Nita Ambani: నా కూతుర్ని అలాగే పెంచాను!

స్త్రీపురుష సమానత్వం తొలుత ఇంటి నుంచే మొదలవ్వాలంటారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆడ, మగ పిల్లలిద్దరినీ సమానంగా పెంచినప్పుడే సమాజంలో మార్పు తీసుకురాగలం. అలాంటి సమానత్వానికి తన ఇంటినే అతి పెద్ద ఉదాహరణగా చూపిస్తున్నారు రిలయన్స్‌ ఫౌండేషన్‌ అధినేత్రి నీతా అంబానీ.

Published : 27 Oct 2023 21:18 IST

(Photos: Instagram)

స్త్రీపురుష సమానత్వం తొలుత ఇంటి నుంచే మొదలవ్వాలంటారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆడ, మగ పిల్లలిద్దరినీ సమానంగా పెంచినప్పుడే సమాజంలో మార్పు తీసుకురాగలం. అలాంటి సమానత్వానికి తన ఇంటినే అతి పెద్ద ఉదాహరణగా చూపిస్తున్నారు రిలయన్స్‌ ఫౌండేషన్‌ అధినేత్రి నీతా అంబానీ. ఆటస్థలం నుంచి బోర్డ్‌ రూమ్‌ దాకా.. ప్రతి విషయంలోనూ తన ముగ్గురు పిల్లల్ని సమానంగా పెంచి, సమాన అవకాశాలు కల్పించిన ఆమె.. ఇప్పుడు వ్యాపారంలోనూ ముగ్గురికీ సమాన స్థాయి కల్పించారు. ఈ సమానత్వమే సంస్థ అభివృద్ధిలోనూ కీలకంగా మారినట్లు చెబుతున్నారామె. ముకేశ్‌ అంబానీ ఇటీవలే ప్రకటించిన తన వారసత్వ ప్రణాళికలో భాగంగా స్పందించిన నీతా.. కూతుళ్లనూ కొడుకులతో సమానంగా ప్రోత్సహించినప్పుడే ఈ సమాజంలో స్త్రీ సాధికారత సాధ్యమవుతుందంటున్నారు. చిన్నతనం నుంచి తన పిల్లల్ని పెంచిన తీరు, ఈ క్రమంలో తల్లిదండ్రులుగా తామిద్దరూ పోషించిన కీలక పాత్ర గురించి ఈ సందర్భంగా పంచుకున్నారామె.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ-నీతా అంబానీ దంపతుల పిల్లలైన ఈషా, ఆకాశ్‌, అనంత్‌లు ప్రస్తుతం ఈ సంస్థకు సంబంధించిన మూడు అనుబంధ సంస్థల వ్యాపార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈషాకు రిలయన్స్‌ రిటైల్‌, ఆకాశ్‌కు డిజిటల్‌/టెలికాం, అనంత్‌కు న్యూ ఎనర్జీ వ్యాపారాల్ని అప్పగించిన వీరు.. ముగ్గురికీ వ్యాపారంలో సమాన స్థాయి కల్పించినట్లు చెబుతున్నారు. కేవలం వ్యాపారంలోనే కాదు.. చిన్నప్పట్నుంచి ప్రతి విషయంలోనూ ముగ్గురినీ సమానంగా పెంచినట్లు, సమాన అవకాశాలు కల్పించినట్లు చెప్పుకొచ్చారు నీతా. ఇటీవలే కంపెనీ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆమె.. తమ పిల్లల పెంపకం, భర్తతో తనకున్న అనుబంధం, ఇది పిల్లల ఎదుగుదలపై చూపించిన ప్రభావం.. వంటి విషయాలెన్నో పంచుకున్నారామె.

ముగ్గురూ నాకు సమానమే!

కుటుంబంలో పిల్లలైనా, పెద్దలైనా ఎవరి బలాబలాలు వాళ్లకుంటాయి. వయసుతో సంబంధం లేకుండా వాటిని ఆదర్శంగా తీసుకుంటే.. ఇంట్లో ఒకరి నుంచి మరొకరు బోలెడన్ని విషయాలు నేర్చుకోవచ్చు.. అలా తాము ఐదుగురం ఎన్నో విషయాలు నేర్చుకున్నామని చెబుతున్నారు నీతా.

