అనుబంధాన్ని పెంచే ‘లవ్‌ జర్నీ’!

తీరిక లేని షెడ్యూల్‌ కారణంగా చాలామంది దంపతులకు కలిసి గడిపే సమయమే దొరకట్లేదు. ఈ బిజీ లైఫ్‌స్టైల్‌ ఆరోగ్యాన్నే కాదు.. అనుబంధాన్నీ దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు.

Published : 09 Dec 2023 12:21 IST

తీరిక లేని షెడ్యూల్‌ కారణంగా చాలామంది దంపతులకు కలిసి గడిపే సమయమే దొరకట్లేదు. ఈ బిజీ లైఫ్‌స్టైల్‌ ఆరోగ్యాన్నే కాదు.. అనుబంధాన్నీ దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అయితే ఈ దూరం ఇద్దరినీ విడదీయకముందే జాగ్రత్తపడమంటున్నారు. ఈ క్రమంలోనే కాస్త వీలు కుదుర్చుకొని వెకేషన్లకు ప్లాన్‌ చేసుకోవడం మంచిదంటున్నారు. ఈ ప్రయాణాలు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ని పెంచడమే కాదు.. దూరమైన ప్రేమను, ఆప్యాయతను తిరిగి పొందేలా చేస్తాయి. మరి, ప్రయాణాలు, వెకేషన్లు ఆలుమగల అనుబంధాన్ని ఎలా దృఢం చేస్తాయో తెలుసుకుందాం రండి..

ఇద్దరికీ నచ్చేలా..!

వెకేషన్లనగానే ఎక్కడికెళ్లాలి? ఎలా వెళ్లాలి? ఎన్ని రోజులు ప్లాన్‌ చేసుకోవాలి? వంటి ప్రణాళికంతా భర్తకే అప్పగించేస్తుంటారు చాలామంది భార్యలు. భాగస్వామి ఇష్టమే తమ ఇష్టం అనుకుంటారు. ఇక పిల్లలకు నచ్చిన ప్రదేశాలకు ప్లాన్‌ చేసుకునే వారు మరికొందరుంటారు. ఏదేమైనా ఈ త్యాగం కూడదంటున్నారు నిపుణులు. అందరూ కలిసి వెళ్తున్నారు కాబట్టి అందరికీ నచ్చిన, అనువైన ప్రదేశాల్ని ఎంచుకోవడం వల్ల.. ఇటు భార్యాభర్తలు, అటు పిల్లలూ విహార యాత్రల్ని ఎంజాయ్‌ చేసే అవకాశాలు ఎక్కువంటున్నారు. కాబట్టి దంపతులకు తమ వ్యక్తిగత/వృత్తిపరమైన బాధ్యతల నుంచి రిలాక్సయ్యేలా, పిల్లలకు వినోదాన్ని-విజ్ఞానాన్ని పంచేలా, సాహసాలకు నెలవుగా ఉండేలా.. ఇలా ఇవన్నీ కలగలిసిన ప్రదేశాల్ని ఎంచుకుంటే ఎవరినీ చిన్న బుచ్చాల్సిన అవసరం ఉండదు. ఇలా వెకేషన్‌ ప్లానింగ్‌ గురించి ఒకరి అభిప్రాయాల్ని మరొకరు అడగడం, పంచుకోవడం వల్ల దంపతుల మధ్య పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది.

కలిసి పంచుకోవాలి!

ఎక్కడికెళ్లాలో నిర్ణయించుకున్నారు కదా.. అయితే ఇప్పుడు మీ బడ్జెట్‌ ఎంతో డిసైడవ్వండి. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నట్లయితే.. వెకేషన్‌ ఖర్చుల్ని ఒక్కరే భరించే కంటే కలిసి పంచుకోవడం మంచిది. మీరు వెళ్లే ప్రదేశంలో వసతి సౌకర్యం, చూడదగిన ప్రదేశాలు, రవాణాకయ్యే ఖర్చులు.. వంటివన్నీ ఇద్దరూ కలిసి చర్చించుకొని.. ఎవరు దేనికెంత ఖర్చు పెట్టగలుగుతారో ఓ నిర్ణయానికొస్తే.. వెకేషన్‌కి అయ్యే ఖర్చు విషయంలో ఓ స్పష్టత వస్తుంది. పైగా నేనే ఎక్కువ ఖర్చు పెట్టానంటే.. నేనే పెట్టాను అన్న గొడవలూ రావు. ఇలా వెకేషన్‌ దృష్ట్యా ఇద్దరి మధ్య జరిగే చర్చలు, అర్థం చేసుకునేతత్వం, ఒకరికొకరు సహాయపడే తీరు.. ఇవన్నీ అనుబంధాన్ని దృఢం చేసేవే!

