అలా 26 కిలోలు తగ్గింది.. ఫిట్‌నెస్‌ పాఠాలు చెబుతోంది!

వంద కిలోల బరువుతో రెండేళ్ల పాటు పలు సవాళ్లను ఎదుర్కొన్న అథిరా.. కచ్చితమైన జీవనశైలిని పాటించి బరువు తగ్గింది. ఇప్పుడు అదే లైఫ్‌స్టైల్‌తో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది.

Updated : 25 Aug 2023 13:50 IST

(Photos: Instagram)

‘ఏంటి ఇంత లావైపోయావ్‌.. ఇలా అయితే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’ అని ఎవరైనా అంటే మనసు నొచ్చుకుంటుంది. ‘కెరీర్‌ ముఖ్యం కాదు.. కాస్త బ్రేక్‌ తీసుకొనైనా ముందు బరువు తగ్గడంపై దృష్టి పెట్టు..’ అని ఉచిత సలహాలిస్తుంటే ఎక్కడ లేని కోపం తన్నుకొస్తుంటుంది. ఒకానొక దశలో ఇలాంటి విమర్శలు, అనుభవాల్నే ఎదుర్కొంది అథిరా సేతుమాధవన్‌. వంద కిలోల బరువుతో రెండేళ్ల పాటు పలు సవాళ్లను ఎదుర్కొన్న ఆమె.. కచ్చితమైన జీవనశైలిని పాటించి బరువు తగ్గింది. ఇప్పుడు అదే లైఫ్‌స్టైల్‌తో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. పోషకాహార నిపుణురాలిగా, ఫిట్‌నెస్‌ కోచ్‌గా వందలాది మందిలో ఆరోగ్య స్పృహ పెంచుతోన్న అథిరా స్ఫూర్తి ప్రయాణమిది!

కొచ్చికి చెందిన అథిరా ఆహార ప్రేమికురాలు. ఈ మక్కువతోనే ఆహార రంగంలోనే తన కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుందామె. కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికాలో ‘ఫుడ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌’లో మాస్టర్స్‌ పూర్తిచేసిన ఆమె.. హోటల్‌ మేనేజర్‌గా కొన్నేళ్ల పాటు పనిచేసింది. మరోవైపు చెఫ్‌గానూ శిక్షణ తీసుకుంది.

పని ఒత్తిడి దెబ్బతీసింది!

అయితే తనకు ఇష్టమైన రంగంలోనే కొనసాగుతున్నప్పటికీ.. ఉద్యోగంలో అధిక పనిభారం తనకు తెలియకుండానే తన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిందంటోంది అథిరా.

‘నేనో పెద్ద ఫుడీని. చిన్నతనం నుంచే కాస్త బొద్దుగా ఉండేదాన్ని. దీనికి తోడు ఉద్యోగంలో పని ఒత్తిడి నాకు తెలియకుండానే నా ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఒక్కోసారి బీపీ పెరిగిపోయేది.. అధిక బరువుతోనూ ఇబ్బంది పడ్డా. అంతేకాదు.. నెలసరి విషయంలోనూ పలు సమస్యలు తలెత్తాయి. నిజానికి ఆ సమయంలో వీటి గురించి పట్టించుకునే తీరికా, ఓపికా రెండూ లేవు. నా శరీరాకృతి, బరువు తగ్గడం.. ఇవేవీ నేను ఆలోచించలేదు. అయితే ఓసారి మా సోదరి ఇంట్లో ఫంక్షన్‌ ఉంటే వెళ్లాను. అక్కడ ఒకావిడ నన్ను చూసి.. ‘ఏంటి ఇంత లావైపోయావ్‌? అందం కూడా తగ్గిపోయింది.. కొన్నాళ్ల పాటు కెరీర్‌ పక్కన పెట్టి.. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టు..’ అంది. ఆ మాటలు చాలా రోజుల పాటు నన్ను బాధపెట్టాయి. కసితో బరువు తగ్గాలని ఎన్నో వ్యాయామాలు చేశా.. త్వరగా తగ్గాలని క్రాష్‌ డైట్స్‌ కూడా పాటించా. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. అప్పుడనిపించింది.. బరువు తగ్గాలంటే క్రాష్‌ డైట్లు కాదు.. పోషకాహారం తీసుకోవాలని! ఈ ఆలోచనతోనే ఆన్‌లైన్‌లో పోషకాహారానికి సంబంధించిన కొన్ని టిప్స్‌ తెలుసుకొని నా డైట్‌లో భాగం చేసుకున్నా. దీంతో కొన్ని రోజుల్లోనే మూడు కిలోల దాకా తగ్గడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది..’ అంటోందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

80:20 ఫార్ములా వర్కవుటైంది!

