అందుకు ఆమె భర్త ఎలా అంగీకరిస్తున్నాడో తెలియడం లేదు..!

మా పెళ్లై రెండేళ్లవుతోంది.. ఒక్క విషయంలో తప్ప మా దాంపత్య బంధం అంతా బాగానే ఉంది. నా భర్త మొదటి ఉద్యోగం చేసే సమయంలో తన తోటి మహిళా ఉద్యోగితో స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఉద్యోగాలు మారినా....

Published : 07 May 2023 11:18 IST

మా పెళ్లై రెండేళ్లవుతోంది.. ఒక్క విషయంలో తప్ప మా దాంపత్య బంధం అంతా బాగానే ఉంది. నా భర్త మొదటి ఉద్యోగం చేసే సమయంలో తన తోటి మహిళా ఉద్యోగితో స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఉద్యోగాలు మారినా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆమె ఫోన్‌ చేస్తే ఇంటికి కూడా వెళుతుంటాడు. కానీ, నా భర్త తనతో మాట్లాడడం నాకు అస్సలు నచ్చదు. నా భర్త మాత్రం ఆమెకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఈ విషయంలోనే మాకు గొడవలు అవుతున్నాయి. ఆమెకు పెళ్లైంది. ఆమె భర్త ఇలాంటి ప్రవర్తనను ఎలా అంగీకరిస్తున్నాడో తెలియడం లేదు. ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. సాధారణంగా భిన్న సంప్రదాయాలు, నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులు పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతుంటారు. అలాగే ఇద్దరి మనస్తత్వాలు వేరు వేరుగా ఉంటాయి. ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు పెళ్లి అనే బంధాన్ని కలకాలం కొనసాగించాలంటే నమ్మకమనే పునాది బలంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. దంపతుల మధ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని ఏవిధంగా పరిష్కరించుకుని ముందుకు సాగాలో ఇద్దరిపై ఆధారపడి ఉంటుంది.

ఇక మీ విషయానికి వస్తే మీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను చూపించే విషయంలో ఎలాంటి విభేదాలు లేవని అర్థమవుతోంది. అయితే మీ భర్త తన సహోద్యోగితో మాట్లాడడం, కలవడం మీకు నచ్చడం లేదన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. అయితే మీ భర్త ఆమె ఇంటికి వెళ్లినప్పుడు తన భర్తకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అభద్రతాభావం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ భర్తకు, ఆ మహిళకు మధ్య ఉన్న సంబంధంలో ఏ విషయం మీకు ఇబ్బంది కలిగిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇందుకోసం మీతో మీరు ఏకాంతంగా కొంత సమయం గడపండి. ఈ క్రమంలో మీ అభద్రతాభావం వల్ల మీకు ఇబ్బంది కలుగుతోందా? లేదంటే మీ భర్త ఆ మహిళకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం మీకు ఇబ్బంది కలిగిస్తోందా? వంటి అంశాలను నిజాయతీగా పరిశీలించుకునే ప్రయత్నం చేయండి. వీటిపై మీకంటూ ఒక అవగాహన వచ్చిన తర్వాత ఏ విషయంలో ఎక్కువగా కలత చెందుతున్నారో దాని గురించి వివరంగా, మీ ఆవేదన అర్ధమయ్యేలా మీ భర్తకు చెప్పే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని బాధిస్తున్న విషయానికి సంబంధించి ఒకవేళ అతను తన పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే అందుకు కొంత సమయం ఇవ్వండి. అప్పటికీ మీ సమస్యకు పరిష్కారం లభించకపోతే రిలేషన్‌షిప్‌ నిపుణులను సంప్రదించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్