కాలు, చెయ్యి లేకుంటేనేం.. 'ఫ్లయింగ్ ఫిష్’ అయింది!

నీళ్లలో వేగంగా ఈత కొట్టాలంటే కాళ్లు చేతులు సక్రమంగా ఉండాల్సిందే. అయితే ఒక కాలు, ఒక చెయ్యి లేకపోయినా చేపపిల్లలా వేగంగా ఈదేస్తోంది చైనాకు చెందిన జియాంగ్‌ యుయాన్‌. డాక్టర్ల సలహాలతో ఈత కొలనులోకి దిగిన ఈ అమ్మాయి ఇప్పుడు అందులో ఏకంగా ప్రపంచ రికార్డులు కొల్లగొడుతోంది.

Updated : 04 Sep 2021 18:14 IST

నీళ్లలో వేగంగా ఈత కొట్టాలంటే కాళ్లు చేతులు సక్రమంగా ఉండాల్సిందే. అయితే ఒక కాలు, ఒక చెయ్యి లేకపోయినా చేపపిల్లలా వేగంగా ఈదేస్తోంది చైనాకు చెందిన జియాంగ్‌ యుయాన్‌. డాక్టర్ల సలహాలతో ఈత కొలనులోకి దిగిన ఈ అమ్మాయి ఇప్పుడు అందులో ఏకంగా ప్రపంచ రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా పారాలింపిక్స్‌లోనూ రెండు బంగారు పతకాలు గెల్చుకుందీ టీనేజ్‌ సెన్సేషన్‌. ఇలా ఈతలో ‘ఫ్లయింగ్‌ ఫిష్‌’ గా మన్ననలు అందుకుంటోన్న ఈ పారా స్విమ్మర్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి మనమూ తెలుసుకుందాం రండి.

రెండు బంగారు పతకాలు!

గతంలోలాగే ఈసారి కూడా టోక్యో పారాలింపిక్స్‌కు 256 మందితో భారీ బృందాన్ని పంపింది చైనా. అందులో అందరి దృష్టిని ఆకర్షించింది 16 ఏళ్ల జియాంగ్‌. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఈత కొలనుకు దూరంగా ఉన్నా... పారాలింపిక్స్‌లో పాల్గొనడం మొదటిసారైనా ఏ మాత్రం తడబడలేదీ టీనేజ్‌ సెన్సేషన్‌. ఇప్పటికే మహిళల 50 మీటర్ల బటర్‌ ఫ్లై ఎస్‌-6 విభాగంలో బంగారు పతకాన్ని ముద్దాడిన ఈ అమ్మాయి... తాజాగా మహిళల 400 మీటర్ల ఫ్రీ స్టైల్‌ విభాగంలో మరో స్వర్ణం సాధించింది.

ట్రక్కు ఢీకొని!

చైనాకు చెందిన జియాంగ్‌ మూడేళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదానికి గురైంది. సరదాగా ఆటలాడుకుంటుండగా ఓ భారీ ట్రక్కు వచ్చి తనను చిదిమేసింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో తన కుడి చెయ్యి, కాలు బాగా దెబ్బతినడంతో పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. దీని తర్వాత కూడా ఎముకల పెరుగుదలకు సంబంధించి పలు సమస్యలు తలెత్తాయి. దీంతో యాక్సిడెంట్‌ తర్వాత కూడా కొన్నేళ్ల పాటు ఆస్పత్రుల చుట్టూనే తిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఎముకల ఆరోగ్యం కోసం స్విమ్మింగ్‌ చేయాలని డాక్టర్లు జియాంగ్‌కు, ఆమె తల్లిదండ్రులకు సూచించారు.

పూల్‌లో దిగొద్దన్నారు!

చిన్నతనంలోనే దివ్యాంగురాలిగా మారిపోయిన తన కూతురుని చూసి తల్లడిల్లిపోయింది వాంగ్‌ జిఫాంగ్‌. అదే సమయంలో ఈ యాక్సిడెంట్‌ కారణంగా తన బిడ్డ భవిష్యత్ అంధకార బంధురం కాకూడదనుకుంది. డాక్టర్ల సలహా మేరకు జియాంగ్‌ను ఓ స్విమ్మింగ్ శిక్షణ శిబిరంలో చేర్పించింది. 2012లో మొదటిసారి నీళ్లలో దిగిన జియాంగ్‌ తోటి పిల్లల సూటి పోటి మాటలతో తీవ్ర ఇబ్బందులు పడింది.

‘చాలామందికి నీళ్లంటే భయం. అందుకే ఈత నేర్చుకోవడానికి జంకుతారు. అయితే నాకు అలాంటి భయాలేమీ లేవు. కానీ స్విమ్మింగ్‌ ట్రైనింగ్‌ కోసం చేరిన మొదట్లో కొందరు ‘నువ్వు అసంపూర్ణురాలివి..పూల్‌లోకి దిగద్దు’ అని అవమానించారు. ఈ మాటలు ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాను’ అని ఓ సందర్భంలో తన చేదు అనుభవాలను గుర్తు చేసుకుందీ టీనేజ్‌ సెన్సేషన్.

చదువుతో పాటు స్విమ్మింగ్‌లోనూ సమాంతరంగా శిక్షణ తీసుకుంది జియాంగ్‌. 11 ఏళ్ల ప్రాయంలోనే 50 మీటర్ల బటర్‌ఫ్లై స్విమ్మింగ్‌ పోటీల్లో నేషనల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత దుబాయి ఏషియన్‌ యూత్‌ పారా గేమ్స్‌, జకార్తా ఏషియన్‌ గేమ్స్‌లో పతకాల వేట కొనసాగించింది. ఇక 2019లో లండన్‌ వేదికగా జరిగిన ప్రపంచ పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు తన మెడలో వేసుకుంది. 

మూడేళ్లు కష్టపడ్డాను!

కరోనా కారణంగా సుమారు గత ఏడాదిన్నర కాలంగా ఈత కొలనుకు దూరంగా ఉండిపోయింది జియాంగ్‌. అయితే ఆ ప్రభావం పారాలింపిక్స్‌పై పడకుండా చూసుకుంది. టోక్యో చేరుకున్నాక సాధన కోసం ఎక్కువ సేపు స్విమ్మింగ్‌ పూల్స్‌ వద్దనే గడిపింది. ఆ కష్టమే బంగారు పతకాల రూపంలో తిరిగొచ్చింది.

‘పారాలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. స్వర్ణం గెల్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నేను ఈ పతకం కోసం మూడేళ్లుగా కష్టపడుతున్నా. నేను కోరుకున్నది దక్కింది. ఇప్పటివరకు నేను గెల్చుకున్న పతకాల్లో ఇవే బెస్ట్‌. మా అమ్మానాన్నలు, కోచ్‌ సహకారం, ప్రోత్సాహంతోనే ఈ విజయాలు వస్తున్నాయి’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ ఫ్లయింగ్‌ ఫిష్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్