close
Published : 01/11/2021 21:30 IST

Sexual Molestation: ఆ గంటలో ఏం జరిగిందో అప్పుడర్థమైంది!

(Image for Representation)

నువ్వు చాలా బొద్దుగా ఉన్నావంటూ బుగ్గ గిల్లడం, ముద్దు పెట్టుకోవడం, కోరికతో వ్యక్తిగత భాగాలను అసభ్యంగా తాకడం.. తెలిసీ తెలియని పసి వయసులో ఎదుటివారు చేసే ఇలాంటి కామ చేష్టలు చాలామంది అమ్మాయిలకు అర్థం కావు. పైగా ఇదంతా తమ పొరపాటు వల్లే జరిగిందేమోనన్న భయం వారిని నోరు విప్పనివ్వదు. తన జీవితంలోనూ ఇలాంటి చేదు అనుభవాలు కొన్నున్నాయంటోంది ముంబయికి చెందిన పూజితా రాణా. పెరిగి పెద్దయ్యే క్రమంలో పలుమార్లు లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురైన ఆమె.. ఒకానొక దశలో తన అందమే తనకు శాపమైందంటూ మనోవేదనకు లోనైంది. తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయింది. అయితే తన తల్లిదండ్రుల అండ, నిపుణుల సహకారంతో ఈ మానసిక వేదనను జయించిన ఆమె.. తనలా మరెవరూ బాధపడకూడదని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనతోనే లైంగిక విద్య గురించి పిల్లల్లో అవగాహన పెంచేందుకు నడుం బిగించింది. మరోవైపు మోటివేషనల్‌ స్పీకర్‌గా మారి.. లైంగిక వేధింపులకు గురైన ఎంతోమందికి బతుకు మీద ఆశ కల్పిస్తోంది. జీవితంలో ముందుకెళ్లాలంటే ఇలాంటి భయాల్ని, అవమానాల్ని ధైర్యంగా ఎదుర్కోవాలంటున్న పూజిత.. తన లైఫ్‌లో జరిగిన కొన్ని చేదు అనుభవాలను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

బాల్యమంటే ఎలాంటి చీకూ చింతా లేని అందమైన జ్ఞాపకం! అయితే అది అందరి విషయంలో కాదన్న నిజం నాకు యుక్త వయసులోకొచ్చాక గానీ తెలియలేదు. నేను చిన్నప్పట్నుంచీ కాస్త బొద్దుగా, ముద్దుగా ఉండేదాన్ని. దాంతో ప్రతి ఒక్కరూ నన్ను ముద్దు చేసేవారు.. నీ బుగ్గలు బూరెల్లా ఉన్నాయంటూ గిల్లేవారు. స్కూల్లో కూడా చాలామంది అబ్బాయిలు ‘పూజి.. పూజి’ అంటూ నా వెనకాలే తిరిగేవారు. ఇలా అందరి చూపులు నావైపే ఉండేసరికి నేనొక సెలబ్రిటీలా ఫీలయ్యేదాన్ని.

అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నా. మా పక్క వీధిలో ఉండే రమ్య, నేను మంచి స్నేహితులం.. స్కూల్లో కూడా ఒకే క్లాస్‌. వాళ్ల నాన్న కూడా మా డాడీకి మంచి ఫ్రెండ్‌. నాన్నతో పనుందని తరచూ మా ఇంటికొచ్చి వెళ్తుండేవారు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ నన్ను పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకొని నాతో కబుర్లు చెప్పేవాడు. నన్ను దగ్గరికి తీసుకొని ముద్దులివ్వడం, శరీరమంతా తడుముతూ ఏవేవో జోక్స్‌ వేయడం.. వంటివి చేసేవాడు. నేను కూడా నాకు తెలిసిన అంకులే కదా అని తేలిగ్గా తీసుకునేదాన్ని. ఎప్పుడూ వెళ్లినట్లుగానే ఓ రోజు సాయంత్రం ఆడుకోవడానికని రమ్య వాళ్లింటికి వెళ్లా. అయితే కాసేపటి క్రితమే వాళ్లు గుడికి వెళ్లారని, త్వరగానే వచ్చేస్తారని.. వాళ్ల నాన్న నన్ను లోపలికి తీసుకెళ్లారు. సోఫాలో కూర్చోమని.. తను లోపలికి వెళ్లి నాకోసం కొన్ని చాక్లెట్స్‌ తీసుకొచ్చి ఇచ్చారు. అవి తింటూ అంకుల్‌తో సరదాగా మాట్లాడుతూ కూర్చున్నా. అయితే అంతలోనే నా ఒంట్లో ఏదో తేడాగా అనిపించింది.. మైకం కమ్మినట్లుగా కళ్లు మూసుకుపోతున్నాయి. సోఫాలో అలాగే వాలిపోయా.

