జగన్మాత స్ఫూర్తితో ప్రగతి పథంలో సాగుదాం..!

దసరా నవరాత్రుల్లో భాగంగా వివిధ అవతారాల్లో దర్శనమిచ్చే ఆ దుర్గాదేవి మహిళలందరికీ ఎప్పటికీ ఆదర్శప్రాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు..! అయితే సమాజంలోని మహిళలంతా ఆ అమ్మలాగే దృఢ నిశ్చయంతో, సమర్థతతో, కార్యదక్షతతో విజయపథంలో దూసుకెళ్లాలంటే మనలో ఉన్న కొన్ని అంశాలను మరింత బలపరుచుకోవాలి.

Published : 15 Oct 2021 13:59 IST

దసరా నవరాత్రుల్లో భాగంగా వివిధ అవతారాల్లో దర్శనమిచ్చే ఆ దుర్గాదేవి మహిళలందరికీ ఎప్పటికీ ఆదర్శప్రాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు..! అయితే సమాజంలోని మహిళలంతా ఆ అమ్మలాగే దృఢ నిశ్చయంతో, సమర్థతతో, కార్యదక్షతతో విజయపథంలో దూసుకెళ్లాలంటే మనలో ఉన్న కొన్ని అంశాలను మరింత బలపరుచుకోవాలి. అదే సమయంలో మన బలహీనతలను సైతం దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆ అమ్మవారిని ఆదర్శంగా తీసుకుని సమర్థమైన మహిళగా మనల్ని మనం తీర్చిదిద్దుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి మహిళా బలపరుచుకోవాల్సిన కొన్ని అంశాలేంటో తెలుసుకుందాం రండి..

సంభాషణా చాతుర్యం..!

సంభాషణా చాతుర్యం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో కొందరు గలగలా మాట్లాడుతూ, అడిగిన ప్రతి ప్రశ్నకి ఠక్కున సమాధానాలిస్తే.. ఇంకొందరు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అయితే సమర్థమైన మహిళగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలనుకున్నప్పుడు అందుకు తగిన సంభాషణా చాతుర్యం కూడా తప్పకుండా ఉండి తీరాల్సిందే..! అంటే దీని అర్థం గలగలా మాట్లాడేయమని కాదు.. ఎక్కడ, ఏ సందర్భంలో మనం ఏం మాట్లాడుతున్నాం?? ఎంతవరకు మాట్లాడుతున్నాం.. అనే విషయాలపై అవగాహన ఉండాలి. అలాగే ఎదుటివ్యక్తి స్పందించిన తీరు బట్టి తిరిగి ప్రతిస్పందించే గుణం అలవరుచుకోవాలి. వేగంగా ఆలోచించగల ధోరణితోనే ఇది సాధ్యపడుతుంది. ఇలా వేగంగా విశ్లేషించుకుంటూ ఆలోచించాలంటే పూర్తి ఏకాగ్రత కలిగి ఉండడం చాలా అవసరం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే- మన ఏకాగ్రత కోల్పోకుండా లేదా దానికి భంగం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలందరిలోనూ ఏకాగ్రత తప్పనిసరిగా ఉంటుంది. దీనిని మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా మనల్ని మనం సమర్థంగా తీర్చిదిద్దుకోవచ్చు.

మెరుగైన వ్యక్తిత్వం

చక్కని సంభాషణా చాతుర్యానికి తోడు మన ఆలోచనా తీరు, వ్యవహారశైలి దృఢంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలో మనం నమ్మిన విలువలు, సిద్ధాంతాలు.. మొదలైన వాటిని ఇతరులు ఎంతవరకు ప్రభావితం చేస్తున్నారు? ఈ విషయంలో వారిని మనం ఎంతవరకు అనుమతించవచ్చు?? అలా అనుమతించడం ఎంతమేరకు అవసరం.. అనే అంశాలను కూడా నిశితంగా పరిశీలించగలగాలి. ఈ విధమైన ఆలోచనా ధోరణి, దృఢమైన వ్యవహారశైలి వల్ల మెరుగైన వ్యక్తిత్వం అలవడే అవకాశం ఉంటుంది.

ఉనికిని కోల్పోవద్దు..

మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు ఆధిపత్య ధోరణి చలాయిస్తే, ఇంకొందరు మన ఆలోచనలు లేదా మనసుని ప్రభావితం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల ప్రభావానికి లోనవకుండా మన వ్యవహారశైలి దృఢంగా ఉండాలంటే ప్రతి మహిళకీ తన వ్యక్తిత్వంపై కచ్చితమైన అవగాహన ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మిన సిద్ధాంతాలను, ఆలోచనలను వదిలేస్తూ.. తన వ్యక్తిత్వానికి తాను దూరం కాకూడదు. ఇలా జరిగితే సమాజంలో ఆమె తన ఉనికి, ఆత్మగౌరవం కోల్పోతుంది.

అమ్మవారే ఆదర్శంగా..

దసరా శరన్నవరాత్రుల్లో మనం పూజించే ఆ అమ్మవారు శక్తి స్వరూపిణి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో పూజలందుకొనే ఆ అమ్మ ప్రతి స్త్రీకీ ఆదర్శమే. మహిళల శక్తిసామర్థ్యాలకు, దృఢ చిత్తానికి, వ్యవహారశైలికి, సందర్భానుగుణంగా తనని తాను మలచుకునే తీరుకి ఆమే ఒక నిదర్శనం. నవరాత్రుల్లో రోజుకి ఒక అలంకారంలో దర్శనమిచ్చే ఆ అమ్మవారికి ఒక్కో రూపంలో ఒక్కో బలం ఉంటుంది. సరస్వతీ దేవిగా విద్యను ప్రసాదిస్తే, కనకదుర్గగా భక్తులను చల్లగా దీవిస్తూ కోరికలు తీరుస్తుంది. మహిషాసురమర్దిని/ కాళిక అవతారాల్లో చెడుని అంతమొందిస్తుంది. ఆ అమ్మవారి నుంచి స్త్రీలంతా ఈ అంశాలను నేర్చుకుంటూ తమలో ఉన్న అపనమ్మకం, నిస్సహాయత, నిస్పృహలను వదిలేస్తూ.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఎంచుకున్న రంగంలో తప్పకుండా రాణించగలరు.

మరి ఆ అమ్మవారి స్ఫూర్తితో అంతులేని ఆత్మ విశ్వాసంతో, ఎదురులేని ధైర్యసాహసాలతో ముందుకు దూసుకుపోదాం రండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్