Published : 20/02/2022 12:10 IST

కాబోయే తల్లుల కోసం ఐఏఎస్ చిట్కాలు!

(Photo: Twitter)

గర్భధారణ మొదలు నవమాసాలు మోసి బిడ్డను ప్రసవించే దాకా.. కాబోయే తల్లుల శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. వీటిలో కొన్ని మనల్ని అసౌకర్యానికీ గురి చేస్తుంటాయి. అయితే వీటిని సానుకూలంగా స్వీకరించి ముందుకు సాగినప్పుడే ప్రెగ్నెన్సీని ఆస్వాదించచ్చంటున్నారు ఉత్తరప్రదేశ్‌ కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ దుర్గా శక్తి నాగ్‌పాల్‌. ఇటీవలే తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. తన ప్రెగ్నెన్సీ అనుభవాలను, ప్రసవానంతర ఒత్తిళ్లు-వాటిని ఎదుర్కొన్న విధానాన్ని గుదిగుచ్చి ఓ పుస్తకం రాశారు. ఇది తప్పకుండా కాబోయే తల్లుల్లో స్ఫూర్తి నింపుతుందంటోన్న ఈ ఐఏఎస్ తన పుస్తకం ద్వారా ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..!

పుస్తకాలు చదవడం, కవితలు రాయడాన్ని ఎక్కువగా ఇష్టపడతానంటున్నారు ఐఏఎస్ ఆఫీసర్ దుర్గా శక్తి నాగ్‌పాల్‌. ఓవైపు ఇద్దరు పిల్లల తల్లిగా, మరోవైపు వృత్తినీ బ్యాలన్స్‌ చేస్తూ ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ఇప్పుడు తానే రచయిత్రిగా మారి ‘Grow Your Baby Not Your Weight’ అనే పుస్తకం రాశారామె. ప్రెగ్నెన్సీ సమయంలో తానెదుర్కొన్న అనుభవాలు, అనుభూతులు, ప్రసవానంతర ఒత్తిడిని ఎదుర్కోవడం, బ్రెస్ట్‌ఫీడింగ్‌, ప్రెగ్నెన్సీ విషయంలో ఉన్న అపోహలు.. వంటి విషయాలెన్నో ఇందులో పొందుపరిచారు దుర్గ.

తల్లి బరువు పెరగడం కాదు.. బిడ్డ ఎదగాలి!

గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు బరువు పెరగడం సహజం. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మన బరువు అదుపులో ఉండడంతో పాటు బిడ్డ ఎదుగుదలకూ ఇది దోహదం చేస్తుందంటున్నారు దుర్గ. ‘గర్భం ధరించాక మొదటి త్రైమాసికంలో వికారం, నీరసం, అలసట.. వంటి సమస్యలొస్తుంటాయి. అయితే ఇవన్నీ సహజంగా వచ్చేవే కాబట్టి ఈ దశను అనారోగ్యంగా ఫీలవ్వకూడదు. ఇక చాలా కుటుంబాల్లో గర్భిణుల్ని సుకుమారంగా చూసుకుంటారు. క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం అందించడం, ఒకరి కోసం కాదు ఇద్దరి కోసం తినాలంటూ ఒత్తిడి తేవడం.. వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో వ్యాయామం కూడా చేయనివ్వరు. ఇలాంటి అనారోగ్యపూరిత జీవనశైలి అధిక బరువుకు కారణమవుతుంది. దీనివల్ల సహజ కాన్పుల కంటే సిజేరియన్లే ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ఈ విషయంలో నేనైతే నా బరువు కంటే బిడ్డ ఎదుగుదలకే ప్రాధాన్యమిచ్చా. చక్కటి పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకున్నా..’ అంటున్నారీ ఐఏఎస్‌ ఆఫీసర్.

నా అనుభవాలే ఈ పుస్తకం!

గర్భం ధరించినప్పట్నుంచి బిడ్డ పుట్టే దాకా, తల్లిపాలు పట్టడం దగ్గర్నుంచి ప్రసవానంతర ఒత్తిళ్లను ఎదుర్కొనే దాకా.. తనకు ఎదురైన ప్రతి అనుభవాన్ని, అనుభూతిని ఈ పుస్తకంలో అధ్యాయాల రూపంలో పొందుపరిచానంటున్నారీ ఆఫీసర్.

