Kim Ju Ae: కిమ్ కూతురే దేశాన్ని ఏలుతుందా?

ఈ రోజుల్లో చాలామంది ప్రపంచమంతా చుట్టేస్తూ వాటికి సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ, అందులో చూడని ప్రాంతం ఏదైనా ఉందా? అంటే ఉత్తర కొరియా అనే సమాధానం వస్తుంటుంది.

Published : 11 Jan 2024 12:09 IST

(Photos: Screengrab)

ఈ రోజుల్లో చాలామంది ప్రపంచమంతా చుట్టేస్తూ వాటికి సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ, అందులో చూడని ప్రాంతం ఏదైనా ఉందా? అంటే ఉత్తర కొరియా అనే సమాధానం వస్తుంటుంది. అవును.. ఆ దేశంలో ఎన్నో కఠిన నిమయాలు ఉంటాయి. అంతేకాకుండా అక్కడి రాచరిక వ్యవస్థ, క్షిపణి ప్రయోగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్‌ అనుమతి లేనిది చిన్న చీమైనా కదలదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి దేశానికి ఆయన కూతురు కిమ్‌ జు (Kim Ju Ae) తర్వాతి అధ్యక్షురాలయ్యే అవకాశం ఉందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ వ్యవస్థ (NIS) తెలిపింది. దాంతో మరోసారి ఆ దేశం వార్తల్లో నిలిచింది. ఒకవేళ అదే నిజమైతే 80 ఏళ్ల చరిత్రలో ఉత్తర కొరియాకు కిమ్‌ జు మొదటి మహిళా అధ్యక్షురాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా...

ప్రతిదీ రహస్యమే...!

ఉత్తర కొరియాకు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచీ కిమ్‌ కుటుంబ సభ్యులే దేశాన్ని పరిపాలిస్తున్నారు. అక్కడ ప్రతిదీ రహస్యమే. ఏ విషయమైనా ప్రభుత్వ అధికారిక మీడియా ద్వారానే బయటకు రావాల్సి ఉంటుంది. దాంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ, ఉత్తర కొరియాకు దాయాది దేశమైన దక్షిణ కొరియా తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా పలు విషయాలను ప్రపంచానికి తెలియజేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే కిమ్‌ తర్వాత అధ్యక్షురాలిగా తన కూతురు కిమ్‌ జు అయ్యే అవకాశం అధికంగా ఉందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ( (NIS) తెలిపింది.

మొదటిసారి అలా...!

నియంత దేశంలో ప్రతి అంశమూ రహస్యమే కాబట్టి వారి కుటుంబం గురించి సరైన వివరాలు బాహ్య ప్రపంచానికి ఎక్కువ తెలియదు. కిమ్‌, Ri Sol Juని పెళ్లి చేసుకున్న విషయం కూడా కొంతకాలం వరకు బయటకు వెల్లడి కాలేదు. అలాగే అతని పిల్లల గురించి కూడా సరైన సమాచారం లేదు. కిమ్‌కు కిమ్ జు రెండో సంతానంగా పలు కథనాలు చెబుతున్నాయి. ఆమె ఉనికి 2013లో మొదటిసారి బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఓసారి మాజీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ డెన్నిస్‌ రాడ్‌మన్ కిమ్‌ ఫ్యామిలీని కలుసుకున్నాడు. ఆ సందర్భంలోనే కిమ్‌ కూతురు జుని తాను ఎత్తుకున్నట్టు చెప్పడంతో బాహ్య ప్రపంచానికి తెలిసింది.

మళ్లీ పదేళ్లకు...!

