Bhakti Sharma : ఆమె నీటిలోకి దిగిందంటే.. రికార్డులు తలవంచాల్సిందే..!

ప్రస్తుతం చిత్రపరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఇలాంటి సినిమాల ద్వారా కొంతమంది రియల్‌ హీరోస్‌ జీవితగాథలు ప్రపంచానికి పరిచయమవుతున్నాయి. నీర్జా భానోత్, ఫోగట్‌ సిస్టర్స్‌, గుంజన్ సక్సేనా, శకుంతలా దేవి, గంగూబాయి కథియావాడి.. జీవిత గాథలు ఈ కోవలోకే వస్తాయి. ఈ క్రమంలోనే.. ఈతనే తన కెరీర్‌గా మార్చుకొని.. చిన్న వయసులోనే ఎన్నో రికార్డులను.....

Published : 28 Mar 2022 15:06 IST

(Photos: Instagram, Screengrab)

ప్రస్తుతం చిత్రపరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఇలాంటి సినిమాల ద్వారా కొంతమంది రియల్‌ హీరోస్‌ జీవితగాథలు ప్రపంచానికి పరిచయమవుతున్నాయి. నీర్జా భానోత్, ఫోగట్‌ సిస్టర్స్‌, గుంజన్ సక్సేనా, శకుంతలా దేవి, గంగూబాయి కథియావాడి.. జీవిత గాథలు ఈ కోవలోకే వస్తాయి. ఈ క్రమంలోనే.. ఈతనే తన కెరీర్‌గా మార్చుకొని.. చిన్న వయసులోనే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న స్వి్మ్మర్‌ భక్తి శర్మ జీవిత చరిత్ర ఆధారంగా త్వరలోనే ఓ బయోపిక్ రాబోతుంది. ఈ చిత్రంలో కియారా అడ్వాణీ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆమె తల్లి పాత్రలో షెఫాలీ షా నటించనుంది. ఈ నేపథ్యంలో.. తన అనితర సాధ్యమైన రికార్డులతో చరిత్రలో నిలిచిపోయిన స్విమ్మర్‌ భక్తి శర్మ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీకోసం...

తల్లే గురువు...

భక్తి శర్మ 1989లో ముంబయిలో జన్మించింది. ఆమె పెరిగిందంతా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోనే! భక్తి తల్లి లీనా శర్మ కూడా స్విమ్మరే. ఆమె భక్తికి రెండున్నరేళ్ల వయసున్నప్పట్నుంచే నుంచే ఈత కొట్టడం నేర్పించింది. తద్వారా ఈ క్రీడపై మక్కువ పెంచుకున్న భక్తి.. పాఠశాల దశలోనే స్విమ్మింగ్‌లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పలు అవార్డులు సొంతం చేసుకుంది. అప్పటిదాకా ఈత కొలనులో జరిగే పోటీలకు మాత్రమే పరిమితమైన భక్తి.. ఆ తర్వాత్తర్వాత బహిరంగ ప్రదేశాల్లో ఈత కొట్టడం నేర్చుకుంది. నదులు, సముద్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటూ ఈ తరహా స్విమ్మింగ్‌లో ప్రావీణ్యం సంపాదించింది. అలా 14 ఏళ్ల వయసులోనే మొదటిసారి ముంబయిలోని ఉరన్‌ పోర్ట్‌ నుంచి గేట్‌వే ఆఫ్‌ ఇండియా వరకు 16 కిలోమీటర్లు సముద్రంలో ఈత కొట్టి రికార్డు సృష్టించింది. ఆ మరుసటి ఏడాదే ధర్మతార్‌ నుంచి గేట్‌వే ఆఫ్‌ ఇండియా వరకు తొమ్మిదిన్నర గంటల్లో 36 కిలోమీటర్లు ఈది తన రికార్డును మెరుగుపరుచుకుంది.

తొలి ప్రయత్నం విఫలమైనా..!

తన ఈత నైపుణ్యాలతో స్వదేశంలోనే సత్తా చాటిన భక్తి.. తన తర్వాతి ప్రయాణాన్ని ఖండాతరాలకు విస్తరించింది. ఈ క్రమంలో ఇంగ్లిష్‌ ఛానెల్‌పై కన్నేసిందామె. 33 కిలోమీటర్ల ఈ దూరాన్ని ఛేదించాలని భక్తి శర్మ తల్లి లీనా శర్మకు కోరిక ఉండేదట. వీరికి ప్రియాంకా గెహ్లాత్‌ అనే మరో అమ్మాయి తోడవడంతో.. ఈ ముగ్గురూ కలిసి 2008లో మొదటిసారి ఇంగ్లిష్‌ ఛానల్‌ ఈదడానికి ప్రయత్నించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మొదటి ప్రయత్నం విఫలమైంది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా వారం తర్వాత చేసిన రెండో ప్రయత్నంలో ఈ త్రయం విజయం సాధించింది. ఈ ఫీట్‌ సాధించడానికి భక్తికి 13 గంటల 55 నిమిషాలు పట్టింది. అప్పటికి ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే! అలాగే ప్రపంచంలో తల్లీకూతుళ్లు కలిసి ఇంగ్లిష్‌ ఛానల్‌ను ఈదడం అదే మొదటిసారి కావడం విశేషం! ఇలా ఓవైపు ఈతలో రికార్డులు సృష్టిస్తోన్నా.. భక్తి తన చదువును మాత్రం ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. ఆమె మీడియా, కమ్యూనికేషన్‌ విభాగంలో మాస్టర్స్‌ పూర్తి చేసింది.

