‘హస్త కళల’ వ్యాపారంతో రెండు చేతులా సంపాదిస్తోంది!

సూరత్‌కు చెందిన మోనాలీ పటేల్‌ హోమియోపతిలో ప్రొఫెషనల్‌ డిగ్రీ అందుకుంది. వైద్యురాలిగా కొన్ని రోజులు ప్రాక్టీస్‌ కూడా చేసింది. అయితే ఉన్నట్లుండి ఒకరోజు ఉద్యోగం మానేసింది. తన అసలు లక్ష్యం ఇది కాదంటూ హస్తకళల వ్యాపారాన్ని ప్రారంభించింది. అప్పుడు ‘ అదేంటి?..ఈ అమ్మాయి అంత మంచి ఉద్యోగాన్ని కాదని వ్యాపారం చేస్తానంటుంది’ అని చాలామంది ఆమెను ఆడిపోసుకున్నారు.

Published : 20 Aug 2021 19:39 IST

(Image for Representation)

సూరత్‌కు చెందిన మోనాలీ పటేల్‌ హోమియోపతిలో ప్రొఫెషనల్‌ డిగ్రీ అందుకుంది. వైద్యురాలిగా కొన్ని రోజులు ప్రాక్టీస్‌ కూడా చేసింది. అయితే ఉన్నట్లుండి ఒకరోజు ఉద్యోగం మానేసింది. తన అసలు లక్ష్యం ఇది కాదంటూ హస్తకళల వ్యాపారాన్ని ప్రారంభించింది. అప్పుడు ‘ అదేంటి?..ఈ అమ్మాయి అంత మంచి ఉద్యోగాన్ని కాదని వ్యాపారం చేస్తానంటుంది’ అని చాలామంది ఆమెను ఆడిపోసుకున్నారు. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు. తన వ్యాపార దక్షతకు కాస్త సృజనాత్మకతను జోడించి అద్భుతమైన లాభాలు రాబట్టింది. మరి సక్సెస్‌ఫుల్ ఆంత్ర ప్రెన్యూర్‌గా ఎదిగిన మోనాలీ ‘సక్సెస్‌ సీక్రెట్‌’ ఏంటో తెలుసుకుందాం రండి.

రూ.50 వేల పెట్టుబడితో!

కళలు, చేతి వృత్తులంటే మోనాలీకీ చిన్నప్పటి నుంచి ఆసక్తి. అందుకే హోమియోపతి ప్రాక్టీస్ వదిలేసి హ్యాండీక్రాఫ్ట్స్‌ బిజినెస్‌ ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఎకో ఫ్రెండ్లీ ఆభరణాలు, రాఖీలు, అలంకరణ వస్తువులు తదితర ఉత్పత్తులను తయారుచేసి విక్రయించింది. ఇందుకోసం సూరత్‌లోని వివిధ చేతివృత్తులకు సంబంధించిన మహిళా కళాకారులు, ఆర్టిస్టుల సహాయం తీసుకుంది. తన వ్యాపారంలో వారిని భాగస్వామ్యులుగా చేర్చుకుని ఉపాధి కల్పించింది. అలా 2015లో కేవలం 50 వేల రూపాయల పెట్టుబడితో ఈ బిజినెస్‌ను ప్రారంభించిన మోనాలీ... ప్రస్తుతం ఏడాదికి 5-6 లక్షల ఆదాయం ఆర్జిస్తోంది.

సృజనాత్మకత తప్పనిసరి!

‘మన భారతదేశం ఎన్నో చేతివృత్తులు, కళలకు నిలయం. నాకు కూడా చిన్నప్పటి నుంచి వీటిపై ఆసక్తి ఉండేది. అందుకోసమే హోమియోపతి ప్రాక్టీస్‌ను వదిలి ఈ వ్యాపారాన్ని ప్రారంభించాను. ఈ వ్యాపారం అంతా ఇళ్ల నుంచే జరుగుతుంది. దీని వల్ల మహిళలు తమ ఇంటి బాధ్యతలు నెరవేర్చుకునే సమయం, సౌలభ్యం దొరుకుతుంది. నాకు ఈ వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఎదురు కాలేదు. అయితే ఈ పోటీ ప్రపంచంలో అందరికన్నా ముందుండాలి అంటే వ్యాపార దక్షతకు తోడు కాస్త సృజనాత్మకత ఉండాల్సిందే. అందుకే నేటి మార్కెట్‌ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మా ఉత్పత్తుల తయారీలో మార్పులు, చేర్పులు చేస్తున్నాం. ‘ఎకో ఫ్రెండ్లీ’ అనేది కూడా ఇందులో ఒక భాగమే..’

అలా మా రాబడి పెరిగింది!

‘ఒక మహిళ వ్యాపారంలో విజయం సాధించాలంటే ఆమెకు వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మద్దతు ఉండాలి. ఈ విషయంలో నేనెంతో అదృష్టవంతురాలిని. ఇక వ్యాపారంలో మార్కెటింగ్‌ కూడా ఎంతో కీలకం. ప్రారంభంలో స్థానికంగా జరిగే మేళాలు, హస్తకళల ఎగ్జిబిషన్లలో మా ఉత్పత్తులను విక్రయించేవాళ్లం. దీని వల్ల కొద్దిమందికి మాత్రమే మా ఉత్పత్తులు చేరువయ్యేవి. అందుకే మరింతగా మా బిజినెస్‌ను విస్తరించే పనుల్లో భాగంగా అమెజాన్‌ టీమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఫలితంగా దేశంలోని మిలియన్ల మంది ప్రజలు మా ప్రొడక్ట్స్‌ గురించి తెలుసుకునే అవకాశం లభించింది. మా రాబడి కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా మా ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు కస్టమర్లను బాగా ఆకట్టుకున్నాయి.’

ఆన్‌లైన్‌ విక్రయాలతోనే కోలుకున్నాం!

‘వ్యాపారాన్ని చూసుకుంటూనే ఆన్‌లైన్‌ విక్రయాలకు సంబంధించి కొన్ని వర్క్‌షాపులు, శిక్షణ కార్యక్రమాలకు హాజరవుతున్నాను. ఇవి నా వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సహాయపడతాయి. ఇక చాలామంది లాగే కరోనా మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఆర్థిక ఇబ్బందులను సృష్టించింది. అయితే మా ఉత్పత్తులకు ఉన్న ఆదరణతో అతి తక్కువ సమయంలోనే కరోనా నష్టాల నుంచి కోలుకున్నాం. ముఖ్యంగా మహమ్మారి కాలంలో జరిగిన ఆన్‌లైన్‌ విక్రయాలు మేం నిలదొక్కుకునేందుకు ఎంతో తోడ్పడ్డాయి. రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్... మా వ్యాపారంలోని మూల సూత్రాలివే. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరికొంతమంది మహిళా కళాకారులతో పని చేయాలనుకుంటున్నాను’ అని తన విజయగాథను పంచుకుంది మోనాలీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్