‘నా ముగ్గురు పిల్లల్లో విభిన్న నైపుణ్యాలున్నాయి. ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా, ఉత్తమంగా తీర్చిదిద్దే దిశగా అనంత్‌ ముందుకు సాగుతున్నాడు. ఇక ఆకాశ్‌ జియోతో డిజిటల్‌ విప్లవం సృష్టించే పనిలో నిమగ్నమయ్యాడు. ఈషా ఇటు రిటైల్‌తో పాటు అటు రిలయన్స్‌ ఫౌండేషన్‌ బాధ్యతల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటోంది. ఇలా వారికంటూ ప్రత్యేకమైన బలాబలాలున్నాయి. ఇలాంటి పాజిటివ్ గుణాలనే ఇంట్లో మేమంతా ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటూ స్ఫూర్తి పొందాం.

ఇంట్లో ఆడపిల్లైనా, మగ పిల్లాడైనా ఇద్దరూ సమానమే! ఈ విషయాన్ని ఆడపిల్లలు గ్రహించి.. తామూ తమ సోదరుల కంటే తక్కువ కాదని తెలుసుకోవాలి.. ఇంట్లో మార్గనిర్దేశకులు కావాలి. అటు పెద్దలూ ఆడ, మగ పిల్లలిద్దరినీ సమానంగా పెంచాలి. నేనెప్పుడూ నా ముగ్గురు పిల్లల విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు చూపలేదు. నా ఇద్దరు కొడుకులు ఏదైతే చేయగలరో.. నా కూతురూ అది చేయగలిగేలా పెంచాను. సంస్థ వారసత్వాన్ని, అభివృద్ధిని ఇది ప్రతిబింబిస్తుంది. ఈషాకు వివాహమైనప్పటికీ.. రిలయన్స్‌ వ్యాపారాల్లో తన ఇద్దరు సోదరుల మాదిరిగానే తనకూ సమాన వాటా దక్కుతుంది. ఇలా మా సంస్థలో యువతరం నాయకత్వం వహిస్తుండడం హర్షించదగ్గ విషయం. పుట్టుకతోనే ఎవరూ పరిపూర్ణులు కారు. పొరపాట్లు చేయడం తప్పు కాదు.. వాటి నుంచి నేర్చుకోకపోవడం తప్పు. కాబట్టి పొరపాట్లనే మన విజయానికి సోపానాలుగా మార్చుకోవాలి.. ఇలాంటి విషయాలే చిన్నతనం నుంచి నేను నా పిల్లలకు నూరిపోశాను..’ అంటున్నారు నీతా.

అది కీలక నిర్ణయం!

పిల్లల పెంపకం, వారి అభివృద్ధి, మార్గనిర్దేశనం చేయడం.. వంటి విషయాల్లో తల్లిదండ్రులిద్దరి పాత్ర సమానంగా ఉంటుంది. మంచి జీవిత భాగస్వామి దొరికినప్పుడే ఇది సాధ్యమవుతుందంటున్నారు నీతా.

‘నా భర్త ముకేశ్‌ జీవితంలో ఎన్నో విజయాలున్నాయి. ఆయనలో నాకు నచ్చేది ఆయన దూరదృష్టే! రాబోయే భవిష్యత్తు గురించి ఇప్పుడే ఆలోచించి.. చక్కటి ప్రణాళికలు వేసుకుంటాడు. ఒకప్పుడు నా ప్రాణ స్నేహితుడైన ముకేశ్‌ని నా జీవిత భాగస్వామిగా పొందడం నిజంగా నా అదృష్టం. పిల్లల పెంపకం, ముగ్గురికీ సమాన ప్రాధాన్యమిచ్చే విషయాల్లో ఆయన అస్సలు రాజీపడరు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగం.. వారి పిల్లల పైనా సానుకూల ప్రభావం చూపుతుందనేది నా నమ్మకం. ఒక రకంగా మా మధ్య ఉన్న ప్రేమైక బంధమే మా పిల్లల్నీ సన్మార్గంలో నడిపిస్తోందనిపిస్తుంది. లాంగ్‌డ్రైవ్స్‌కి వెళ్లడం, హిందీ పాటలు వినడం, స్ట్రీట్‌ఫుడ్‌ని ఆస్వాదించడం, పెద్దలకిచ్చే గౌరవ మర్యాదలు.. అప్పటికీ, ఇప్పటికీ మా ఇద్దరి ఇష్టాయిష్టాలు, అభిరుచుల్లో ఏ మార్పులు లేవు. ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరం గౌరవిస్తున్నాం. ఈ లక్షణాలే మా కుటుంబంలో ఒకరి పట్ల మరొకరు ప్రేమతో, ఆప్యాయతతో మెలిగేలా చేస్తున్నాయి. అందుకే సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది మన జీవితంలో తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటని ఎప్పుడూ నా పిల్లలకు చెబుతుంటాను..’ అంటున్నారు నీతా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్