******

గంట తర్వాత కళ్లు తెరిచి చూసేసరికి వాళ్ల బెడ్‌రూమ్‌లో ఉన్నా. నా శరీరమంతా నొప్పులుగా, ఏదో తెలియని అసౌకర్యం కలిగింది. వెంటనే హాల్‌లోకెళ్లే సరికి అంకుల్‌ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. రమ్య ఇంకా రాలేదన్న విషయం తెలుసుకొని.. అక్కడ్నుంచి తిరిగి ఇంటికెళ్లిపోయా. ఆ గంట వ్యవధిలో నాకేం జరిగిందో ఎంతకీ అర్థం కాలేదు. కానీ ఈ విషయం మాత్రం ఇంట్లో చెప్పాలనిపించలేదు. అప్పట్నుంచి నా మనసులో ఏదో తెలియని భయం, బెరుకు. వయసు పెరిగినా, తరగతులు మారినా ఇవి మాత్రం నన్ను వీడలేదు. ఇలా ఒక్కసారి కాదు.. నేను ఇంటర్మీడియట్‌ చదువుతున్నప్పుడు, అమ్మానాన్నలతో పిక్‌నిక్‌కి వెళ్లినప్పుడు, బంధువులింట్లో మరోసారి.. ఇలా పలుమార్లు ఇలాంటి భయంకరమైన అనుభవాలు నాకు ఎదురయ్యాయి. నిజానికి అసలు నాకేం జరుగుతుందోనన్న విషయం అంతుపట్టలేదు.. కానీ నా పొరపాటు వల్లే ఇలా అవుతోందేమోనన్న భ్రమలో ఉండిపోయా.

అయితే నేను ఇంటర్‌ సెకండియర్‌లో ఉన్నప్పుడు నా చిన్ననాటి స్నేహితురాలు అంకిత ఓ రోజు నాకు ఫోన్‌ చేసింది. అప్పుడప్పుడూ మాట్లాడుకున్నా మాది విడదీయరాని బంధం. ఏదైనా సరే.. మనసులో దాచుకోకుండా అన్నీ పంచుకోవడం మాకు అలవాటు! అయితే నాకు మాత్రం నా జీవితంలో జరిగిన ఈ చేదు సంఘటనల్ని తన దగ్గర దాచానన్న గిల్టీ ఫీలింగ్‌ ఉండేది. అయితే ఆ రోజు తను కాల్‌ చేసినప్పుడు తన మాటల్లో ఒక రకమైన బాధ కనిపించింది. అంతకుముందెన్నడూ తను అలా నాతో మాట్లాడింది లేదు. తన మనసులోని బాధను నాతో పంచుకోవడానికి ప్రయత్నిస్తోందని తన మాటల్లో నాకు అర్థమైంది. ఉండబట్టలేక వెంటనే అడిగేశా.. ఏమైందని?! ఒక్కసారిగా బోరుమంది. తను పదో తరగతిలో ఉండగా తనపై జరిగిన లైంగిక దాడి గురించి చెప్పింది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదని.. తను తప్పు చేయకపోయినా అప్పట్నుంచీ మానసిక క్షోభను అనుభవిస్తున్నానని చెబుతుంటే.. గతంలో నా విషయంలో జరిగిన పలు చేదు అనుభవాలు జ్ఞప్తికి వచ్చాయి.

