష్టించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి కొంతమంది మహిళా పారిశ్రామికవేత్తలతో చర్చించింది. ఈ క్రమంలో పురుషులతో పోలిస్తే మహిళలు పెట్టుబడులను ఆకర్షించలేకపోవడం, నెట్‌వర్క్‌ ట్యాపింగ్‌ గురించి అవగాహన లేకపోవడం, తగిన సలహాదారులను ఎంపిక చేసుకోవడంలో ఇబ్బందిపడుతున్నారని తేలింది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ సంస్థ ‘గూగుల్‌ ఫర్‌ స్టార్టప్స్‌ యాక్సెలరేటర్ - ఇండియా విమెన్‌ ఫౌండర్స్‌’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది.

మూడు నెలల శిక్షణ...

ఈ కార్యక్రమం మొదటి విడతలో భాగంగా దేశవ్యాప్తంగా మహిళలు స్థాపించిన లేదా మహిళలు సహ వ్యవస్థాపకులుగా ఉన్న 20 అంకుర సంస్థలను ఎంపిక చేస్తుంది. వీరికి మూడు నెలల పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తుంది. ఇందులో ప్రధానంగా సిబ్బంది నియామకాల్లో ఎదురయ్యే సవాళ్లు, మూలధనం, నెట్‌వర్కింగ్, మెంటార్‌షిప్‌ వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. అలాగే బిజినెస్‌లో మహిళలకు ఎదురయ్యే పలు సామాజిక సవాళ్లపై కూడా అవగాహన కల్పిస్తారు. వీటితో పాటు సాంకేతిక అంశాలైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్ లెర్నింగ్‌, క్లౌడ్‌, యూఎక్స్, ఆండ్రాయిడ్‌, వెబ్‌.. వంటి అంశాలపై శిక్షణ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలతో చర్చించే అవకాశాన్ని కల్పిస్తారు.

వ్యాపారం అంటే ఉత్పత్తులను తయారు చేయడం, దానికి తగిన వినియోగదారులను ఆకర్షించడం. గూగుల్‌ ఈ అంశాలపై కూడా పలు వర్క్‌షాప్‌లను నిర్వహించి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కృషి చేస్తుంది.

ఎంపిక విధానం..

ఈ కార్యక్రమానికి అంకుర సంస్థలను నడిపే మహిళలే దరఖాస్తు చేసుకోవాలి. వారు కచ్చితంగా వ్యవస్థాపకులుగా లేదా సహ వ్యవస్థాపకులుగా ఉండాలి. స్టార్టప్‌ ప్రారంభ దశలో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల్లో మొదట ఈ కార్యక్రమానికి అర్హత ఉన్న సంస్థలను ఎంపిక చేస్తారు. అందులో నుంచి నిపుణుల కమిటీ 30 నుంచి 40 సంస్థలను ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో సంస్థలో ఎంతమంది పనిచేస్తున్నారు?, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు?, సంస్థ వృద్ధి ఎలా ఉంది? వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు.

ఎలా నిర్వహిస్తారు..?

ఈ కార్యక్రమం మొత్తం ఆన్‌లైన్‌లోనే సాగుతుంది. మొదట ఎంపికైన అంకుర సంస్థలను సంప్రదించి వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, కావాల్సిన సహకారం వంటి అంశాలను గుర్తిస్తారు. ఆ తర్వాత పైన చెప్పినట్లుగా పలు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఎంపికైన మహిళా పారిశ్రామికవేత్తలు ప్రధానంగా ఈ కింది సదుపాయాలు పొందుతారు.

ఇరవై కంటే ఎక్కువ గూగుల్ బృందాలతో మెంటరింగ్‌ పొందే అవకాశం.

డిజైన్‌, మార్కెటింగ్‌, లీడర్‌షిప్‌ అంశాలపై శిక్షణ

సంస్థ, ఉత్పత్తులకు సంబంధించి అవసరమైన మార్గదర్శకత్వం

గూగుల్‌ నుంచి కొత్తగా వచ్చే ఉత్పత్తులు, టూల్స్‌ని ముందుగానే ఉపయోగించుకునే అవకాశం

గూగుల్‌ నెట్‌వర్క్‌లో ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో మాట్లాడే అవకాశం.

ఈ కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : జులై 10

మరిన్ని వివరాల కోసం ఈ కింది లింక్ చూడండి. https://startup.google.com/accelerator/india

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్