కిమ్‌ జు గురించిన సమాచారం మళ్లీ పదేళ్లకు కానీ తెలియలేదు. 2022 నవంబరులో క్షిపణి పరీక్ష సమయంలో కిమ్‌ తన కూతురిని వెంటబెట్టుకుని కనిపించారు. అలా పదేళ్ల తర్వాత కానీ కిమ్‌ జు ప్రజలకు కనిపించలేదు. ఆ తర్వాత నుంచి వివిధ కార్యక్రమాలకు కిమ్ తన కూతురిని తీసుకొచ్చాడు. అయితే మొదట్లో కిమ్‌ జుని కిమ్‌కు ‘ప్రియమైన పుత్రిక’గా అభివర్ణించిన అక్కడి మీడియా ఇప్పుడు ‘గౌరవనీయురాలైన కుమార్తె’గా పిలుస్తోంది. సాధారణంగా ఉత్తర కొరియాలో అత్యంత గౌరవనీయులకు మాత్రమే ఈ విశేషణాన్ని ఉపయోగిస్తుంటారు. దాంతో ఉత్తర కొరియాకు కిమ్‌ జు అధ్యక్షురాలయ్యే అవకాశం ఉందన్న వార్తకు మరింత బలం చేకూరుతోంది.

కిమ్‌ చెల్లెలు..

ఉత్తర కొరియా గురించి ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు. నాలుగేళ్ల క్రితం కూడా కిమ్‌ ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయి. దాంతో తదుపరి అధ్యక్ష పదవిని అతని చెల్లెలు కిమ్‌ యో జోంగ్‌ చేపడుతుందని వార్తలు వచ్చాయి. దానికి కూడా పలు కారణాలు ఉన్నాయి. సొంత నీడను కూడా నమ్మని కిమ్‌ ఎన్నో తనిఖీల తర్వాత గానీ ఎవరినీ కలవడు. అలాంటిది యో జోంగ్‌ ఎలాంటి తనిఖీలు లేకుండా కలవడం, కిమ్‌తో కలిసి అంతకుముందు పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో యో జోంగ్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడుతుందని భావించారు. కొంతకాలానికే కిమ్‌ ఆరోగ్యంగా ఉన్నట్లు ఫొటోలు రావడం.. ఆ తర్వాత నేరుగా ప్రజలకు కనిపించడంతో ఆ వార్తలకు బ్రేకులు పడ్డాయి.

8 ఏళ్ల వయసులోనే..!

కిమ్‌ జు కి 10 నుంచి 12 ఏళ్ల వయసు మాత్రమే ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో తను అధ్యక్ష బాధ్యతలు చేపడుతుందా? అనే అంశానికి నిపుణులు విభిన్నంగా స్పందిస్తున్నారు. తన వారసత్వాన్ని కొనసాగించే సత్తా కిమ్‌ జుకే అధికంగా ఉందని, ఆ విషయాన్ని కిమ్‌ బలంగా నమ్ముతున్నారని నిపుణులు అంటున్నారు. అందులో భాగంగానే ఇప్పటి నుంచే తనను ప్రజలకు పరిచయం చేస్తున్నాడని చెబుతున్నారు. కిమ్‌ జు వయసు గురించి మాట్లాడుతూ కిమ్ని కూడా ఎనిమిదేళ్ల వయసులోనే అతని తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్ తన వారసుడిగా ప్రకటించారట. అయితే అధ్యక్ష బాధ్యతలను మాత్రం తండ్రి మరణానంతరం 2011లో స్వీకరించారు. దాంతో కిమ్‌ జు వారసత్వం కూడా అందుకు కొనసాగింపేనని అర్థమవుతోంది.

పితృస్వామ్య వ్యవస్థ నుంచి...

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కిమ్‌ వంశస్తులే ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు. దాదాపు 80 ఏళ్ల చరిత్రలో మూడు తరాల వారు ఆ దేశాన్ని పాలించారు. అయితే అందరూ పురుషులే కావడం గమనార్హం. ఒకవేళ కిమ్‌ జు తర్వాతి అధ్యక్షురాలైతే ఆ దేశానికి మొదటి మహిళ అధ్యక్షురాలిగా అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా బలంగా ఉన్న పితృస్వామ్య వ్యవస్థకు నియంత దేశంలో కూడా బీటలు వారే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్