స్నేహితులవుతారు!

ఏ బంధానికైనా స్నేహమే పునాది. భార్యాభర్తల బంధానికి కూడా! అయితే కొంతమంది దంపతులు ఒకరిపై ఒకరు అజమాయిషీ, ఆధిపత్యం చెలాయిస్తుంటారు. నిజానికి ఈ తరహా ప్రవర్తన ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని దెబ్బతీస్తుంటుంది. అయితే భార్యాభర్తలిద్దరూ అప్పుడప్పుడూ వెకేషన్లకు వెళ్లడం వల్ల.. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి సమయం గడపడం, సాహసోపేతమైన క్రీడల్లో పాల్గొనడం, సైట్‌ సీయింగ్‌, ఆ ప్రదేశం గురించి ఒకరికి తెలిసిన విషయాలు మరొకరితో పంచుకోవడం.. వంటి వాటి వల్ల దంపతుల్లో ఉన్న ఆధిపత్య ధోరణి దూరమై.. ఇద్దరి మధ్య స్నేహబంధం పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఇది క్రమంగా ఆలుమగల మధ్య అన్యోన్యతనూ రెట్టింపు చేస్తుంది.

వాటికి పరిష్కారం!

దాంపత్య బంధంలో అలకలు, గొడవలు సహజం. అయితే కొంతమంది వీటిని క్షణాల్లోనే పరిష్కరించుకుంటే.. మరికొందరు భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. అయితే వెకేషన్లకు వెళ్లడం వల్ల ఇలాంటి గొడవలూ సద్దుమణుగుతాయంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. భాగస్వామి అలక తీర్చాలంటే వారికి నచ్చిన ప్రదేశాలకు వెకేషన్‌ ప్లాన్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేస్తే సరి! ఇలా చేస్తే వాళ్ల కోపం కూడా కాస్త తగ్గుతుంది. ఇక అక్కడికెళ్లాక ఇద్దరూ తమ పొరపాట్ల గురించి ప్రస్తావిస్తూ.. ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటే ఎంత పెద్ద గొడవైనా సద్దుమణుగుతుంది. అలాగే భాగస్వామి మొండి ప్రవర్తన కూడా దూరమై.. ఇద్దరూ తిరిగి కలిసిపోయే అవకాశాలే ఎక్కువంటున్నారు నిపుణులు.

కాసేపు ఏకాంతంగా!

పిల్లలతో కలిసి వెకేషన్లకు వెళ్లినప్పుడు తమ పూర్తి సమయాన్ని వాళ్ల కోసమే కేటాయిస్తుంటారు చాలామంది దంపతులు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. పిల్లలతో సరదాగా కాసేపు గడిపినా.. మీకోసం మీరు కాస్త ఏకాంత సమయం కేటాయించుకోవడం మంచిదంటున్నారు. ఈ క్రమంలో వెళ్లిన చోట పిల్లల్ని వాళ్ల కోసమంటూ ప్రత్యేకంగా కేటాయించిన ఫన్‌ గేమ్స్‌లో బిజీ చేయడం.. మీరూ సరదాగా కొన్ని కపుల్‌ గేమ్స్‌లో భాగమవడం.. వల్ల అటు పిల్లలకు, ఇటు మీకు బోలెడన్ని అనుభూతులు సొంతమవుతాయి. అలాగే వెళ్లిన ప్రదేశంలో వసతి కోసం బుక్‌ చేసుకున్న హోటల్‌ రూమ్స్‌లో కూడా మీకోసం, పిల్లల కోసం విడివిడిగా పార్టిషన్స్‌ ఉన్నవి ఎంచుకుంటే.. మీ ప్రైవసీ దెబ్బతినకుండా జాగ్రత్తపడచ్చు. ఈ ఏకాంతం ఇద్దరి మధ్య అనుబంధాన్ని దృఢం చేస్తుంది.. అలాగే ఇలాంటి వెకేషన్లు జీవితాంతం నెమరువేసుకున్నా తరిగిపోని మధుర జ్ఞాపకాల్ని దంపతుల సొంతం చేస్తాయనడంలో సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్