Digital Star: అందుకే ఆమె వంటలకు కోట్ల మంది ఫ్యాన్స్!

పాకశాస్త్రంపై తనకున్న మక్కువతో పెళ్లై, పిల్లలు పుట్టాక.. కెరీర్‌ని ప్రారంభించిన ఆమె.. అనతికాలంలోనే యూట్యూబ్‌ సెన్సేషన్‌గా మారిపోయారు. లక్షల కొద్దీ వ్యూస్‌, మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో దేశంలోనే ప్రముఖ డిజిటల్‌ స్టార్స్‌లో ఒకరిగా ఎదిగారు.

Published : 09 Aug 2023 12:32 IST

(Photos: Facebook)

ఉదయం లేచింది మొదలు.. మన మదిలో ఒకటే ప్రశ్న.. ‘ఇవాళ ఏం వండుదామా?’ అని! ఇలాంటప్పుడు కవితా సింగ్‌ వీడియోలు చూస్తే.. బోలెడన్ని ఆప్షన్లు దొరుకుతాయి. అది కూడా సాధారణ వంటకాలు కాదు.. సరికొత్త వంటకాలతో ఇంటిల్లిపాదికీ విందు చేసే వెరైటీ వంటకాలు! అలాంటి ప్రత్యేకమైన వంటకాలతో దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు కవిత. పాకశాస్త్రంపై తనకున్న మక్కువతో పెళ్లై, పిల్లలు పుట్టాక.. కెరీర్‌ని ప్రారంభించిన ఆమె.. అనతికాలంలోనే యూట్యూబ్‌ సెన్సేషన్‌గా మారిపోయారు. లక్షల కొద్దీ వ్యూస్‌, మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో దేశంలోనే ప్రముఖ డిజిటల్‌ స్టార్స్‌లో ఒకరిగా ఎదిగారు. మనసులో సాధించాలన్న తపన ఉంటే.. పెళ్లి, పిల్లలు కెరీర్‌కు అడ్డు కాదని నిరూపిస్తోన్న కవిత.. తన యూట్యూబ్‌ ప్రయాణం గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

మాది ఉత్తరప్రదేశ్‌. నాకు చిన్నతనం నుంచే వంట చేయడమంటే ఇష్టం. దాంతో అమ్మకు కిచెన్‌లో సహాయపడేదాన్ని. ఈ క్రమంలో వివిధ రకాల వంటకాలు నేర్చుకున్నా. అయితే చదువు, ఆపై బ్యాంకు ఉద్యోగం కారణంగా కొన్నాళ్ల పాటు నా తపనను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక 2009లో పెళ్లి చేసుకొని యూకే వెళ్లాక.. తిరిగి వంటలపై దృష్టి పెట్టే అవకాశం దొరికింది.

వంటల ఛానల్‌ అలా!

మావారు పెద్ద ఫుడీ.. వెరైటీ వంటకాలు తయారు చేయడానికి, ఆస్వాదించడానికి ఇష్టపడతారు. ఇలా తనకిష్టమైనవన్నీ తయారుచేసి పెడుతూ వంటల్లో మరిన్ని మెలకువలు నేర్చుకున్నా. ఇక తిరిగి ఇండియాకొచ్చాక.. కొన్నాళ్లు నా కొడుకు ఆలనా పాలనతోనే సమయం గడిచిపోయేది. వాడు స్కూలుకెళ్లడం ప్రారంభించాక.. నాకు బోలెడంత ఖాళీ సమయం దొరికేది. దాంతో మళ్లీ వంటలపై దృష్టి పెట్టా. వివిధ రకాల వంటకాలు చేస్తూ.. వాటిని వీడియో తీసి మా స్నేహితులు, బంధువులకు పంపించేదాన్ని. ఆ వంటకాల్ని వారు తయారుచేసి నాకు ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చేవారు. అలా వారి సలహాలు, సూచనల మేరకు పలు మార్పులు చేర్పులు చేసి.. ప్రయోగాత్మక రెసిపీలు తయారుచేయడం మొదలుపెట్టా. వీటిని మరింతమందికి చేరువ చేయాలన్న ఆలోచనతో 2014లో ‘కవితాస్‌ కిచెన్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించా. ఈ క్రమంలో వీడియో రూపొందించడం, ఎడిట్‌ చేయడం, అప్‌లోడ్‌ చేయడం.. ఇవన్నీ కొత్తగా, ఆసక్తిగా అనిపించేవి. ఓ చిన్నపాటి సినిమా తెరకెక్కిస్తున్న ఫీలింగ్‌ కలిగేది.

ఆ వీడియోతో దశ తిరిగింది!

వ్యూస్‌, సబ్‌స్క్రైబర్స్‌ గురించి ఆలోచించకుండా నేను చేసిన వంటకాలకు సంబంధించిన వీడియోలన్నీ పోస్ట్‌ చేస్తూ ముందుకు సాగా. ఇలా మూడు నెలలు గడిచేసరికి ఒక డాలర్‌ సంపాదించా. అది తక్కువ మొత్తమే అయినా నచ్చిన పనిలో ఏదో సాధించానన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ డబ్బుతో నా ఫ్రెండ్స్‌కి పిజా పార్టీ కూడా ఇచ్చా. అలా నేను పోస్ట్‌ చేసిన తొలి 88 వీడియోల్ని.. ఇలా ఛానల్‌లోకి వచ్చి, అలా చూసి వెళ్లిపోయిన వారే ఎక్కువ. కానీ 89వ వీడియో మాత్రం విపరీతంగా వైరలైంది. ఇందులో భాగంగా నేను తయారుచేసిన బ్రెడ్‌ గులాబ్‌ జామూన్‌ రెసిపీకి వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అప్పటిదాకా వీక్షకులకే పరిమితమైన నా ఛానల్‌ని.. ఆపై ఒక్కొక్కరుగా సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. అలా మూడేళ్లలో నా ఛానల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 10 లక్షలు దాటింది.