మహాసముద్రాలనూ వదల్లేదు!

భక్తి తర్వాతి లక్ష్యం మహాసముద్రాలపైకి మళ్లింది. సముద్రంతో పోల్చుకుంటే మహాసముద్రాల్లో వాతావరణ పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయి. అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రమాదకరమైన జలచరాలుంటాయి. ఉప్పు నీటితో చర్మానికీ ప్రమాదమే! మరి, ఇలాంటి ప్రతికూలతల్ని తట్టుకొని లక్ష్యాన్ని పూర్తి చేయాలంటే ఎంతో కఠోర శ్రమ అవసరం. అయినా అన్నింటినీ తట్టుకొని గొప్ప సాహసమే చేసింది భక్తి.

* 2007లో పసిఫిక్‌ మహాసముద్రంలో అల్కాట్రాజ్ తీరం వద్ద 6.5 కిలోమీటర్లు ఈత కొట్టింది.

* అదే సంవత్సరం గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలోని అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఈత కొట్టి బంగారు పతకాన్ని గెలుచుకుంది.

* ఆ తర్వాత తన తల్లి లీనా శర్మ, ప్రియాంకా గెహ్లాత్‌తో కలిసి హిందూ మహాసముద్రంలో భాగంగా.. ధర్మతార్‌ నుంచి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వరకు, తిరిగి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా నుంచి ధర్మతార్‌ వరకు.. మొత్తంగా 72 కిలోమీటర్లు ఈత కొట్టి తనకెదురులేదనిపించింది. దీనికి ఆమెకు సుమారు 16 గంటల 58 నిమిషాల సమయం పట్టింది.

* ఇక 2010లో ఆర్కిటిక్‌ మహాసముద్రంలో 1.8 కిలోమీటర్ల దూరాన్ని 33 నిమిషాల్లో ఈది మరో ఘనతను సొంతం చేసుకుంది. తద్వారా నాలుగు మహాసముద్రాల్లో ఈత కొట్టిన రెండో స్విమ్మర్‌గా, అతి పిన్న వయస్కురాలిగా భక్తి ప్రపంచ రికార్డు సృష్టించింది.

గడ్డకట్టే నీటిలో నలభై నిమిషాలు..!

భక్తి స్విమ్మింగ్‌ కెరీర్‌లోనే 2015లో చేపట్టిన అంటార్కిటికా యాత్ర ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మహాసముద్రాల్లో ఈదడమే ఒక గొప్ప విషయం అనుకుంటే.. అంటార్కిటికా లాంటి విభిన్న వాతావరణ పరిస్థితులున్న మహాసముద్రంలో ఈదడమంటే అత్యంత క్లిష్టమైన సాహసమని చెప్పాలి. అక్కడి నీటి ఉష్ణోగ్రత కేవలం ఒక డిగ్రీనే ఉంటుంది. అంటే నీళ్లు ఘనీభవించే స్థానమన్నమాట! అలాంటి నీటిలో దాదాపు 2.3 కిలోమీటర్ల దూరాన్ని 41.14 నిమిషాల్లో ఈత కొట్టి ఔరా అనిపించింది. తద్వారా ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా, ఆసియాలోనే మొదటి మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించింది భక్తి. ఈ అరుదైన రికార్డు సాధించినందుకు గాను భారత రాష్ట్రపతి, ప్రధాని.. వంటి పలువురు ప్రముఖుల ప్రశంసలందుకుంది.


 

తన అనితర సాధ్యమైన రికార్డులకు గుర్తింపుగా 2010లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ‘టెంజింగ్‌ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’ని సైతం అందుకుంది భక్తి. ఈతలో ఎన్నో రికార్డులను కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన భక్తికి ‘జలకన్య’ అనే పేరు కూడా ఉంది.

ఇక త్వరలోనే ఈ మహిళా స్విమ్మర్‌ జీవితగాథ తెరకెక్కబోతోంది. ఇందులో భక్తి పాత్ర తెరపై కియారా అడ్వాణీ పోషించనుంది. ఆమె తల్లి లీనా శర్మ పాత్రలో షెఫాలీ షా నటించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్