ఇంట్లో పెరిగే ఫంగస్‌ను ఇలా వదిలించేద్దాం!

వర్షాలకు ఇంటి గోడలు చెమ్మగా మారడం, లోపలి వాతావరణం తేమగా ఉండడంతో ఇంట్లో ఫంగస్ పెరగడం మామూలే! అలాగని దీన్ని తేలిగ్గా తీసుకుంటే ఈ సూక్ష్మ క్రిములు గాల్లోకి చేరి వివిధ అనారోగ్యాలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. అందుకే ఈ ఫంగస్‌ను వీలైనంత త్వరగా తొలగించడంతో పాటు ఇంటిని ఎప్పుడూ పొడిగా ఉంచమంటున్నారు.

Published : 27 Aug 2021 18:44 IST

వర్షాలకు ఇంటి గోడలు చెమ్మగా మారడం, లోపలి వాతావరణం తేమగా ఉండడంతో ఇంట్లో ఫంగస్ పెరగడం మామూలే! అలాగని దీన్ని తేలిగ్గా తీసుకుంటే ఈ సూక్ష్మ క్రిములు గాల్లోకి చేరి వివిధ అనారోగ్యాలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. అందుకే ఈ ఫంగస్‌ను వీలైనంత త్వరగా తొలగించడంతో పాటు ఇంటిని ఎప్పుడూ పొడిగా ఉంచమంటున్నారు.

తేమ, చెమ్మ.. ఇంటి సంరక్షణ విషయంలో వర్షాకాలంలో ఇవి పెను సవాళ్లుగా మారుతుంటాయి. ముఖ్యంగా బీటలు వారిన గోడలు, బాత్‌రూమ్‌ టైల్స్‌, లీకేజీ ఉన్న పైపులు, మూసి ఉన్న వార్డ్‌రోబ్స్‌, సింక్‌ కింద.. వంటి ప్రదేశాలు ఎక్కువ చెమ్మగా ఉండి ఫంగస్‌ పెరుగుతుంటుంది. అలాగే చెక్క వస్తువులు, తడి దుస్తులపై కూడా ఈ ఆకుపచ్చటి బూజు ఏర్పడడం మనం గమనించచ్చు. అయితే ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు ఉపయోగపడతాయి.

వెనిగర్

డిస్టిల్డ్‌ వైట్‌ వెనిగర్‌ 82 శాతం ఫంగస్‌ను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం వెనిగర్‌ను ఒక స్ప్రే బాటిల్‌లో నింపి నేరుగా సమస్య ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయాలి. గంట తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది వేడి నీటితో శుభ్రం చేయాలి.. ఆ తర్వాత పొడిగా ఆరనివ్వాలి.

బేకింగ్‌ సోడా

బేకింగ్‌ సోడాతోనూ ఇంట్లోని ఫంగస్‌ను వదిలించచ్చు. రెండు కప్పుల వేడి నీటిలో టీస్పూన్‌ బేకింగ్‌ సోడా వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి.. ఫంగస్‌ ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయాలి. గంట తర్వాత రుద్ది శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇక ఆఖర్లో వైట్‌ వెనిగర్‌ను స్ప్రే చేయచ్చు.. లేదంటే ఈ మిశ్రమంలోనైనా కలిపి వాడుకోవచ్చు.

నిమ్మరసం

నిమ్మరసంలో ఉండే ఆమ్ల గుణం బూజును తొలగించడంలో సమర్థంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణమే ఇందుకు కారణం. ఈ క్రమంలో టైల్స్‌ మధ్య, ఫ్లోర్‌పై, గోడలకు.. ఇలా బూజు ఉన్న చోటల్లా నిమ్మరసం అప్లై చేయాలి. ఓ అరగంట తర్వాత బ్రష్‌తో/స్క్రబ్బర్‌తో రుద్ది వేడి నీటితో కడిగేస్తే బూజు తొలగిపోతుంది. ఇల్లు పరిమళభరింతగానూ మారుతుంది.

వీటితో పాటు హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, క్లోరిన్‌ బ్లీచ్‌ కూడా ఆయా ప్రదేశాల్లో ఏర్పడిన బూజును వదిలించడంలో సహకరిస్తుంది.

 

ఎక్కడెక్కడ బూజు.. ఎలా తొలగించాలి?

* వార్డ్‌రోబ్స్‌ ఎప్పుడూ మూసి ఉండడం వల్ల గాలి తగలక అందులోని దుస్తుల పైన కూడా బూజు చేరే  అవకాశం ఉంటుంది. కాస్త తేమగా ఉన్న దుస్తులు అల్మరాలో పెట్టడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంటుంది. ఇలాంటప్పుడు.. ఒక బకెట్‌ వేడి నీళ్లలో కప్పు వైట్‌ వెనిగర్‌ వేసి.. అందులో బట్టల్ని ఓ అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత ఉతికేయాలి. ఇలా చేస్తే బట్టలపై ఉన్న బూజు వదిలిపోవడంతో పాటు దుస్తుల నుంచి వచ్చే అదో రకమైన వాసన తొలగిపోతుంది.