* ‘గర్భిణిగా ఉన్న సమయంలో ఇంటి ఆహారానికే అధిక ప్రాధాన్యమిచ్చా. ముఖ్యంగా మా అమ్మ, బామ్మ కాలం నాటి సంప్రదాయ, ఆరోగ్యకరమైన వంటకాలే ఎక్కువగా తినేదాన్ని. ఈ ప్రత్యేక వంటకాల్ని ఈ పుస్తకంలో ‘Ma Ke Nuskhe’ అనే ఛాప్టర్‌లో పొందుపరిచా.

* సహజంగానే గర్భిణులకు ఆహారపు కోరికలు ఎక్కువ. ఈ క్రమంలో కొన్నిసార్లు తెలిసి కూడా అనారోగ్యపూరిత పదార్థాల పైకి మనసు మళ్లుతుంటుంది. ఇలాంటప్పుడు ఆరోగ్యకరమైన పదార్థాలతో మనసును సంతృప్తి పరచుకోవాలి. అప్పుడే బరువు అదుపులో ఉంటుంది.. లేనిపోని అనారోగ్యాలూ దరిచేరవు.

* ప్రతి సందర్భంలోనూ మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం. గర్భిణిగా ఉన్నప్పుడూ ఇది అవసరం. ఈ క్రమంలోనే నేను నా చర్మ సంరక్షణ విషయంలో ఇంట్లో తయారుచేసిన షియా బటర్‌ని మాయిశ్చరైజర్‌గా ఉపయోగించాను.

* ఇక యోగా గురువు ఆధ్వర్యంలో ప్రి-నాటల్‌ యోగా సాధన చేశా. ధ్యానం, ప్రాణాయామం నా మనసు ప్రశాంతంగా ఉండేందుకు.. ఇతర వ్యాయామాలు నా శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారేందుకు నాకు సహకరించాయి.

* మొదటి త్రైమాసికంలో వేవిళ్ల సమస్యను అధిగమించడంలో నడక నాకు దోహదం చేసింది.

* చక్కటి జీవనశైలిని పాటించే ఆరోగ్యవంతులైన గర్భిణులకూ ఈ తొమ్మిది నెలల్లో పలు సవాళ్లు ఎదురవుతుంటాయి. అవేంటి?, వాటిని ఎలా అధిగమించాలనే విషయాలు కూడా సవివరంగా ఈ పుస్తకంలో పొందుపరిచాను..’ అంటూ చెప్పుకొచ్చారీ ఐఏఎస్‌ మామ్.

ఇలా తన పుస్తకంలోని ప్రతి అధ్యాయం నిపుణుల సూచనలు, సలహాల మేరకే రాశానంటోన్న దుర్గ.. తన పుస్తకాన్ని హేమామాలిని, శిల్పా శెట్టి.. వంటి ప్రముఖులు చదివి పాజిటివ్‌ రివ్యూ ఇచ్చారని చెబుతున్నారు. ఇక ఈ పుస్తకం కాబోయే అమ్మల్లో తప్పకుండా స్ఫూర్తి నింపుతుందంటున్నారామె.

ఇసుక మాఫియాను ఛేదించి..!

2011లో పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో తొలి పోస్టింగ్‌ అందుకున్నారు దుర్గ. 2012లో ఉత్తరప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే ఆమె.. నోయిడాలోని గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసే సమయంలో అక్రమార్కుల ఇసుక మాఫియాను ఛేదించారు. అక్కడి యమున, హిండన్‌ నదీ తీరాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టిన 15 మందిని అరెస్ట్‌ చేయించారు. తద్వారా పలువురి ప్రశంసలందుకున్నారామె. 2019 నుంచి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2009లో యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలోనే అభిషేక్‌ సింగ్‌ని కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి జరిగింది. అభిషేక్‌ కూడా ఐఏఎస్‌ ఆఫీసరే. ప్రస్తుతం దిల్లీ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆయన మంచి నటుడు కూడా! ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కూతుళ్లున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని