చర్మానికి హాని చేయకుండా మేకప్ ఇలా..!

వృత్తి ఉద్యోగాల రీత్యా ఈ రోజుల్లో మేకప్ ఉత్పత్తులను ఆశ్రయించడం మామూలైపోయింది. అయితే రోజూ మేకప్ వేసుకోవడం వల్ల చర్మానికి కూడా ఎంతో కొంత హాని కలిగే అవకాశాలు లేకపోలేవు. మరి, మేకప్ వేసుకున్నా చర్మానికి హాని కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

Updated : 26 Feb 2022 16:21 IST

వృత్తి ఉద్యోగాల రీత్యా ఈ రోజుల్లో మేకప్ ఉత్పత్తులను ఆశ్రయించడం మామూలైపోయింది. అయితే రోజూ మేకప్ వేసుకోవడం వల్ల చర్మానికి కూడా ఎంతో కొంత హాని కలిగే అవకాశాలు లేకపోలేవు. మరి, మేకప్ వేసుకున్నా చర్మానికి హాని కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. మొదలైన వివరాలన్నీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..

మేకప్ ఉత్పత్తులు రోజూ ఉపయోగించడం వల్ల అందులో ఉండే రసాయనిక పదార్థాలు చర్మానికి హాని కలిగించవచ్చు. ఫలితంగా చర్మం పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి మేకప్ ఉత్పత్తులు ఉపయోగించే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

సహజ ఉత్పత్తులు ఉపయోగించండి..

ఈరోజుల్లో మేకప్ వేసుకోవడానికి ఉపయోగించే ఉత్పత్తుల్లో పారాబెన్ వంటి హానికారక రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి చర్మానికి హాని కలిగించడంతో పాటు మన ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తాయి. కాబట్టి మేకప్ వేసుకోవడానికి వీలైనంత మేరకు సహజసిద్ధమైన ఉత్పత్తులనే ఉపయోగించాలి. నిపుణుల సలహా మేరకు చెట్లు, ఆయుర్వేద ఆధారిత ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా రసాయనాల బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

మినరల్ మేకప్..

సాధారణంగా మేకప్ వేసుకున్నప్పుడు అందులో ఉండే రసాయనాలు చర్మకణాల్లో కలిసిపోవడం ద్వారా చర్మం ఆ క్షణానికి మెరుపుని సంతరించుకున్నట్లు, మృదువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత అవే రసాయనాలు చర్మంలోని తేమని తగ్గించి పొడిబారిపోయేలా చేస్తాయి. కాబట్టి వాటికి ఇటు మేకప్ లుక్‌ని అందిస్తూనే అటు చర్మానికి తగిన పోషణ కూడా అందించే మినరల్ మేకప్‌ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవడం అవసరం.

మేకప్ బేస్‌గా..

కొన్ని దేశాల్లో మహిళలు మేకప్ చేసుకునే ముందు ముత్యాలతో తయారు చేసిన పౌడర్ (పెర్ల్ పౌడర్)ని బేస్‌గా ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఉత్పత్తుల్లో ఉండే రసాయనాల ప్రభావం చర్మంపై అంతగా ఉండదని, ఫలితంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుందని వారి నమ్మకం. ఇదే చిట్కాను మనం కూడా ఫాలో అవడం ద్వారా అటు అందంగా కనిపిస్తూనే ఇటు చర్మాన్ని సైతం రక్షించుకోవచ్చు.

ఎక్స్‌ఫోలియేషన్..

మేకప్ ఎక్కువగా వేసుకునేవారు తరచూ ఎక్స్‌ఫోలియేషన్ చేసుకోవడం చాలా మంచిది. దీని ద్వారా చర్మం పై పొరల్లో పేరుకుపోయిన మేకప్ ఉత్పత్తులతో పాటు మృతకణాలు కూడా తొలగిపోయి చర్మం లోపలి నుంచి శుభ్రమవుతుంది. అలాగే చర్మాన్ని స్క్రబ్ చేసుకున్న తర్వాత క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ ప్రక్రియలు కూడా తప్పకుండా అనుసరించాల్సిందే! అప్పుడే చర్మానికి పూర్తి స్థాయిలో పోషణ అంది అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ఎక్స్‌పైరీ డేట్స్

మేకప్ ఉత్పత్తులకు కూడా ఎక్స్‌పైరీ డేట్స్ ఉంటాయన్న విషయం మనకి తెలిసిందే! ఆ తేదీలకు అనుగుణంగానే వాటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఫౌండేషన్, ఐ షాడో, పౌడర్ బ్లష్, క్రీమ్ బ్లష్, ఐ పెన్సిల్, లిప్‌స్టిక్, లిప్‌గ్లాస్.. మొదలైనవి 6 నుంచి 12 నెలల్లోపు, కన్సీలర్ 6 నుంచి 8 నెలల్లోపు, మస్కారా 3 నెలల్లోపు, లిక్విడ్ ఐ లైనర్ 3 నుంచి 6 నెలల్లోపు మార్చుకోవాలి. ఒకసారి ఎక్స్‌పైరీ డేట్ దాటిన తర్వాత ఆ ఉత్పత్తులను మేకప్ వేసుకోవడానికి వినియోగించకపోవడమే మంచిది.

ఈ జాగ్రత్తలు కూడా..

* రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్ తప్పనిసరిగా తొలగించుకోవడం, ఆ తర్వాత యాంటీ ఏజింగ్ మాయిశ్చరైజర్ అప్త్లె చేసుకోవడం..

* సూర్యరశ్మి నుంచి చర్మానికి రక్షణ కల్పించే మేకప్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవడం..

* మేకప్ వేసుకోవడానికి ఉపయోగించే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం..

* నెలకోసారి మేకప్ బ్రష్‌లను క్లీన్ చేయడం..

* మేకప్ ఉత్పత్తులలో బ్యాక్టీరియా చేరకుండా జాగ్రత్తగా భద్రపరుచుకోవడం.. మొదలైనవి.

ఈ జాగ్రత్తలు పాటిస్తూ మేకప్ చేసుకోవడం ద్వారా ఇటు అందంగా కనిపిస్తూనే చర్మ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్