రొమ్ముల పరిమాణం పెద్దగా ఉంటే క్యాన్సర్ వస్తుందా?

రొమ్ము క్యాన్సర్.. ప్రస్తుతం మహిళలని వేధించే వ్యాధుల్లో ముఖ్యమైనది. మన దేశంలో ఏటా దీని బారిన పడేవారు లక్షల్లో ఉంటున్నారంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. సరైన అవగాహన ఉంటే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి.. దాన్ని ఎదుర్కొనే వీలుంటుంది.

Updated : 13 Oct 2023 13:29 IST

రొమ్ము క్యాన్సర్.. ప్రస్తుతం మహిళలని వేధించే వ్యాధుల్లో ముఖ్యమైనది. మన దేశంలో ఏటా దీని బారిన పడేవారు లక్షల్లో ఉంటున్నారంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. సరైన అవగాహన ఉంటే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి.. దాన్ని ఎదుర్కొనే వీలుంటుంది. అయితే చాలామంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ గురించి ఎన్నో రకాల అపోహలుంటాయి. 'రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం' నేపథ్యంలో ఇలాంటి కొన్ని అపోహలేంటో తెలుసుకొని, వాటిని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం...

అపోహ : రొమ్ముల్లో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలే.

వాస్తవం : ఇది నిజం కాదు. రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో పదింట తొమ్మిది క్యాన్సర్ కారక గడ్డలు కావు. అయినా సరే గడ్డ ఏర్పడినట్లు భావించిన తక్షణం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

అపోహ : రొమ్ము క్యాన్సర్ సాధారణంగా వయసు మీరిన వారికే వస్తుంది.

వాస్తవం : ఇది పూర్తిగా నిజం కాదు. 80 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు 50 ఏళ్ల పైబడిన స్త్రీలలోనే కనిపిస్తున్నా.. ఇటీవల కాలంలో 40 ఏళ్లు దాటిన వారిలోనూ ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోంది.

అపోహ : రొమ్ము క్యాన్సర్ పురుషులకు రాదు.

వాస్తవం : పురుషుల్లో కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చన్న విషయం చాలామందికి తెలియదు. పురుషుల్లో స్త్రీలకున్నట్లు రొమ్ములుండవు. కాబట్టి ఇది పురుషుల్లో రాదని భావించడం నిజం కాదు. రొమ్ము కణజాలం పురుషుల్లో కూడా ఉంటుంది. కాబట్టి కొంతమంది పురుషుల్లో కూడా ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది.

అపోహ : రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష ప్రతి మహిళకూ అవసరం లేదు.

వాస్తవం : రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణాలు ఏవైనప్పటికీ ఆలస్యం చేయకుండా వ్యాధిని గుర్తించడం మంచిది. దీనికి మన ముందున్న ఏకైక మార్గమే 'రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష'. వ్యాధి లక్షణాలను వీలైనంత త్వరగా గుర్తించి.. సాధ్యమైనంత త్వరగా నివారించుకోవాలంటే ఈ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.

అపోహ : రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యంగా మాత్రమే వస్తుంది. కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర లేకపోతే మిగిలిన వారికి రాదు.

వాస్తవం : ఇది నిజం కాదు. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ బారిన పడిన వారి కుటుంబాల్లో చాలామంది ఆరోగ్యంగానే ఉంటున్నారు. వంశపారంపర్యంగా రొమ్ము క్యాన్సర్ రావడానికి 10 శాతం వరకే అవకాశాలున్నాయని నిపుణుల అభిప్రాయం.

అపోహ : బిడ్డకు పాలిస్తే రొమ్ము క్యాన్సర్ రాదు.

వాస్తవం : ఇది కొంతవరకే నిజం. బిడ్డకు పాలివ్వడం వల్ల క్యాన్సర్ రాకూడదని లేదు. అయితే రాకుండా ఉండటానికి కొంతవరకు అవకాశాలున్నాయి.

అపోహ : రొమ్ములు పెద్దగా ఉండే స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

వాస్తవం : రొమ్ముల పరిమాణానికి, దీనికీ సంబంధం లేదన్నది నిపుణుల అభిప్రాయం.

అపోహ : రొమ్ము క్యాన్సర్‌ని తొలి దశలో గుర్తించడం కష్టం.

వాస్తవం : ఇది నిజం కాదు. చేత్తో తడిమినప్పుడు గడ్డల్లా తగలడానికి కొన్నేళ్ల ముందే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. మామోగ్రఫీ పరీక్ష ద్వారా వీటిని గుర్తించడం సాధ్యమవుతుంది. ముందే గడ్డలు గుర్తించడం వల్ల చికిత్స చాలా సులువవుతుందంటున్నారు నిపుణులు.

అపోహ : మామోగ్రఫీ పరీక్ష చాలా బాధాకరంగా ఉంటుంది.

వాస్తవం : ఇది కూడా నిజం కాదు. ఈ పరీక్ష కూడా సాధారణ ఎక్స్‌రే మాదిరే ఉంటుంది. కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ, ఎలాంటి నొప్పీ ఉండదు. డిజిటల్ మామోగ్రఫీతో కలిగే అసౌకర్యం చాలా తక్కువగా ఉండటం గమనార్హం.

అపోహ : రొమ్ములకు తగిలే గాయాలు కూడా క్యాన్సర్‌కు కారణం కావచ్చు.

వాస్తవం : రొమ్ములకు తగిలే గాయాల వల్ల క్యాన్సర్ రాదు.


ఎవరికి రిస్క్ ఎక్కువ?

ఇది వరకు ఒక రొమ్ములో క్యాన్సర్ రావడం.
కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉండడం (ప్రత్యేకించి దగ్గర రక్త సంబంధీకులకు ఉండడం)
రుతుక్రమం చాలా చిన్న వయసులోనే ప్రారంభం కావడం (12 సంవత్సరాల లోపే ప్రారంభమైతే)
రుతుక్రమం ఆగిపోయే దశ ఆలస్యం కావడం (55 సంవత్సరాల తర్వాత)
పిల్లలు కలగకపోవడం, మొదటి బిడ్డ 30 ఏళ్లు దాటిన తర్వాత కలగడం.
హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్ఆర్‌టీ) చాలా ఎక్కువకాలం వాడడం.
బరువు బాగా పెరగడం, ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన తర్వాత)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్