చిన్న వయసులోనే నుదుటి మీద ముడతలా..?

నుదుటి మీద కనిపించే గీతల కారణంగా చాలామంది వయసు పైబడిన వారిలా కనిపిస్తుంటారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవాలన్నా, రాకుండా ముందు నుంచే జాగ్రత్తపడాలన్నా కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు సౌందర్య నిపుణులు.

Updated : 10 Aug 2023 20:16 IST

చర్మం ముడతలు పడడమనేది వృద్ధాప్య ఛాయల్లో ఒకటి. వయసు పెరిగే కొద్దీ ఇలాంటి లక్షణాలు కనిపించినా పెద్దగా పట్టించుకోం. కానీ కొంతమందికి చిన్న వయసులో ఉండగానే ముఖంపై ముడతలు, గీతలు కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా నుదుటి మీద కనిపించే గీతల కారణంగా చాలామంది వయసు పైబడిన వారిలా కనిపిస్తుంటారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవాలన్నా, రాకుండా ముందు నుంచే జాగ్రత్తపడాలన్నా కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు సౌందర్య నిపుణులు.

కారణాలేమిటి?

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి మృదుత్వాన్ని కోల్పోతుంది. ఈ ప్రభావంతో నుదుటిపై సన్నని గీతలు మొదలవడంతో పాటు కళ్ల చుట్టూ ఉండే చర్మం ముడుచుకుపోతుంటుంది. అయితే కొంతమందికి చిన్న వయసులోనే నుదుటిపై గీతలు, ముడతలు కనిపిస్తుంటాయి. వాటిని ‘ప్రి-మెచ్యూర్‌ రింకిల్స్’ అంటారు.

బాగా తెల్లగా ఉన్న వారిలో, చర్మం పల్చగా ఉన్న వారిలో ఇవి చిన్న వయసులోనే మొదలవుతాయంటున్నారు సౌందర్య నిపుణులు.

ఎండలో ఎక్కువగా తిరిగే వారిలో, కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ సమస్యలు ఎదురవుతాయట!

ఇక చాలామంది చీటికీ మాటికీ నుదురు చిట్లిస్తుండడం, అదే పనిగా కనుబొమ్మల్ని పైకి ఎగరేయడం వంటివి చేస్తుంటారు.. అలాంటివారిలోనూ ఇవి పిన్న వయసులోనే వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు.

అలాగే పొడి చర్మం గల వారు, సౌందర్య పద్ధతుల్లో భాగంగా బ్లీచింగ్‌ ఎక్కువగా వాడే వారిలో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుందట!

సహజ చిట్కాలతో..

ఈ సమస్యకు కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా ఈ సమస్యను నివారించవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. మరి అవేమిటో తెలుసుకుందాం రండి..

తగినన్ని నీళ్లు తాగాలి!

శరీరానికి సరిపడా నీటిని తీసుకోకపోతే చర్మం పొడిబారే ప్రమాదముంది. ఫలితంగా నుదుటి మీద పెద్ద పెద్ద గీతలు, ముడతలు ఏర్పడతాయి. దీంతో పిన్న వయసులోనే వయసు మళ్లిన వారిలా కనిపిస్తారు. ఈ సమస్య పెరగకుండా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగాలి. అలాగే వర్కవుట్లు చేసేవారు త్వరగా డీహైడ్రేషన్‌ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారు మరింత ఎక్కువగా నీళ్లు తాగాలి. నీటితో పాటు నిమ్మరసం, కొన్ని రకాల పండ్ల రసాలను తీసుకోవచ్చు.

బయటికి వెళ్లే ముందు..

చర్మంపై ఎండ ఎక్కువగా పడితే కొలాజెన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా నుదుటి మీది చర్మం కమిలిపోయి నల్లగా మారుతుంది. దీంతో ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్ర్కీన్‌ లోషన్ అప్లై చేసుకోవాలి. ఇక కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తాయి. అంతేకాదు నుదుటి మీది ముడతలు కనిపించకుండా చేస్తాయి.

ఒత్తిడికి దూరంగా!

విపరీతమైన ఆందోళన, ఒత్తిడి వల్ల కూడా నుదుటిపై ముడతలు పెరుగుతాయి. అయితే ఇప్పుడున్న యాంత్రిక, పోటీ ప్రపంచంలో ఒత్తిడి లేని జీవితం ఊహించడం కొంచెం కష్టమే. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడి, మానసిక ఆందోళనలను అదుపులో పెట్టుకోవచ్చు. అందుకోసం యోగా, మెడిటేషన్‌, వర్కవుట్లను జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు రోజూ కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి.

బ్యాలన్స్‌డ్‌ డైట్‌తో...!

మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా చర్మానికి అవసరమయ్యే పోషకాలు అందకపోయినా కొలాజెన్‌ ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ప్రత్యేకించి విటమిన్‌-సి, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పొడి చర్మం సమస్యను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే గ్రీన్‌ టీ, పాలకూర, వాల్‌నట్స్‌, చిలగడ దుంప, బ్లూ బెర్రీ... మొదలైనవన్నీ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మం పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు. తద్వారా నుదుటి మీద ముడతలు ఏర్పడకుండా, ఒకవేళ వచ్చినా సమస్య పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

ఇవి గుర్తుంచుకోండి!

పొగాకులోని రసాయనాల కారణంగా కొలాజెన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం స్థితిస్థాపకతను కోల్పోయి ముడతలు ఏర్పడతాయి. ఇది అకాల వృద్ధాప్యానికి దారి తీస్తుంది. అందుకే స్మోకింగ్ అలవాటుకు దూరంగా ఉండాలి.

కొన్ని ఫేషియల్‌ ఎక్సర్‌సైజులు, వర్కవుట్లతో ముడతలు పెరగకుండా జాగ్రత్త పడచ్చు. పలువురు సెలబ్రిటీలు కూడా వీటిని ఫాలో అవుతున్నారు. రోజులో కనీసం 20 నిమిషాల పాటు.. వారంలో 6 గంటలు ఈ ఫేషియల్‌ ఎక్సర్‌సైజులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇందుకోసం కావాలంటే సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్