కొత్తగా తల్లయ్యారా? నిద్రలేమిని ఇలా దూరం చేసుకోండి!

కొత్తగా తల్లైన మహిళల జీవన విధానంలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. పాపాయి ధ్యాసలో పడిపోయి సరిగ్గా తినడం, కంటి నిండా నిద్రపోవడం కూడా మర్చిపోతుంటారు తల్లులు. ఇది క్రమంగా వారిలో ఒత్తిడికి దారితీస్తుంది.. శారీరకంగానూ ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే కొత్తగా తల్లైన మహిళల్లో ఈ నిద్రలేమి సహజమే అయినా.. అది తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు.

Published : 05 Jul 2021 14:56 IST

దివిజ ఇటీవలే తల్లైంది. తన కొడుకు పడుకున్నప్పుడే ఇంటి పనులన్నీ చేసుకోవడం అలవాటు చేసుకుంది. దీంతో విశ్రాంతి కరువై శారీరక అలసట, నిద్రలేమిని ఎదుర్కొంటోందామె.

మూడు నెలల పాపకు తల్లైన భువిజ.. రాత్రి తన బిడ్డకు పాలివ్వడానికి పదే పదే నిద్రలేస్తుంటుంది. దీనికి తోడు పగలు కూడా పాపాయి ఆలనా పాలనతో సరైన నిద్ర లేక సతమతమవుతోంది.

కొత్తగా తల్లైన మహిళల జీవన విధానంలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. పాపాయి ధ్యాసలో పడిపోయి సరిగ్గా తినడం, కంటి నిండా నిద్రపోవడం కూడా మర్చిపోతుంటారు తల్లులు. ఇది క్రమంగా వారిలో ఒత్తిడికి దారితీస్తుంది.. శారీరకంగానూ ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే కొత్తగా తల్లైన మహిళల్లో ఈ నిద్రలేమి సహజమే అయినా.. అది తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే బాలింతలు వీలు చూసుకొని మరీ విశ్రాంతి తీసుకోవడం, నిద్ర పోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు సైతం సూచిస్తున్నారు.

పిల్లలతో పాటే!

పసి పిల్లలకు రాత్రి, పగలు అనే తేడా ఉండదు.. వాళ్లు ఎప్పుడు నిద్ర పోతారో, ఎప్పుడు మెలకువతో ఉంటారో చెప్పలేం.. ఈ క్రమంలో కొంతమంది గంటల తరబడి నిద్రపోతే.. మరికొందరు చిన్నారులు అలా ఓ అరగంట కునుకు తీసి.. ఆలోపే నిద్ర లేస్తుంటారు. ఇలా వారు నిద్ర లేచే సరికి తల్లి పక్కనే ఉండాలి.. లేదంటే ఆకలితో ఏడుపు లంకిస్తుంటారు. ఇక పిల్లలు పడుకున్నారని ఆ సమయంలో ఇంటి పనులు చేసుకోవడం చాలామందికి అలవాటు! పిల్లలకు పాలిచ్చే క్రమంలో రాత్రుళ్లూ నిద్ర ఉండదు. దీంతో బాలింతల్లో నిద్రలేమి సమస్య ఎదురవుతుంటుంది. మరి, దీన్ని జయించాలంటే పనులన్నీ పక్కన పెట్టి పిల్లలు నిద్రపోయినప్పుడే తల్లులూ నిద్ర పోవాలంటున్నారు నిపుణులు. ఒకవేళ ఇంట్లో చిన్నారుల్ని చూసుకునే పెద్దవాళ్లుంటే మీ పిల్లల బాధ్యతను కాసేపు వాళ్లకు అప్పగించి మీరు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు.

నిద్ర పట్టట్లేదా?

మనకేమో రాత్రి వేళ హాయిగా నిద్ర పోవడం అలవాటు.. అదే పిల్లలేమో ఆ సమయంలో సరిగ్గా నిద్రపోరు. ఇక వేళా పాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర రమ్మంటే అస్సలు రాదు. నిజానికి బాలింతల్లో నిద్ర లేమికి ఇలా నిద్ర పట్టకపోవడమూ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అలాగని నిద్రను దాటవేయకుండా సులభంగా నిద్ర పట్టడం కోసం ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు, మీ కుటుంబ సభ్యుల సహాయంతో తల-శరీరం మర్దన చేసుకోవడం, కాసేపు నడక.. వంటివి సాధన చేస్తే మనసు రిలాక్సై సుఖ నిద్రకు ప్రేరేపిస్తుంది. తద్వారా శరీరానికీ విశ్రాంతి దొరుకుతుంది.