ఇలా క్రమంగా బరువు తగ్గడం గమనించిన అథిరా.. పోషకాహారం గురించి మరింతగా శోధించి తన డైట్‌లో మరిన్ని మార్పులు చేర్పులు చేసుకుంది. అలాగని తనకిష్టమైన ఆహార పదార్థాల్ని పూర్తిగా పక్కన పెట్టేయకుండా.. వాటిని ఇంట్లోనే, ఆరోగ్యకరంగా వండుకోవడం ప్రారంభించిందామె.

‘ఒక్కో కిలో తగ్గుతున్న కొద్దీ.. నా డైట్‌లో మరిన్ని పోషక పదార్థాల్ని చేర్చుకున్నా. కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మొదలుపెట్టా. వారానికి నాలుగైదు రోజులు ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేశా. దీనికి తోడు జిమ్‌లో చేరాను. వ్యక్తిగత ట్రైనర్‌ను పెట్టుకున్నా. స్ట్రెంత్‌ ట్రైనింగ్‌, కార్డియో వ్యాయామాలపై దృష్టి పెట్టా. రోజూ పది వేల అడుగులు నడిచేదాన్ని. ఇలా నాలుగు నెలలు గడిచే సరికి 20 కిలోలు తగ్గాను. ఫలితంగా బీపీ అదుపులోకి రావడం, నెలసరి సమస్యలు తగ్గిపోవడం.. వంటివీ గమనించా. అలా 80 శాతం పోషకాహారం, 20 శాతం వ్యాయామాలతో.. వంద కిలోల నుంచి 74 కిలోలకు చేరుకున్నా..’ అంటూ తాను బరువు తగ్గిన తీరు గురించి చెబుతోంది అథిరా.

సమస్యను బట్టి.. డైట్‌ ఛార్ట్‌!

అయితే బరువు తగ్గే క్రమంలో తాను పాటించిన ఆహార నియమాలు, చేసిన వ్యాయామాలు, ఇతర చిట్కాల గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో తన స్నేహితులతో పంచుకునేది అథిరా. అయితే ఈ పోస్టులకు మంచి స్పందన రావడం, చాలామంది మరిన్ని సలహాలు అడగడంతో.. పోషకాహారం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుందామె. ఈ ఆలోచనతోనే ఇందులో కోర్సు పూర్తి చేసి.. సర్టిఫైడ్‌ న్యూటిషనిస్ట్‌గా సర్టిఫికేషన్‌ సంపాదించింది. ఆ తర్వాత బరువు తగ్గడానికి పాటించాల్సిన ఆహార నియమాలు, వ్యాయామాలు, బిజీ షెడ్యూల్‌ ఉన్న వారు క్షణాల్లో తయారుచేసుకునేలా ఇన్‌స్టంట్‌ మీల్స్‌/స్నాక్స్‌.. వంటి సలహాలెన్నో ఇవ్వడం ప్రారంభించింది అథిరా. ఆపై ఉద్యోగానికి రాజీనామా చేసి.. పూర్తి స్థాయి హెల్త్‌ కోచ్‌గా, న్యూట్రిషనిస్ట్‌గా మారిపోయిందామె. మహిళలకున్న ఆయా ఆరోగ్య సమస్యల్ని బట్టి.. డైట్‌ ఛార్ట్‌ సిద్ధం చేసి ఇవ్వడం, వారికి ఫిట్‌నెస్‌ సలహాలివ్వడం, ఆరోగ్యకరమైన వంటకాలు తయారుచేసి.. వాటిని వీడియోల రూపంలో వెబ్‌సైట్‌/సోషల్‌మీడియాల్లో పోస్ట్‌ చేయడం.. వంటివి చేస్తోందీ వెల్‌నెస్‌ కోచ్‌.

‘మనసు చంపుకొని నచ్చిన ఆహార పదార్థాల్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. వాటిని ఇంట్లోనే ఆరోగ్యకరంగా తయారుచేసుకొని తీసుకుంటే.. అటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. ఇటు నచ్చినవి తిన్నామన్న సంతృప్తినీ సొంతం చేసుకోవచ్చు..’ అంటోన్న ఈ డిజిటల్‌ క్రియేటర్‌ ఏడాది కాలంలోనే సుమారు వెయ్యి మందిలో ఆరోగ్య స్పృహను పెంచింది.. వారి ఫిట్‌నెస్‌ జర్నీలో కీలక పాత్ర పోషించింది. అంతేకాదు.. ఇన్‌స్టాలో 1.3 లక్షల మంది ఫాలోవర్లనూ సొంతం చేసుకుందీ వెల్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్