* లెదర్‌ వస్తువులు, షూస్‌, బ్యాగులు.. వంటివి తడిసినా లేదంటే ఇంట్లోని తేమ వాతావరణానికి బూజు పడుతుంటాయి. ఇలాంటప్పుడు డిస్టిల్డ్‌ వైట్‌ వెనిగర్‌లో ముంచిన ఒక క్లాత్‌తో ఆయా వస్తువుల్ని తుడవాలి. కాసేపయ్యాక గోరువెచ్చటి సోప్‌ వాటర్‌తో తుడిచి.. ఆఖరుగా పొడి వస్త్రంతో శుభ్రం చేస్తే సరిపోతుంది.

* పేపర్లు, పుస్తకాల మధ్య బూజు ఏర్పడినప్పుడు వాటిని ఆరుబయట ఎండలో ఆరబెట్టడం లేదంటే ఆయా పేజీల మధ్యలో సిలికా జెల్‌/కార్న్‌ స్టార్చ్‌ చల్లడం వల్ల అవి తేమను లాగేసుకుంటాయి.

* వాషింగ్‌ మెషీన్స్‌, రిఫ్రిజిరేటర్లు, కాఫీ మేకర్లు, ఒవెన్స్‌లో కూడా బూజు ఏర్పడడం మనం గమనించచ్చు. ఇలాంటప్పుడు వైట్‌ వెనిగర్‌తో వాటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇక వాషింగ్‌ మెషీన్‌ని హాట్‌ వాటర్‌ సైకిల్‌లో పెట్టి.. కాస్త క్లోరిన్‌ బ్లీచ్‌ని జత చేస్తే అది శుభ్రమవుతుంది.

* ఇక చెక్క వస్తువులపై చేరిన బూజును ఇలా వదిలించుకోవచ్చు. ఒక వంతు డిష్‌వాషింగ్‌ డిటర్జెంట్‌, పది వంతుల బ్లీచ్‌, 20 వంతుల నీళ్లు తీసుకొని.. అన్నింటినీ కలపాలి. ఈ మిశ్రమంలో స్పాంజిని ముంచి ఆయా వస్తువుల్ని తుడవాలి. ఆపై మరో క్లాత్‌తో తుడవకుండా వాటంతటవే ఆరనివ్వాలి.

* ఇక వార్డ్‌రోబ్‌, బుక్‌ ర్యాక్‌.. వంటి మూసి ఉన్న ప్రదేశాల్లో తేమకు బూజు ఏర్పడకుండా ఉండాలంటే.. ఒక పొడి వస్త్రంలో వేపాకులు లేదా కర్పూరం-లవంగాలు.. చుట్టి మధ్యమధ్యలో అమర్చడం వల్ల అవి ఎప్పటికప్పుడు తేమను పీల్చేసుకొని ఆ ప్రదేశాన్ని పొడిగా ఉంచుతాయి.

 

ఇవి గుర్తుంచుకోండి!

* బీటలు వారిన గోడల్ని వీలైనంత త్వరగా రిపేర్‌ చేయించాలి.

* ఇంట్లో తేమ లేకుండా ఉండాలంటే ఓ హ్యుమిడిఫయర్‌ను అమర్చుకోవాలి.

* ఇంట్లోకి గాలి బాగా ప్రసరించేందుకు వీలుగా/సూర్యరశ్మి ఇంట్లోకి పడేలా కిటికీలు, తలుపులు తెరిచే ఉంచాలి.

* పొడి క్లాత్‌తో ఫర్నిచర్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.

* తేమగా ఉన్న ప్రదేశంలో బేకింగ్‌ సోడా చల్లడం, నాఫ్తలీన్ బాల్స్‌/సిలికా జెల్‌ పౌచుల్ని అమర్చడం మంచిది.

* పూర్తిగా ఆరని దుస్తుల్ని వార్డ్‌రోబ్‌లో అమర్చద్దు.

* ఫర్నిచర్‌ని గోడలకు ఆనించకుండా కాస్త దూరంగా ఉండేలా అమర్చుకోవాలి.

* ఇంట్లో బూజు ఏర్పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా మౌల్డ్ రెసిస్టెంట్ ఉత్పత్తులు కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటినీ ఉపయోగించచ్చు.

మరి, ఈ వర్షాకాలంలో ఇంట్లో బూజు ఏర్పడకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సమస్యను తొలగించడానికి ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? మాతో పంచుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్