ఆ ఆలోచనల్ని వదిలేయండి!

కొత్తగా తల్లైన మహిళల్లో ప్రసవానంతర ఒత్తిడి సహజమే! అయితే ఇందుకు కారణాలు అనేకం. గర్భం ధరించడం, డెలివరీ.. సమయాల్లో బరువు పెరగడం, శరీరంపై ముడతలు, అందం తగ్గిపోవడం.. వంటివి రావడం సహజమే అని తెలిసినా కొంతమంది వాటిని అంగీకరించలేరు. దాంతో మానసిక ఒత్తిడి, ఆందోళనలకు గురవుతుంటారు. తిరిగి పూర్వపు స్థితికి ఎప్పుడొస్తామో అన్న ఆలోచనల్లోనే నిరంతరం గడుపుతుంటారు. కొత్తగా తల్లైన మహిళల్లో నిద్రలేమికి ఇదీ ఓ కారణమే! ఇలాంటి మానసిక ఆందోళనలు మీకే కాదు.. మీ చిన్నారికీ మంచివి కాదు. కాబట్టి వీటిని ఎంత త్వరగా దూరం చేసుకుంటే అంత మంచిది. ఇలాంటి ఆలోచనలు మనసులోకి రానప్పుడు నిద్ర కూడా సుఖంగా పడుతుందంటున్నారు నిపుణులు. ఇక ఎంత ప్రయత్నించినా ఇలాంటి ఆలోచనలు తరచూ వేధిస్తున్నట్లయితే ఓసారి మానసిక నిపుణులను సంప్రదించి కౌన్సెలింగ్‌ కూడా తీసుకోవచ్చు.

బాధ్యతల్ని పంచుతూ..!

బాలింతలకు రోజంతా తమ బిడ్డతోనే సరిపోతుంది.. అలాంటప్పుడు ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు అంటే పని భారం తడిసిమోపెడవుతుంది. ఇలా అయితే పిల్లలు నిద్రపోయినప్పుడు తాము కూడా పడుకోవడానికి సమయం దొరకదు. కాబట్టి కొత్తగా తల్లైన మహిళలు సాధ్యమైనంత వరకు పిల్లల్ని చూసుకోవడమొక్కటే పనిగా పెట్టుకోవాలి. ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులున్నట్లయితే మిగతా పనులు వారికి అప్పగించడంలో తప్పు లేదు. అలాగే మీ పాపాయి తల్లిపాలతో పాటు పోత పాలు కూడా తాగుతున్నట్లయితే.. డబ్బా పాలు తాగించే బాధ్యతను మీ వారికి అప్పగించచ్చు.. ఆ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోవచ్చు.. ఇలా ఆలోచిస్తే బాలింతలు విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రలేమిని ఎదుర్కోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.

ఇలా చేయద్దు!

* కొత్తగా తల్లైన మహిళలు సమయం లేదని సరిగ్గా తినకపోవడం, గబగబా తినేయడం అస్సలు చేయద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే పాపాయికి సరైన పోషకాలు అందాలన్నా, మీరు త్వరగా కోలుకోవాలన్నా నిపుణుల సూచించిన పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి.

* బాలింతలు కాఫీ తాగే అలవాటును ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫీన్‌ నిద్రలేమికి కారణమవుతుంది. ఒకవేళ కాఫీ తాగకుండా ఉండలేం అనుకుంటే రోజుకు ఒక కప్పు చాలు. అది కూడా మీ పోషకాహార నిపుణులు సూచిస్తేనే తీసుకోవడం మంచిది.

* కొంతమంది తల్లులు పాపాయి పడుకున్నప్పుడు మొబైల్‌తో సమయం గడపడం, టీవీ చూస్తూ కాలక్షేపం చేయడం.. వంటివి చేస్తుంటారు. ఈ అలవాట్ల వల్ల సమయం వృథా, ఒత్తిడి ఎదురవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు.

బాలింతలు నిద్రలేమిని దూరం చేసుకోవడానికి ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోతే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా.. నిపుణుల్ని సంప్రదిస్తే మంచిది. తద్వారా మీ నిద్రలేమికి కారణమేంటో తెలుసుకొని దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఫలితంగా నిద్రలేమి ఇతర అనారోగ్యాలకు దారితీయకుండా జాగ్రత్తపడచ్చు..! ఇటు దీని ప్రభావం పాపాయిపైనా పడకుండా చూసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్