Jada Pinkett : ప్రేయసిగా నటించమంటే భార్యగా మారింది!

మన ప్రాణానికి ప్రాణమైన వారిని పల్లెత్తు మాటన్నా మనం ఊరుకోం. అలాంటిది కట్టుకున్న భార్యను కళ్లెదుటే హాస్యాస్పదంగా మాట్లాడుతుంటే.. ఆ ఆవేశంలో వాళ్లను ఓ చెంప దెబ్బ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ వేడుకల్లో తొలిసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఉత్తమ నటుడిగా ఎంపికైన విల్‌ స్మిత్‌ భార్య జాడా

Published : 29 Mar 2022 19:03 IST

(Photo: Instagram)

మన ప్రాణానికి ప్రాణమైన వారిని పల్లెత్తు మాటన్నా మనం ఊరుకోం. అలాంటిది కట్టుకున్న భార్యను కళ్లెదుటే హాస్యాస్పదంగా మాట్లాడుతుంటే.. ఆ ఆవేశంలో వాళ్లను ఓ చెంప దెబ్బ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ వేడుకల్లో తొలిసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఉత్తమ నటుడిగా ఎంపికైన విల్‌ స్మిత్‌ భార్య జాడా పింకెట్‌పై వ్యాఖ్యాత ఓ జోక్‌ వేశారు. అది కాస్తా వికటించి ఆయన చెంప దెబ్బ తినే దాకా వెళ్లింది. దాంతో అసలు ఏం జరుగుతోందో అర్థం కాక ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతైంది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. విల్‌ తన భార్యకు అండగా నిలిచిన తీరు చాలామందితో చప్పట్లు కొట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ క్యూట్‌ కపుల్‌ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం రండి..

అమెరికన్‌ నటుడు విల్‌ స్మిత్‌ తన భార్య జాడా పింకెట్‌తో కలిసి ఆస్కార్‌ అవార్డుల వేడులకు హాజరయ్యాడు. ఈ కార్యక్రమం మధ్యలో వ్యాఖ్యాత క్రిస్‌ రాక్‌ ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే గుండుతో ఉన్న జాడా ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమెను ‘జీ.ఐ.జేన్‌’ చిత్రంలో గుండుతో నటించిన డెమీ మూర్‌ పాత్రతో పోల్చాడు. ‘ఈ సినిమా సీక్వెల్‌లో మీరు కనిపించనున్నారా?’ అంటూ హాస్యాస్పదంగా మాట్లాడాడు. దీంతో కాస్త ఇబ్బందికి గురైంది జాడా. ఇది చూసిన స్మిత్‌ ‘నా భార్యను అంత మాటంటావా?’ అంటూ కోపంతో వేదిక పైకి ఎక్కి రాక్‌ చెంప పగలగొట్టాడు. ‘నా భార్య పేరు నీ నోటి వెంట రావద్దం’టూ హెచ్చరించాడు. ఇదంతా చూస్తూ గందరగోళానికి గురయ్యారు ప్రేక్షకులు. అయితే ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని రాక్‌కు ఇన్‌స్టా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగినట్లైంది.

అందుకే గుండు చేయించుకున్నా!

నిజానికి జాడా గుండుతో కనిపించడానికి ఓ ప్రధాన కారణం ఉంది. అదేంటంటే.. గత మూడేళ్ల నుంచి ఆమె ‘అలొపేషియా ఎరేటా’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ సమస్య ఉన్నవారిలో రోగనిరోధక శక్తి జుట్టు కుదుళ్లపై దాడి చేస్తుంది. తద్వారా వెంట్రుకలు క్రమంగా రాలిపోయి.. కుదుళ్లపై అక్కడక్కడా ప్యాచుల్లా ఏర్పడుతుంటాయి. ఈ సమస్య ఎక్కువవడం వల్లే తాను పూర్తిగా గుండు చేయించుకున్నానని చెప్పుకొచ్చింది జాడా. 2018లో తన ‘రెడ్‌ లేబుల్‌ టాక్‌ షో’లో భాగంగా ఈ వ్యాధి ద్వారా తనకెదురైన చేదు అనుభవాలను తొలిసారి బయటపెట్టిందామె.

