బయోఎంజైమ్స్.. వీటిని ఎందుకు వాడాలో తెలుసా?

పాత్రలు కొత్తవాటిలా మెరిసిపోవడానికి... దుస్తులు తెల్లగా రావడానికి.. గదులు శుభ్రం చేయడానికి... మనకు తెలిసిన, మార్కెట్లో కనిపిస్తున్న ఉత్పత్తులనే వాడతాం. రసాయనాలతో చేసిన ఈ ఉత్పత్తులు మన ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగించడంతోపాటు.. పర్యావరణానికీ హాని కలిగిస్తాయి. వీటికి ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చినవే......

Published : 19 Mar 2022 18:24 IST

పాత్రలు కొత్తవాటిలా మెరిసిపోవడానికి... దుస్తులు తెల్లగా రావడానికి.. గదులు శుభ్రం చేయడానికి... మనకు తెలిసిన, మార్కెట్లో కనిపిస్తున్న ఉత్పత్తులనే వాడతాం. రసాయనాలతో చేసిన ఈ ఉత్పత్తులు మన ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగించడంతోపాటు.. పర్యావరణానికీ హాని కలిగిస్తాయి. వీటికి ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చినవే బయోఎంజైమ్స్‌. వాటి గురించి తెలుసుకుందాం...

ఇప్పుడంటే బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి రసాయనాలను వాడుతున్నాం. ఒకప్పుడు ఇవన్నీ వేటితో చేసేవారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ కాలంలోనూ శుభ్రపరచడానికి కొన్ని రకాల ద్రావణాలను వాడేవారు. అవన్నీ ప్రకృతిసిద్ధంగా దొరికే వాటితో తయారు చేసుకునేవారు. క్రమంగా వాటి స్థానంలో ఘాటైన రసాయనాలతో చేసిన శానిటైజర్లు, డిటర్జెంట్లు, సబ్బులు వచ్చి చేరాయి. ఇవి మనిషికీ, ప్రకృతికీ చేటు చేసేవే. వీటి దుష్ప్రభావాలపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలోనే బయోఎంజైమ్స్ వాడకం మొదలైంది.

ఏమిటివి?

బయోఎంజైమ్స్‌ అనేవి సహజంగా లభ్యమయ్యే ఆర్గానిక్‌ బయో డీగ్రేడబుల్‌ పదార్థాలు. వీటిలో విషపదార్థాలు ఉండవు.. భూమికి, మనకీ హాని చేయవు. ద్రవరూపంలో ఉంటాయి. ఈ బయోఎంజైమ్స్‌ని నిమ్మజాతి పండ్లతొక్కలు, గోమూత్రం, కొన్ని రకాల ఆకులు వంటి వాటితో తయారుచేస్తారు. ఈ మిశ్రమాన్ని సహజ కీటక నివారిణిలా, ఇంట్లో, దుస్తుల్లో మలినాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఇంట్లో శుభ్రపరచడానికి వాడే వివిధ రకాల రసాయనాలతో చర్మ సమస్యలు, అలర్జీలు, కళ్లు, శ్వాస సంబంధ వ్యాధులు వంటివి వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వీటికి బదులుగా బయోఎంజైమ్స్‌ ద్రావణం వాడితే అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మన నెలవారీ ఖర్చూ తగ్గుతుంది.

ఎలా తయారు చేస్తారు?

నిమ్మజాతి పండ్ల తొక్కలు (నారింజ, పైనాపిల్, నిమ్మ, బత్తాయి తొక్కలు.. వంటివి) - కిలోన్నర

నీరు- అయిదు లీటర్లు

బెల్లం - అరకిలో

ఈస్ట్‌ - అర చెంచా

పెద్ద డబ్బా - ఒకటి

తయారీ: ముందు మూత గట్టిగా ఉన్న వెడల్పాటి ప్లాస్టిక్‌ సీసాలో బెల్లం, ఈస్ట్‌, నీళ్లు, పండ్ల తొక్కలను వేసి బాగా కలపాలి. గాలి చేరకుండా డబ్బాకు మూత పెట్టాలి. ప్రతి రెండు రోజులకు ఓసారి మూత తీసి పెట్టాలి. ఇలా చేస్తే డబ్బాలో తయారయ్యే వాయువులు బయటకు పోతాయి. మూడు నెలల తరువాత ద్రావణంపై పేరుకునే తేటను మరో డబ్బాలో పోయాలి. మొదటి డబ్బాలో మరికొన్ని నీళ్లుపోసి రెండు నుంచి మూడు నెలలు పులియబెట్టాలి. ఆ తరువాత మళ్లీ పైన తేరుకునే ద్రావణాన్ని రెండో డబ్బాలోకి తీసుకోవాలి. ఇలా మూడుసార్లు పులియబెట్టిన తరువాత అడుగున మిగిలిన పదార్థాన్ని మొక్కలకు ఎరువుగా, రెండో డబ్బాలోకి తీసుకున్న ద్రావణాన్ని శుభ్రపరచుకోవడానికి వాడుకోవచ్చు. ఈ క్రమంలో డబ్బాను పూర్తిగా పదార్థాలు, నీటితో నింపకూడదు. కుళ్లిన తొక్కలు వేయకూడదు. పులిసే క్రమంలో నురగ ఎక్కువగా వస్తే కొంతమొత్తాన్ని పక్కకు తీసేయడం మంచిది. ఒక భాగం బయోఎంజైమ్‌ ద్రావణానికి మూడు నుంచి నాలుగురెట్లు నీళ్లు కలిపి వాడుకోవచ్చు. అవసరాన్ని బట్టి నీటిని కలుపుకోవడం మంచిది. సాధారణ బయోఎంజైమ్‌ ద్రావణానికి ఉండే ఘాటు వాసన పోవడానికి కుంకుడుకాయల రసాన్ని వాడొచ్చు.

వీటితో ఉపయోగాలేంటి?

* చేతులు కడగడానికి (శానిటైజర్స్‌), టాయిలెట్లు శుభ్రం చేయడానికి, అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొక్కలకు ఎరువుగా ఈ బయోఎంజైమ్స్‌ని వాడొచ్చు.

* వంట గదిలో నూనె మరకలను, జిడ్డును తొలగించొచ్చు.

* పండ్లు, కూరగాయలను ఈ బయోఎంజైమ్స్‌ ద్రావణంతో కడిగితే పురుగు మందుల అవశేషాలు, మలినాలు పోతాయి.

* బొద్దింకలు, దోమలు చేరకుండా దీన్ని ఇంట్లో స్ప్రే చేసుకోవచ్చు. ఒక లీటరు బయోఎంజైమ్స్‌ వెయ్యి లీటర్ల నీటిని శుభ్రం చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్