సింప్లిసిటీని ఇష్టపడ్డారు!

మొదట్లో కిచెన్‌ సెటప్‌, నాణ్యమైన కెమెరా.. వంటి వాటి గురించి నేను ఆలోచించలేదు. నా దగ్గరున్న కాంపాక్ట్‌ కెమెరాతోనే వీడియోలు చిత్రీకరించేదాన్ని. ఇలా నా సింపుల్‌ సెటప్‌ను ఇష్టపడి నా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న వాళ్లూ ఎంతోమంది! ‘ఇలాంటి సింపుల్‌ సెటప్‌లో మీరు వంట చేస్తుంటే మాకు హోమ్లీ ఫీలింగ్‌ కలిగేది’ అనేవారు. ఇక యూజర్లు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను బట్టే వారికి కావాల్సిన రెసిపీలు తయారుచేసి.. ఆ వీడియోలు పోస్ట్‌ చేసేదాన్ని. వంటలో ప్రావీణ్యం లేనివారూ సులభంగా వంట చేసుకునేలా పలు చిట్కాలు అందించేదాన్ని. ఇలా వీడియో పోస్ట్‌ చేయడంతో నా పనైపోయిందని చేతులు దులుపుకోను.. దానికొచ్చిన ప్రతి కామెంట్‌కి స్పందించడం, ప్రశ్నలకు జవాబులివ్వడం అలవాటుగా మార్చుకున్నా. ఇదీ మరెంతోమంది అభిమానాన్ని తెచ్చిపెట్టింది. ఇక రోజులు గడిచే కొద్దీ, ప్రేక్షకుల అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొని.. నా కిచెన్‌ సెటప్‌లో పలు మార్పులు చేర్పులు చేసుకున్నా.. అయితే నా కుకింగ్‌ స్టైల్‌ మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉంది. నా యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా నేను సంపాదించిన డబ్బునే పెట్టుబడిగా పెడుతూ దీన్ని మరింత అభివృద్ధి చేస్తున్నా.

నోరూరించే రెసిపీలెన్నో!

ప్రస్తుతం నా యూట్యూబ్‌ ఛానల్‌లో 1500లకు పైగా వీడియోలున్నాయి. అందులో అల్పాహారం, పచ్చళ్లు, వివిధ రకాల కూరలు, స్వీట్లు, స్నాక్స్‌, స్టార్టర్స్‌, మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలు, పానీయాలు, పిల్లలు ఇష్టంగా తినే రెసిపీలు, త్వరగా చేసుకోదగిన ఇన్‌స్టంట్‌ వంటకాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో నోరూరించే రెసిపీల్ని తయారుచేసి పోస్ట్‌ చేస్తున్నా. మరోవైపు స్వయంగా తయారుచేసిన ప్రత్యేకమైన మసాలా పొడుల్నీ మార్కెట్లోకి తీసుకొచ్చా. ప్రస్తుతం నా పాకశాస్త్ర నైపుణ్యాలు, యూట్యూబ్‌ వీడియోల ద్వారా 1.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్ల ఆదరాభిమానాల్ని చూరగొన్నా. మరోవైపు ఇతర సోషల్‌ మీడియా పేజీల్లోనూ మిలియన్ల కొద్దీ అభిమానులు నన్ను ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో.. ‘మీ వీడియోలు చూసి మేం చాలా విషయాలు నేర్చుకున్నామ’ని వారు చెబుతుంటే గర్వంగా అనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మనకొచ్చిన కళను నలుగురితో పంచుకున్నప్పుడు కలిగే సంతోషం, సంతృప్తే వేరు కదా మరి!

అమ్మతనం అడ్డు కాదు!

పెళ్లై, పిల్లలు పుట్టాక మహిళల కెరీర్‌ ముగిసిపోయినట్లే అనుకుంటారు చాలామంది. ఇల్లు, పిల్లల బాధ్యతల్లో పడిపోయి.. తమ ఆసక్తుల్ని కూడా త్యాగం చేస్తుంటారు. కానీ అమ్మతనం మన కెరీర్‌కు అడ్డు కాదు. ఈ దశలోనూ మన తపన, ఆసక్తులపై దృష్టి పెట్టి సక్సెసవ్వచ్చు. అయితే పనిలో స్థిరత్వం ముఖ్యం. ఏ పనిలోనైతే సంతోషం, సంతృప్తి లభిస్తాయో.. దానిపై శ్రద్ధ పెడితే కెరీర్‌లో ఉన్నతి సాధించచ్చు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తప్పనిసరి. నా ప్రయాణంలో నా భర్త, అత్తమామల నుంచి పూర్తి సహకారం, మద్దతు అందుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్