‘నాకు అలొపేషియా సమస్య ఉందని తెలిశాక చాలా భయపడ్డా. ఓరోజు తలస్నానం చేస్తున్నప్పుడు ఎక్కువ మొత్తంలో జుట్టు రాలిపోవడం గమనించాను.. కొన్నాళ్లయ్యాక బట్టతల వస్తుందేమోనని భయమేసింది. అందుకే పూర్తిగా గుండు చేయించుకున్నా. ఇక దీన్ని కవర్‌ చేసుకోవడానికి టర్బన్స్‌ (తలపాగా లాంటిది) ధరించా. అయితే మీరు ఎందుకిలా ధరిస్తున్నారని చాలామంది నన్ను అడిగేవారు. కానీ ఆ సమయంలో నా సమస్య గురించి చెప్పడానికి నేను ఇష్టపడలేదు. దీన్నుంచి బయటపడడానికి స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లు కూడా ప్రయత్నించా. కానీ ఫలితం కనిపించలేదు..’ అంటూ తన సమస్య గురించి చెప్పుకొచ్చింది జాడా. ఇక ఇలాంటి ప్రతికూల సమయంలో తన భర్త స్మిత్‌, తన ఇద్దరు పిల్లలు విల్లో (కూతురు), జాడెన్‌ (కొడుకు).. అండగా నిలిచారంటోందామె.

సెట్స్‌లో మొదలైన ప్రేమాయణం!

భార్యాభర్తలిద్దరూ సుఖాల్లోనే కాదు.. కష్టాల్లోనూ పాలుపంచుకోవాలి.. అయితే ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతురాలినంటోంది జాడా. 1997లో వివాహమైనప్పట్నుంచి స్మిత్‌ తనను కంటికి రెప్పలా కాచుకుంటున్నాడని చెబుతోంది. అది ఆస్కార్‌ వేదికపై తాజాగా మరోసారి నిరూపితమైంది. ఇది కాస్త వివాదాస్పదమే అయినా.. స్మిత్‌ తన భార్యకు అండగా నిలిచిన తీరు అందరినీ మెప్పిస్తోంది.

నిజానికి అందరు సెలబ్రిటీల్లాగే వీరిదీ ప్రేమ వివాహమే! ‘ది ఫ్రెష్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ బెల్‌-ఎయిర్‌’ అనే కామెడీ టీవీ సిరీస్‌లో తొలిసారి కలుసుకుందీ జంట. క్రమంగా వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇక 1995లో స్మిత్ తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నాక జాడాతో తన రిలేషన్‌షిప్‌ గురించి బయట ప్రపంచానికి తెలియజేశాడు. ఆపై రెండేళ్లుగా డేటింగ్‌ చేసిన ఈ జంట.. 1997లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంట ప్రేమకు గుర్తుగా తొలుత కొడుకు జాడెన్‌, ఆపై కూతురు విల్లో జన్మించారు. సందర్భం వచ్చినప్పుడల్లా తమ వైవాహిక బంధంలోని ఒడిదొడుకుల్ని బహిరంగంగా చెప్పుకునే ఈ జంట.. ప్రపంచవ్యాప్తంగా పవర్‌ఫుల్‌ కపుల్‌గా పేరు తెచ్చుకుంది.

నటిగా.. సమాజ సేవకురాలిగా..!

* జాడా మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో 1971లో జన్మించింది. ఆమె తండ్రి ఆఫ్రికన్‌-అమెరికన్‌ కాగా, తల్లి ఆఫ్రో-కరేబియన్.

* స్మిత్‌ను పెళ్లి చేసుకోకముందే నటిగా మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించుకుందామె. ‘ఎ డిఫరెంట్‌ వరల్డ్‌’ అనే టీవీ సిరీస్‌, ‘నట్టీ ప్రొఫెసర్‌’.. అనే సినిమాతో నటిగా తనను తాను నిరూపించుకుంది జాడా.

* ఇలా నటిగానే కాదు.. నిర్మాతగా, స్క్రీన్‌రైటర్‌గా, గాయనిగా, వ్యాపారవేత్తగా.. తన కెరీర్‌లో విజయాలు అందుకుందీ మిసెస్‌ స్మిత్. ఈ క్రమంలోనే 2002లో ‘విక్‌డ్‌ విజ్డమ్‌’ అనే రాక్‌ బ్యాండ్‌ను నెలకొల్పి.. దానికి నాయకత్వం వహించింది.

