ఇడ్లీ పాత్రలు శుభ్రం చేస్తున్నారా?

కొన్ని రకాల పాత్రలు శుభ్రం చేసినప్పుడు నీట్‌గానే కనిపిస్తాయి.. కానీ వాటిపై తడి ఆరిపోయాక తెల్లటి మరకలు కనిపించడం చూస్తుంటాం. ఎంత శుభ్రం చేసినా ఇడ్లీ పాత్రల పైనా ఇలాంటి మరకలే దర్శనమిస్తాయి.

Published : 14 Nov 2023 22:03 IST

కొన్ని రకాల పాత్రలు శుభ్రం చేసినప్పుడు నీట్‌గానే కనిపిస్తాయి.. కానీ వాటిపై తడి ఆరిపోయాక తెల్లటి మరకలు కనిపించడం చూస్తుంటాం. ఎంత శుభ్రం చేసినా ఇడ్లీ పాత్రల పైనా ఇలాంటి మరకలే దర్శనమిస్తాయి. అలాగని వాటిని స్టీల్‌ స్క్రబ్బర్‌తో రుద్దితే గీతలు పడతాయన్న భయం. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా కొన్ని ఇంటి చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

జిడ్డు వదిలేలా..!

ఇడ్లీ తయారీలో మినప్పప్పు వాడతాం.. అయితే ఈ క్రమంలో మనం స్టీల్‌/అల్యూమినియం పాత్రలు ఉపయోగించినా, నాన్‌స్టిక్‌ ప్లేట్లు వాడినా.. మినప్పప్పులోని జిగురుదనం వల్ల అది కొద్దిగా ప్లేట్‌కు అంటుకుపోతుంది. వెంటనే తొలగించకపోతే మొండిగా తయారై ఎంత రుద్దినా వదలదు. అలాంటప్పుడు ప్లేట్స్‌ మునిగేలా గోరువెచ్చటి నీళ్లు నింపి.. అందులో కొద్దిగా లిక్విడ్‌ సోప్‌ వేయాలి. ఆపై వాటిని కాసేపు నాననివ్వాలి. ఇప్పుడు పాత్రపై పేరుకున్న అవశేషాలు తొలగిపోయేలా మెత్తటి స్క్రబ్బర్‌తో రుద్ది కుళాయి నీళ్ల కింద ఉంచి కడగాలి. ఆ తర్వాత సబ్బుతో మరోసారి రుద్ది కడిగేస్తే.. ఇడ్లీ పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి. ఇలా శుభ్రం చేస్తే అవి ఆరిపోయాక కూడా తెల్లటి మరకలు పడకుండా జాగ్రత్తపడచ్చు.

బేకింగ్‌ సోడాతో..!

బేకింగ్‌ సోడా కూడా ఇడ్లీ పాత్రలపై పేరుకున్న మరకల్ని తొలగించడంలో సమర్థంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో రెండు టేబుల్‌స్పూన్ల బేకింగ్‌ సోడాకు గోరువెచ్చటి నీళ్లు కలుపుతూ పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఇడ్లీ పాత్రలపై పూసి ఓ అరగంట పాటు పక్కన పెట్టేయాలి. ఆపై మెత్తటి స్క్రబ్బర్‌ లేదా మృదువైన బ్రిజిల్స్‌ ఉన్న టూత్‌బ్రష్‌తో రుద్దుతూ శుభ్రం చేయాలి. ఇప్పుడు మరోసారి సాధారణ డిష్‌వాష్‌ సోప్‌తో రుద్ది.. నీటితో కడిగేస్తే వాటిపై ఉన్న మరకలు పూర్తిగా తొలగిపోతాయి. ఫలితంగా కొత్త వాటిలా మెరుస్తాయి.

ఆ వాసన పోవాలంటే..!

వాడిన ప్రతిసారీ ఇడ్లీ పాత్రల్ని ఏదో అలా పైపైన కడగడం, అవి పూర్తిగా ఆరకముందే క్యాబినెట్స్‌లో పెట్టేయడం.. వంటివి చేస్తుంటారు కొందరు. దీనివల్ల కొన్నాళ్లకు వాటి నుంచి అదో రకమైన వాసన వస్తుంది. అలాంటప్పుడు దీన్ని తొలగించాలంటే వెనిగర్ ఉపయోగించాల్సిందే! ఈ క్రమంలో ఒక బకెట్‌లో నీళ్లు, వెనిగర్‌ సమపాళ్లలో తీసుకొని.. అందులో ఇడ్లీ పాత్రలు మునిగేలా రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే మృదువైన స్క్రబ్బర్‌తో రుద్ది కుళాయి నీటి కింద ఓసారి కడగాలి. ఆపై డిష్‌వాష్‌ సోప్‌తో మరోసారి రుద్ది నీటితో కడిగేస్తే సరిపోతుంది. అంతేకాదు.. ఇవి పూర్తిగా ఆరాకే క్యాబినెట్‌లో పెట్టడం మంచిది.

ఇవి గుర్తుంచుకోండి!

పాత్రల్ని ఉపయోగించుకున్న వెంటనే ఎప్పటికప్పుడు వీటిని కడిగేయడం మంచిది. అలాకాకుండా రోజుల తరబడి వాటిని అలాగే వదిలేసినా లేదంటే నీళ్లలో నానబెట్టినా.. వాటిపై తెల్లటి మరకలు పేరుకుపోతాయి.

చాలామంది ఇడ్లీలను సర్వ్‌ చేయడానికి స్టీల్‌ స్పూన్‌ ఉపయోగిస్తుంటారు. దీనివల్ల పాత్రలపై గీతలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్‌/సిలికాన్‌ స్పూన్లను ఉపయోగించడం మంచిది.

ఇడ్లీ పాత్రలు పూర్తిగా ఆరాక భద్రపరచడం ఎంత ముఖ్యమో.. ఆ క్యాబినెట్‌ అంత పొడిగా, పరిశుభ్రంగా ఉండడమూ అంతే ముఖ్యం. లేదంటే తేమకు పాత్రలపై బూజు మాదిరిగా పేరుకుపోతుంది. ఇలా వాటిపై పడిన నల్లటి మరకలు ఓ పట్టాన వదలవు కూడా!

చాలామంది వాడిన ప్రతిసారీ ఇడ్లీ పాత్రల్నే శుభ్రం చేస్తుంటారు. కానీ ఆ కుక్కర్‌/పాట్‌ని ఎప్పుడో ఒకసారి శుభ్రపరుస్తుంటారు. నిజానికి అందులో కూడా ఇడ్లీ అవశేషాలు పడిపోయే అవకాశం ఉంటుంది.. పైగా ఆవిరి కారణంగా కుక్కర్‌ అడుగున తెల్లటి లేయర్‌గా ఏర్పడుతుంది. అదే పాత్రలతో పాటే ఎప్పటికప్పుడు దాన్ని కడిగేస్తే పరిశుభ్రంగా ఉంటుంది.. దుర్వాసనా రాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్