Karting Racer: తన స్పీడుకు బ్రేకుల్లేవు!
చిన్న వయసులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పోటీపడుతూ.. అటు పతకాలు సాధించడంతో పాటు.. ఇటు అవార్డులూ, రివార్డులూ సొంతం చేసుకుంటోన్న ఈ కార్టింగ్ రేసర్.. భవిష్యత్తులో మోటార్ స్పోర్ట్స్‌లో అమ్మాయిల ప్రాతినిథ్యం పెంచడమే తన లక్ష్యమంటోంది.
(Photos: Instagram)
మోటార్ స్పోర్ట్స్.. మన దేశంలో వీటికి ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. అయితే సాధారణంగా దీన్ని ఎంచుకునే వారిలో అబ్బాయిలే ఎక్కువ! ఈ సమీకరణాల్ని తారుమారు చేయడమే లక్ష్యంగా ఈ క్రీడను తన కెరీర్‌గా ఎంచుకుంది 15 ఏళ్ల శ్రియా లోహియా. తొమ్మిదేళ్లకే 90 కిలోమీటర్ల వేగంతో దూసుపోవడం నేర్చుకున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు ఏకంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కార్టింగ్ కారు నడపడంలో నైపుణ్యాలు సాధించింది. ఇంత చిన్న వయసులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పోటీపడుతూ.. అటు పతకాలు సాధించడంతో పాటు.. ఇటు అవార్డులూ, రివార్డులూ సొంతం చేసుకుంటోన్న ఈ కార్టింగ్ రేసర్.. భవిష్యత్తులో మోటార్ స్పోర్ట్స్‌లో అమ్మాయిల ప్రాతినిథ్యం పెంచడమే తన లక్ష్యమంటోంది.
పుణేలో పుట్టి పెరిగిన శ్రియది హిమాచల్‌ప్రదేశ్‌లోని సుందర్‌నగర్ అనే చిన్న పట్టణం. ఆమె తల్లిదండ్రులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే! తనకో అక్క. ప్రస్తుతం తను రైఫిల్ షూటర్‌గా రాణిస్తోంది. అక్కను చూస్తూ పెరిగిన శ్రియకూ ఆటల్లో రాణించాలన్న మక్కువ పెరిగింది.
కార్ట్ రేసింగ్ అలా పరిచయమైంది!
అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు శ్రియ. స్కూల్లో టాపర్‌గా రాణిస్తూనే.. మరోవైపు క్రీడలపై దృష్టి పెట్టానంటోంది.
‘చిన్నప్పుడు ఎన్నో బొమ్మలతో ఆడుకునేదాన్ని. అలా ఓసారి బ్యాటరీ కారు స్టీరింగ్ పట్టుకున్నా. ఆ ఆట నాకెంతో నచ్చింది. అక్కను చూసి ఆటల్లో రాణించాలనుకున్నా.. కానీ ఏ క్రీడను ఎంచుకోవాలో స్పష్టత లేదు. ఇలాంటి తరుణంలో ఈ ఆట నా కెరీర్‌ను ఎంచుకునే మార్గాన్ని సుగమం చేసింది. అలా కార్ట్ రేసింగ్ (ఇదో రకమైన మోటార్ స్పోర్ట్)ను ఎంచుకున్నా. అయితే ఇందుకు ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం. ఈ క్రమంలోనే ఇంట్లో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ నా శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడం మొదలుపెట్టా. అమ్మానాన్నల ప్రోత్సాహం, అక్క ప్రేరణతో తొమ్మిదేళ్ల వయసులో శిక్షణ కోసం కార్టింగ్ ట్రాక్ పైకి వెళ్లా. ఈ క్రీడలో నా తొలి అనుభవమే నాకు ప్రత్యేకమైన అనుభూతుల్ని పంచింది. అయితే కార్ట్ రేసింగ్ శిక్షణ వల్ల చాలాసార్లు స్కూలు మిస్సయ్యేదాన్ని. దాంతో అమ్మానాన్న ఇంట్లోనే నాకు ట్యూషన్ పెట్టించారు. ప్రస్తుతం నేను పదో తరగతి చదువుతున్నా.. మరోవైపు కార్ట్ రేసింగ్ పోటీల్లోనూ పాల్గొంటున్నా..’ అంటోంది శ్రియ.
ఆ విజయం మర్చిపోలేను!
కార్ట్ రేసింగ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించిన ఏడాదికే.. ఈ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది శ్రియ. అలా 2018లో తన పదేళ్ల వయసులో ‘రోటక్స్ మ్యాక్స్ ఇండియా కార్టింగ్ ఛాంపియన్‌షిప్’ పోటీలో పాల్గొని నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో పతకాలేవీ సాధించకపోయినా.. బోలెడన్ని పాఠాలు నేర్చుకున్నానంటోందీ కార్ రేసర్.