* 2004లో ‘గర్ల్స్‌ హోల్డప్‌ ది వరల్డ్‌’ అనే పిల్లల పుస్తకం రాశారు జాడా. దీన్ని తన కూతురు విల్లోకు అంకితమిచ్చిందామె. ఈ పుస్తకం ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్ సెల్లర్‌ లిస్ట్‌’లో రెండో స్థానంలో నిలిచింది.

* జాడా, స్మిత్‌లది సహాయం చేసే మనస్తత్వం. ఈ క్రమంలోనే వీరిద్దరూ 2010లో CharityWater.org అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపి ప్రజలకు మంచి నీటి సదుపాయం కల్పించడానికి నిధులు సమీకరించారు. అంతేకాదు.. 2012లో ఇథియోపియా ప్రజలకు మంచి నీళ్లు చేరువ చేయడానికి సుమారు రూ. 5 కోట్లకు పైగా నిధులు సేకరించారు.

* 1996లో ‘విల్‌ అండ్‌ జాడా స్మిత్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌ (WJSFF)’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. దాని ద్వారా వివిధ రకాల సేవ కార్యక్రమాలు నిర్వహిస్తోందీ జంట. పేద ప్రజలకు విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల్ని అందించే ముఖ్యోద్దేశంతో ముందుకు సాగుతోందీ సంస్థ.

* 2013లో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రారంభించిన ‘బిప్పర్‌’ అనే స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టింది జాడా. దీనిద్వారా ఎంతోమంది జీవితాల్ని, తద్వారా వాళ్ల కుటుంబాల్ని కాపాడే మహదవకాశం దొరుకుతుందంటోందామె. అంతేకాదు.. మానవ అక్రమ రవాణాపై అందరిలో అవగాహన నింపడానికి ‘చిల్డ్రన్‌ ఫర్‌ సేల్‌’ అనే డాక్యుమెంటరీని కూడా నిర్మించింది జాడా.

* 2018లో ఫేస్‌బుక్‌ వేదికగా ‘రెడ్‌ లేబుల్‌ టాక్‌’ అనే టాక్‌ షోను ప్రారంభించిన జాడా.. ఏడాది కాలంలోనే ఈ షోను సక్సెస్ పట్టాలెక్కించింది. తద్వారా 2020, 21కి గాను వరుసగా రెండుసార్లు ఎమ్మీ అవార్డుల్ని గెలుచుకుంది.

* స్మిత్‌ మొదటి భార్య షీరీ ఫ్లెచర్‌తో జాడాకు సత్సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే 2018లో ఆమెను ‘రెడ్‌ లేబుల్‌ టాక్‌’ షోకు ఆహ్వానించింది జాడా. తద్వారా తమ మధ్య ఉన్న స్నేహపూర్వక బంధం గురించి బయటి ప్రపంచానికి తెలియజేసింది.

* ‘హే హ్యూమన్స్‌’ అనే వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్‌ని ప్రారంభించింది జాడా. ప్లాస్టిక్‌ని నిర్మూలించి సహజసిద్ధమైన ఉత్పత్తుల్ని అందరికీ చేరువ చేయడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం. అంతేకాదు.. ఆయా ప్రొడక్ట్స్‌ని సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉంచుతోందామె.

* నల్ల జాతీయురాలైన ఆమె.. రంగు కంటే ప్రతిభ ముఖ్యమని పదే పదే చెబుతుంటుంది. ఈ క్రమంలోనే ప్రముఖ/స్ఫూర్తిదాయక ఆఫ్రికన్‌ మహిళల జీవితాల్ని రంగరించి రూపొందించిన పలు డాక్యుమెంటరీ సిరీస్‌లకు నిర్మాతగా వ్యవహరించారు. అవి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శితమవడం, తద్వారా ఆమెకు గుర్తింపు లభించడం చకచకా జరిగిపోయాయి.

* ఇలా తన ప్రతిభతో, సేవా కార్యక్రమాలతో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన జాడా.. గతేడాది టైమ్‌ పత్రిక ప్రచురించిన ‘ప్రపంచంలోనే వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో’ స్థానం సంపాదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్