Humaira Jan : ర్యాప్‌ పాటలతో దుమ్ము లేపుతోంది!

ఇప్పటికీ మహిళలు ఏం చేయాలన్నా ఈ సమాజంలో ఎన్నో అడ్డంకులు, విమర్శలు! వీటన్నింటికీ మాటలతో కాకుండా పాటలతో చెక్‌ పెడుతోంది కశ్మీర్‌ లోయకు చెందిన యువ ర్యాపర్‌ హుమైరా జాన్‌.

Updated : 14 Dec 2023 12:23 IST

(Photos: Screengrab)

ఇప్పటికీ మహిళలు ఏం చేయాలన్నా ఈ సమాజంలో ఎన్నో అడ్డంకులు, విమర్శలు! వీటన్నింటికీ మాటలతో కాకుండా పాటలతో చెక్‌ పెడుతోంది కశ్మీర్‌ లోయకు చెందిన యువ ర్యాపర్‌ హుమైరా జాన్‌. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగల సమర్థులు అంటూ తన ర్యాప్‌ పాటలతోనే వారిలో స్ఫూర్తి రగిలించే ప్రయత్నం చేస్తోందామె. ఇలా మహిళా సాధికారత కోసం తన వంతుగా కృషి చేస్తోన్న ఆమె.. కశ్మీర్‌ అభివృద్ధి, ఆ రాష్ట్రంలో వచ్చిన సానుకూల మార్పులపై ఇటీవలే ఓ పాట రాసి పాడింది. ‘ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే’నంటూ సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో హుమైరా విడుదల చేసిన ఈ ర్యాప్‌ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ కశ్మీరీ ర్యాపర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

ఆర్టికల్‌ - 370 రద్దు గురించి ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వింటున్నాం. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ తీసుకొచ్చిన ఈ చట్టాన్ని కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తాజాగా.. ఈ రద్దు రాజ్యాంగబద్ధమేనని తుది తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆర్టికల్‌ - 370 రద్దు చేసినప్పట్నుంచి ఈ మూడేళ్లలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన అభివృద్ధిని కళ్లకు కడుతూ పాట రాసింది హుమైరా. మరో ర్యాపర్‌ MC Raaతో కలిసి ఆమె పాడిన ఈ ర్యాప్‌ సాంగ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

‘కశ్మీర్‌ మారుతోంది’ అంటూ..!

‘బదల్తా కశ్మీర్‌’ పేరుతో ‘కశ్మీర్‌ మారుతోంది.. కశ్మీర్‌ ధోరణి మారుతోంది.. అభివృద్ధి వైపు అడుగులేస్తోంది..’ అనే అర్థం వచ్చేలా హుమైరా రాసి పాడిన ఈ పాట దేశవ్యాప్తంగా సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ పాట బ్యాక్‌డ్రాప్‌లో కశ్మీర్‌ అందాలు, ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అక్కడి మంచు లోయల అందాలు, ఆయా రంగాల్లో పెరుగుతున్న మహిళా సాధికారత.. వంటివన్నీ కనిపించేలా వీడియోను చిత్రీకరించారు. ఇలా కశ్మీర్‌ ప్రత్యేక హోదాను రద్దు చేసి.. దేశంలో విలీనం చేయడం వల్ల అక్కడ అభివృద్ధి వేగవంతమైనట్లు తన పాట ద్వారా చెప్పకనే చెప్పిందీ యువ ర్యాపర్‌.

సంగీతమంటే ప్రాణం!

14 ఏళ్ల హుమైరా జాన్‌ సెంట్రల్‌ కశ్మీర్‌ గందేర్బల్‌ జిల్లాలోని థునే కంగన్‌ అనే ప్రాంతంలో పుట్టి పెరిగింది. ప్రస్తుతం అక్కడి ‘ఆర్మీ గుడ్‌విల్‌ స్కూల్‌’లో పదో తరగతి చదువుతోన్న ఆమెకు సంగీతమంటే చిన్న వయసు నుంచే ఇష్టమట!

‘నేను రెండో తరగతిలో ఉన్నప్పుడే నాన్న నాకు హనీ సింగ్‌ ర్యాప్‌ ఆల్బమ్‌ ‘దేశీ కళాకార్‌’ సీడీని బహుమతిగా ఇచ్చారు. అది విన్నాక ర్యాప్‌ సంగీతంపై మక్కువ పెరిగింది. దీంతో భవిష్యత్తులో ర్యాపర్‌గా స్థిరపడాలనుకున్నా. ఈ క్రమంలోనే హిప్‌-హాప్‌ సంగీతంపై దృష్టి పెట్టా. ఈ సంగీత శైలిలో మెలకువలు నేర్చుకున్నా. సొంతంగా పాటలు రాస్తూ వాటిని సాధన చేయడం మొదలుపెట్టా. అలా హిప్‌ హాప్‌లో పట్టు పెరిగింది. ఎక్కువగా మహిళలకు సంబంధించిన అంశాలపై మక్కువ చూపే నేను.. నా పాటల ద్వారా మహిళా సాధికారతను చాటాలనుకున్నా. అందుకే ఈ సమాజంలో మహిళలు ఎదుర్కొంటోన్న సవాళ్లు, వారి అభివృద్ధికి అడ్డుపడుతోన్న అంశాలపైనే ఎక్కువగా పాటలు రాసి పాడుతుంటా..’ అంటోంది హుమైరా.

వాళ్లే నా టార్గెట్‌!

అవకాశం వచ్చినప్పుడల్లా స్కూల్లో జరిగే సంగీత పోటీల్లో పాల్గొంటూ బహుమతులు గెలుచుకున్న హుమైరా.. మరోవైపు పలు కార్యక్రమాల్లోనూ సంగీత ప్రదర్శనలిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఓసారి 15 మంది పురుష సంగీత కళాకారులతో కలిసి స్టేజీ మీద ప్రదర్శన ఇచ్చిందామె.

‘15 మంది పురుష గాయకుల మధ్య నేనొక్కదాన్నే అమ్మాయినని తెలిసి చాలామంది చులకనగా చూశారు.. ఈ అమ్మాయేం పాడుతుందని విమర్శించిన వారూ లేకపోలేదు.. ఇంకొందరు నవ్వుకున్నారు. అయినా నేను వెనుకంజ వేయలేదు.. సంగీతంతో ఈ సమాజంలోని పరిస్థితుల్ని మార్చాలని, ముఖ్యంగా మహిళల ఉనికిని ప్రతిబింబించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఫేమస్‌ అవ్వాలనో, సోషల్‌ స్టార్‌గా ఎదగాలనో నేను ఇదంతా చేయట్లేదు.. నా పాటల్లోని అంతరార్థం అర్థం చేసుకొని ఒక్కరు మారినా నాకు ఆనందమే!’ అంటోందీ కశ్మీరీ ర్యాపర్‌.

‘ఔరత్‌’తో సెన్సేషనల్‌గా!

ఇప్పటికే పలు ర్యాప్‌ సాంగ్స్‌తో పాపులారిటీ సంపాదించిన హుమైరా.. మహిళా సమస్యల్ని చాటేలా గతేడాది ‘ఔరత్‌’ అనే మరో పాటను విడుదల చేసింది. మహిళల జీవనశైలి, స్త్రీపురుష అసమానతలకు అద్దం పట్టేలా ఉన్న ఈ పాట అప్పట్లో సెన్సేషనైంది. అంతేకాదు.. శ్రీనగర్‌కు చెందిన ఓ ఆమ్లదాడి బాధితురాలి కథనూ పాట ద్వారా కళ్లకు కట్టిందామె.
‘మహిళలు ఇది చేయకూడదు.. అది చేయకూడదు.. ఇంటికే పరిమితవ్వాలని వారిపై బోలెడన్ని ఆంక్షలు పెడుతుంటారు కొందరు. నిజానికి స్త్రీలు ఏదైనా చేయగల సమర్థులు. అలాంటప్పుడు ఇతరుల మాటలకు ఎందుకు తలొగ్గాలి? కాబట్టి ధైర్యంగా ముందుకు రండి.. నచ్చిన రంగంలోకి అడుగుపెట్టి మీ ఆశయాల్ని నెరవేర్చుకోండి..’ అంటోన్న హుమైరాకు నటన అన్నా మక్కువేనట! నటిగా రాణించాలనుకున్నా పలు కారణాల వల్ల ఆ కల నెరవేరలేదంటోందీ యువ గాయని.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్