‘నేను పాల్గొన్న తొలి పోటీలో విజయం సాధించకపోయినా.. ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇలా ప్రతి పోటీ నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటూ, నైపుణ్యాలు మెరుగుపరచుకుంటూ ముందుకు సాగా. ఇక 2022లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ‘రోటక్స్ మ్యాక్స్ కార్టింగ్ ఛాంపియన్‌షిప్’లో గెలుపొందా. ప్రపంచవ్యాప్తంగా ఈ టోర్నీలో పోటీపడ్డ 14 మంది అమ్మాయిల్ని వెనక్కి నెట్టి మరీ విజయం సాధించడం మర్చిపోలేను. అంతేకాదు.. ఈ టోర్నీ నెగ్గిన తొలి భారతీయ అమ్మాయిని కూడా నేనే! కార్ట్ రేసింగ్‌లో ప్రస్తుతం జూనియర్ స్థాయిలో ఉన్నా. కార్ రేసింగ్ లైసెన్స్ వస్తేనే ఫార్ములా వన్ పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించచ్చు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఈ లైసెన్స్ అందుకోబోతున్నా. ఎందుకంటే 15 ఏళ్లు నిండితేనే ఈ లైసెన్స్ పొందడానికి అర్హత లభిస్తుంది..’ అంటోందీ యువ రేసర్.
ఆర్థిక సవాళ్లూ ఎన్నో!
క్రీడల్లో శిక్షణకయ్యే ఖర్చు ఒకెత్తయితే.. ఆయా పోటీల్లో పాల్గొనడానికయ్యే ఖర్చు మరో ఎత్తు! జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పోటీ పడే క్రమంలో తానూ ఆర్థికంగా పలు సవాళ్లు ఎదుర్కొన్నానంటోంది శ్రియ.
‘ఇతర క్రీడలతో పోల్చితే మోటార్ కార్ రేసింగ్ చాలా ఖరీదైన క్రీడ. మాది మధ్యతరగతి కుటుంబం కావడంతో.. మొదట్లో స్పానర్లు లేక పోటీల్లో పాల్గొనే క్రమంలో పలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఆ తర్వాత నేను విజయాలు సాధిస్తున్న కొద్దీ స్పానర్లు రావడం మొదలైంది. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద మోటార్ స్పోర్ట్స్ టీమ్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ నన్ను స్పాన్సర్ చేస్తోంది. ఇప్పుడు ఈ టీమ్ జూనియర్ డ్రైవర్‌గా కొనసాగుతున్నా. ఇక మొదట్లో ఎక్కడ పోటీలున్నా నాన్న వెంట వచ్చేవారు. ఇప్పుడు ఒంటరిగానే వెళ్తున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందామె.
ప్రధాని ప్రశంసలు!
తాను కార్టింగ్‌లోకొచ్చిన తొలినాళ్లలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో కార్ట్ కార్ నడిపిన శ్రియ.. ఇప్పుడు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేలా రేసింగ్ నైపుణ్యాలు సాధించింది. తన కార్ట్ రేసింగ్ జర్నీలో ఇప్పటివరకు పలు పతకాలతో పాటు.. అవార్డులు, రివార్డులూ అందుకుంది. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా ‘రాష్ట్రీయ బాల పురస్కారం’ అందుకున్న ఈ యువ రేసర్‌ను.. మోదీజీ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. ఇక ఇటీవలే ‘ది ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (FMSCI)’ నుంచి ‘ఔట్‌స్టాండింగ్ విమెన్ ఇన్ మోటార్ స్పోర్ట్స్’ అవార్డు గెలుచుకుంది శ్రియ. అలాగే మరో పత్రిక ‘ఎమర్జింగ్ ఉమన్ ఇన్ మోటార్‌స్పోర్ట్స్’ అవార్డుతో గౌరవించింది. ఇలా తన ప్రతిభతో మోటార్ స్పోర్ట్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రియ.. ఈ క్రీడలో అమ్మాయిల్ని ప్రోత్సహించడమే తన లక్ష్యమంటోంది. భవిష్యత్తులో దేశంలోనే ఉత్తమ మోటార్ కార్ రేసర్‌గా ఎదగాలని కలలు కంటోన్న ఈ డేరింగ్ గర్ల్.. ఖాళీ సమయాల్లో తన పెట్‌తో ఆడుకోవడం; బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, పిస్టల్ షూటింగ్, సైక్లింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్.. వంటివి సాధన చేయడానికి ఇష్టపడుతుందట!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.