******

ఇక తను ఫోన్‌ పెట్టేశాక.. నా మనసు పడుతోన్న బాధను, శరీరం అనుభవిస్తోన్న అసౌకర్యం గురించి ఇంటర్నెట్‌లో వెతికే ప్రయత్నం చేశా. ఈ క్రమంలో చిన్నతనంలో లైంగిక వేధింపుల గురించిన ఎన్నో రియల్‌ స్టోరీస్‌, బాధితులు ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చదివా. ఆ రోజు రమ్య వాళ్లింట్లో గంట వ్యవధిలో ఏం జరిగిందోనన్న విషయం నాకు అప్పుడర్థమైంది. వాళ్ల నాన్న నాతో ప్రవర్తించిన తీరు, ఆయన కామ చేష్టలు, ఆపై విభిన్న సందర్భాల్లో నాకు కలిగిన అసౌకర్యానికి.. వీటన్నింటికీ కారణం ఈ వేధింపులేనన్న విషయం స్పష్టమైంది. దాంతో ఇన్నాళ్లూ నా మనసులోనే దాచుకున్న బాధ కన్నీళ్ల రూపంలో ఉబికి వచ్చింది.. ఒంటరితనం ఆవహించింది.. నిద్ర పట్టకపోయేది.. ఏదైనా పని చేస్తుంటే పరధ్యానంలో అలాగే ఉండిపోయేదాన్ని. నడుస్తుంటే ఏదో ఆలోచనలో ఉండి ముందుకు సాగిపోయేదాన్ని. అమ్మానాన్నలు మాట్లాడుతుంటే మధ్యలోనే వెళ్లిపోయేదాన్ని. ఇలా నలుగురిలో ఉన్నా ఒంటరిగానే ఉన్నట్లనిపించేది.. నా ప్రవర్తనను గమనించిన అమ్మ ఓ రోజు నా గదిలోకొచ్చింది.. నేను ఏడుస్తుంటే నన్ను ఓదార్చింది. అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేసింది.

అప్పటిదాకా నాదే పొరపాటనుకున్నా.. కానీ తప్పు నాది కానప్పుడు అమ్మతో ఎందుకు చెప్పకూడదనిపించింది. అందుకే గత చేదు జ్ఞాపకాలన్నీ అమ్మతో పంచుకున్నా. నా బాధ గ్రహించిన అమ్మానాన్నలు ఎంత ధైర్యం చెప్పినా.. ఆ మానసిక క్షోభ నుంచి బయటపడడం నా వల్ల కాలేదు. ఇక చేసేది లేక సైకాలజిస్ట్‌ దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. థెరపీ ఇప్పించారు.. చికిత్స చేయించారు. అప్పుడు క్రమంగా నాలో మార్పు రావడం ప్రారంభమైంది. స్థల మార్పిడి జరిగితే మంచిదని వైద్యులు చెప్పడంతో అప్పటిదాకా ముంబయిలో ఉన్న మేము దిల్లీ వెళ్లిపోయాం. నేను పూర్తిగా కోలుకోవడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. ఇప్పటికే చాలా సమయం వృథా అయింది.. ఇక చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నా. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశా. ఓ ఎమ్మెన్సీలో ఉద్యోగం కూడా వచ్చింది.. కానీ నేను చేయాల్సింది ఇంకా ఏదో ఉందనిపించింది. అదేంటో గ్రహించే సరికి నెల రోజులు పట్టింది.

******

ఈ సమాజం నుంచి నేను ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నా. కానీ అదే సమాజంలో చైతన్యం తీసుకురావాలనుకున్నా.. నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకున్నా. అందుకే నేను పడిన బాధలు మరెవరూ పడకూడదనుకున్నా. అలా జరగాలంటే లైంగిక విద్య గురించి చిన్నారుల్లో అవగాహన కల్పించడం ఒక్కటే మార్గమనిపించింది. ఈ క్రమంలోనే వివిధ స్కూళ్లకు వెడుతూ గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌, పిరియడ్స్‌, లింగ సమానత్వం, లైంగిక పరమైన అంశాలపై ఈ సమాజంలో వేళ్లూనుకుపోయిన కొన్ని మూసధోరణులు.. మొదలైన వాటి గురించి ప్రత్యేక తరగతులు తీసుకొని వారికి వివరిస్తున్నా. ఆడ-మగ సమానమేనని చెప్పే క్రమంలో వారితో కొన్ని ఆటలు కూడా ఆడిస్తున్నా. నాలాగే లైంగిక వేధింపులు ఎదుర్కొని శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన వారిలో సానుకూల దృక్పథం నింపడానికి ప్రయత్నిస్తున్నా. అలాగని నేనేదో గొప్ప పని చేస్తున్నానని అనుకోను.. నన్ను చూసి నా చుట్టూ ఉన్న వాళ్లు స్ఫూర్తి పొందితే చాలు.. బాధితులంటూ పట్టి పీడించకుండా ఉపశమనం కలిగించే నాలుగు మాటలు మాట్లాడితే చాలు!


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి