ఈ పాత్రల్లో వండితే రుచి, ఆరోగ్యం!

ఇప్పుడు చాలామంది వింటేజ్ కుక్‌వేర్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. వీటిలో వండితే చక్కటి రుచితో పాటు, ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మట్టి, ఇనుప పాత్రలకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి సోప్‌స్టోన్‌ కుక్‌వేర్‌ కూడా చేరింది. పేరు మోడ్రన్‌గా ఉన్నా.. ఇవి పాత కాలపు రాతి పాత్రలే..!

Published : 17 Aug 2023 13:03 IST

ఇప్పుడు చాలామంది వింటేజ్ కుక్‌వేర్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. వీటిలో వండితే చక్కటి రుచితో పాటు, ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మట్టి, ఇనుప పాత్రలకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి సోప్‌స్టోన్‌ కుక్‌వేర్‌ కూడా చేరింది. పేరు మోడ్రన్‌గా ఉన్నా.. ఇవి పాత కాలపు రాతి పాత్రలే..! కొత్తగా, ఈ కాలం వారి అభిరుచులకు తగినట్లుగా రూపుదిద్దుకొని మరీ మార్కెట్లో కొలువు తీరాయి. ఈ క్రమంలో వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి..

సోప్‌స్టోన్‌ అని ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకుంటున్నాం కానీ.. పాత కాలంలో రోళ్లు, తిరగలి.. వంటివన్నీ ఈ రాయితో తయారైనవే! అయితే ప్రస్తుతం ఈ రాయితో ప్యాన్స్‌, కడాయి, ఇతర వంట పాత్రలు.. వంటివన్నీ రూపుదిద్దుకుంటున్నాయి. ఈ రాయి ఎన్నో ఖనిజాల మిళితమని, ముఖ్యంగా ఇందులో మెగ్నీషియం అధికంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇక ఈ పాత్రల్లో వండుకొని తినడం వల్ల వీటిలోని పోషకాలు శరీరంలోకి చేరతాయని, తద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాల్ని పొందచ్చని సలహా ఇస్తున్నారు.

పదే పదే వేడి చేయక్కర్లేదు!
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వండిన పదార్థాల్ని పదే పదే వేడి చేయడం మనకు అలవాటే! దీనివల్ల ఆయా పదార్థాల్లోని పోషకాలు విచ్ఛిన్నమై చివరకు అది విషపూరితమవుతుందంటున్నారు నిపుణులు. అదే సోప్‌స్టోన్‌ కుక్‌వేర్‌లో వండిన పదార్థాల్ని పదే పదే వేడి చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ రాయి వేడెక్కడానికి కాస్త సమయం పట్టినా.. వేడెక్కాక మాత్రం అది చల్లబడడానికి కొన్ని గంటల సమయం పడుతుందట! అందుకే ఒకసారి వేడెక్కాక ఈ వంట పాత్రల్లో వంట త్వరగా పూర్తవుతుందని, ఇందులో వండిన పదార్థం దాదాపు మూడు నుంచి నాలుగ్గంటల దాకా వేడిగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి పదే పదే వేడి చేయాల్సిన అవసరం రాదు.

ఆ లోపాన్ని పూడ్చుకోవచ్చు!
శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే వికారం, వాంతులవడం, ఆకలి లేకపోవడం, అలసట, నీరసం, అధిక రక్తపోటు, ఆస్టియోపొరోసిస్‌.. వంటి సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ లోపాన్ని పూడ్చుకోవాలంటే మెగ్నీషియం అధికంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు ఈ ఖనిజం ఎక్కువగా ఉండే సోప్‌స్టోన్‌ వంటపాత్రల్ని ఉపయోగించడం మంచిదంటున్నారు నిపుణులు. వంట చేసే క్రమంలో ఈ రాయిలోని మెగ్నీషియం ఆయా పదార్థాల్లోకి చేరి.. మన శరీరానికి అందుతుంది. ఫలితంగా మెగ్నీషియం లోపాన్ని కొంతవరకు అధిగమించచ్చు.

వాటిని బ్యాలన్స్‌ చేస్తుంది!
పులుపు, మసాలాలు జోడించిన పదార్థాలు తినడం వల్ల వాటిలోని ఆమ్ల గుణాలు కడుపులో మంట, అజీర్తి.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. వీటిని దీర్ఘకాలం పాటు ఇలాగే తినడం అస్సలు మంచిది కాదు. అయితే ఇవే పదార్థాల్ని సోప్‌స్టోన్‌ కుక్‌వేర్‌లో వండుకొని తీసుకుంటే.. అందులో మిళితమై ఉన్న మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు వీటిలోని ఆమ్లత్వాన్ని తటస్థీకరించి.. పులుపు, మసాలా ఘాటును తగ్గిస్తాయి. అలాగని వంట రుచి తగ్గిపోదని, ఆయా జీర్ణ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కువ కాలం మన్నాలంటే..!
మిగతా పాత్రలతో పోల్చితే సోప్‌స్టోన్ పాత్రల్లో వంట చేయడం ద్వారా సమయం, గ్యాస్ రెండూ ఆదా అవుతాయంటున్నారు నిపుణులు. అయితే వీటి వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవి ఎక్కువ కాలం మన్నుతాయంటున్నారు.
* ఈ పాత్రల్ని సబ్బు, వేడి నీటితో శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆపై పొడి కాటన్ వస్త్రంతో తుడవాలి.
* పొడిగా తుడిచిన తర్వాత పాత్రల లోపల, వెలుపల వంట నూనె పూయాలి. ఆపై వేడిగా, పొడిగా ఉండే ప్రదేశాల్లోనే ఈ పాత్రల్ని ఒక రోజంతా భద్రపరచాల్సి ఉంటుంది.
* ఈ పాత్రలు వేడిగా ఉన్నప్పుడు శుభ్రం చేయకూడదు.. పూర్తిగా చల్లారాక మాత్రమే వీటిని కడగాలి.
* ఈ పాత్రల్లో కలపడానికి చెక్క స్పూన్స్ మాత్రమే ఉపయోగించాలి. స్టీల్‌వి ఉపయోగిస్తే వాటిలో గీతలు పడి వాటి నాణ్యత తగ్గిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్