దాని గురించి నలుగురిలో మాట్లాడడానికి సిగ్గెందుకు?
నెలసరిని కళంకంగా భావించడం, ఆ సమయంలో మహిళల్ని ఇంటికి దూరంగా ఉంచడం, ఈ విషయం ఇంట్లో మగవాళ్లకు తెలియకుండా రహస్యంగా దాచడం.. ఈ రోజుల్లోనూ స్త్రీలపై ఇలాంటి కట్టుబాట్లు అక్కడక్కడా చూస్తుంటాం. ఇలాంటి మూసధోరణుల్ని బద్దలుకొట్టాలంటే మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలంటోంది....
(Photos: Instagram)
నెలసరిని కళంకంగా భావించడం, ఆ సమయంలో మహిళల్ని ఇంటికి దూరంగా ఉంచడం, ఈ విషయం ఇంట్లో మగవాళ్లకు తెలియకుండా రహస్యంగా దాచడం.. ఈ రోజుల్లోనూ స్త్రీలపై ఇలాంటి కట్టుబాట్లు అక్కడక్కడా చూస్తుంటాం. ఇలాంటి మూసధోరణుల్ని బద్దలుకొట్టాలంటే మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలంటోంది బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు, వ్యాపారవేత్త నవ్యా నవేలీ నందా. మహిళల ఆరోగ్యం గురించి ఇటీవలే నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తన తాతయ్య సమక్షంలోనే నెలసరి గురించి బహిరంగ చర్చ చేసి మరోసారి వార్తల్లోకెక్కింది. సందర్భం వచ్చినప్పుడల్లా మహిళలకు సంబంధించిన అంశాలపై చురుగ్గా స్పందించే ఈ స్టార్ వారసురాలు.. ఇటీవల పిరియడ్స్ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పరిణతితో కూడిన ఆమె ఆలోచనా విధానం ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది.
నవ్యా నవేలీ నందా.. అమితాబ్ ముద్దుల కూతురు శ్వేతా నందా-అల్లుడు నిఖిల్ నందాల గారాలపట్టిగా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. న్యూయార్క్‌లోని ఫోర్ధమ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన ఈ చిన్నది.. ఇప్పటికే వారసత్వంతో జూనియర్ సెలబ్రిటీగా స్టేటస్‌ను సొంతం చేసుకుంది. అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి ‘ఆరా హెల్త్’ అనే ఆన్‌లైన్ హెల్త్‌కేర్ పోర్టల్‌ను ప్రారంభించింది. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ ఆన్‌లైన్ వేదిక ద్వారా ఎన్నో శారీరక, మానసిక అనారోగ్యాలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తోందీ బచ్చన్ గ్రాండ్ డాటర్. అంతేకాదు.. ఆరోగ్యానికి సంబంధించిన వివిధ ఉత్పత్తుల్ని ఎంతోమంది మహిళలకు చేరువ చేస్తోంది.
తాతయ్యతో ఏకీభవిస్తున్నా!
అంతేకాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా మహిళలకు సంబంధించిన అంశాల పైనా స్పందిస్తుంటుంది నవ్య. ఈ క్రమంలో నిర్మొహమాటంగా తన మనసులోని మాటల్ని పంచుకుంటుంటుంది. అయితే ఇటీవలే మహిళల ఆరోగ్యానికి సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో తన తాతయ్య అమితాబ్‌తో కలిసి పాల్గొందామె. ఈ క్రమంలో నెలసరి గురించి చర్చ జరుగుతున్నప్పుడు మధ్యలో అమితాబ్.. ‘మహిళల జీవితంలో రుతుక్రమం ఓ వేడుక లాంటిది’ అంటూ స్పందించారు. దీనిపై నవ్య మాట్లాడుతూ.. ‘అవును.. తాతయ్య చెప్పింది అక్షరాలా నిజం. చాలామంది నెలసరి గురించి ఇంట్లో మగవాళ్ల ముందు/పెద్దల సమక్షంలో మాట్లాడడానికి అసౌర్యంగా ఫీలవుతుంటారు. కానీ అది అంత కళంకమైన విషయమేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా దీనిపై పలు మూసధోరణులు కొనసాగుతున్నా.. రోజురోజుకీ ఈ విషయంలో కొంత పురోగతైతే ఉంది. అంతెందుకు.. నేనే ఈ వేదికపై మా తాతయ్య సమక్షంలో నెలసరి గురించి ఇలా బహిరంగంగా మాట్లాడడం ఈ అంశానికి సంబంధించి ఆలోచనల్లో వస్తున్న మార్పుకి ఓ ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పచ్చు.
ఇంటి నుంచే మొదలవ్వాలి!
రుతుచక్రం విషయంలో సమాజంలో ఉన్న మూసధోరణులు బద్దలుకొట్టాలంటే స్త్రీలతో పాటు పురుషులు కూడా నెలసరి గురించి చర్చించడానికి మొహమాట పడకూడదు. అయితే ఈ మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. పిరియడ్స్ సమయంలో మహిళలు తమ శరీరంలో వచ్చే మార్పుల విషయంలో ఎంత సౌకర్యంగా ఫీలైతే.. బయట కూడా అంత చురుగ్గా వ్యవహరించగలుగుతారు.. నలుగురిలోనూ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకోగలుగుతారు. ఈ విషయంలో నేనెంతో అదృష్టవంతురాలినని చెప్తా. ఎందుకంటే మా ఇంట్లో ఇలాంటి చర్చలు చాలా సహజంగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఎంతో సౌకర్యంగానూ అనిపిస్తుంటుంది..’ అంది నవ్య. ఇలా సమాజహితం కోరి ఆమె మాట్లాడిన మాటలు ఎంతోమందికి స్ఫూర్తి అంటూ నెట్టింట్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వాళ్ల కోసం ‘నెలసరి ఇళ్లు’!
సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాలు, తెగల్లో నెలసరి సమయంలో ఆడవారిని ఇంటికి దూరంగా.. పూరి గుడిసెలు, పశువులు పాకల్లో ఉంచడం గురించి వింటూనే ఉంటాం. ఈ క్రమంలో ఊపిరాడక, విష సర్పాల బారిన పడి.. కొంతమంది చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి మహిళల రక్షణే ముఖ్యోద్దేశంగా 2019లో ‘ప్రాజెక్ట్ నవేలీ’కి రూపకల్పన చేసింది నవ్య. రుతుచక్రంలో భాగంగా ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చిన మహిళలు/బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇళ్లివి. ‘పిరియడ్ పాజిటివ్ హోమ్స్’ పేరుతో ప్రారంభించిన ఈ ఇళ్లలో ఉన్న వారు నెలసరి సమయంలో సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేందుకు వీలుగా సకల సదుపాయాలూ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిందామె. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మరికొన్ని గ్రామాల్లోనూ విస్తరించే పనిలో ఉన్నానంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.