హీరోయిన్స్‌, స్ట్రాంగ్‌ విమెన్‌ పెళ్లి చేసుకోకూడదా?!

హీరోయిన్స్‌, స్ట్రాంగ్‌ విమెన్‌ పెళ్లి చేసుకోకూడదా?!

Updated : 22 Sep 2021 12:55 IST

కుటుంబాన్ని సన్మార్గంలో పెట్టగలిగే సత్తా ఉన్న మహిళలకు దేశాన్ని మార్చే శక్తిసామర్థ్యాలు కూడా ఉన్నాయంటున్నాడు టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. అయితే అది కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నప్పుడే సాధ్యమవుతుందంటున్నాడు. అమ్మ జయలలిత, బెహెన్‌ మాయావతి, దీదీ మమతా బెనర్జీ.. వంటి శక్తివంతమైన మహిళలు ఈ కోవకే చెందుతారని ఉదహరిస్తున్నాడు. అందుకే అభిమానులంతా దేవతలుగా కొలిచే హీరోయిన్స్‌, తమను తాము స్ట్రాంగ్‌ విమెన్‌గా అభివర్ణించుకునే మహిళలంతా పెళ్లి గురించి ఆలోచించడం మాని.. దేశాన్ని ఉద్ధరించడంపై దృష్టి పెట్టమంటున్నాడు. పూరీ మ్యూజింగ్స్ సిరీస్‌లో భాగంగా ‘సింగిల్‌ బై ఛాయిస్‌’ అనే కాన్సెప్ట్‌తో తాజాగా మన ముందుకొచ్చిన ఈ డ్యాషింగ్‌ డైరెక్టర్‌.. స్ట్రాంగ్‌ విమెన్‌కి ఇంకా ఏయే సలహాలిచ్చాడో మీరే చూడండి..


వాళ్లు పెళ్లి చేసుకుంటే నాకు నచ్చదు!
‘సినిమా హీరోయిన్స్‌ పెళ్లిళ్లు చేసుకుంటే నాకెందుకో నచ్చదు. ఎందుకంటే కోటిమందిలో నటిగా మారే అవకాశం ఒక్కరికే లభిస్తుంది. అందుకే వాళ్లు ఎంతో స్పెషల్‌. వాళ్లు కూడా అందరిలాగే పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కంటే నాకు నచ్చదు. హీరోయిన్స్‌ని తమ అభిమానులు దేవతల్లా భావిస్తుంటారు. పర్సుల్లో, మొబైల్‌ స్క్రీన్‌ సేవర్‌గా వాళ్ల ఫొటోల్నే పెట్టుకుంటారు. అలాంటి దేవతలు పురిటి నొప్పులు పడుతుంటే చూడలేను. మనందరం పూజించే నిజమైన దేవతలు కూడా ఎప్పుడూ పిల్లల్ని కనలేదు. పిల్లల్ని కనాలనే కోరిక మనుషులకు ఉంటుంది. దేవతలకు కాదు! కాబట్టి, మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోకుండా దేవతల్లా ఉంటే మాకిష్టం. సాధారణ అమ్మాయిలతో పోల్చుకుంటే వ్యక్తిగతంగా మీరు ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటారు. మీరైనా మగవాడిని దూరం పెట్టవచ్చు కదా..! ప్రేమ లేకపోతే చచ్చిపోతారా?


మంగళసూత్రం మర్చిపోండి!
అమ్మ జయలలిత, బెహెన్‌ మాయావతి, దీదీ మమతా బెనర్జీ.. ఇలా ఎంతోమంది మహిళలు స్ఫూర్తి నింపడానికి ఉన్నారు. వాళ్లకు మగవాళ్లతో పని లేదు. పురాణాల్లో కూడా సింగిల్‌ విమెన్‌ ఎంతోమంది ఉన్నారు. ఇక, హాలీవుడ్‌లో అయితే పెళ్లిని పక్కన పెట్టిన లేడీ సూపర్‌స్టార్స్‌కు కొదవే లేదు. రంభ, ఊర్వశి, మేనకలు పెళ్లి చేసుకోలేదు కాబట్టే స్వర్గంపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. హీరోయిన్స్‌ అందరూ నా మాట విని దేవతల్లా ఆలోచించండి. మీ శక్తిని మరో విధంగా వాడండి. మీరు పెళ్లిళ్లు చేసుకుంటే స్వార్థంగా మారిపోతారు. అదే సింగిల్‌గా ఉంటే ప్రపంచంలోని పిల్లలందరినీ దగ్గరికి తీసుకోగలుగుతారు. ‘రైజింగ్‌ ట్రైబ్‌ ఆఫ్‌ సింగిల్‌ ఉమెన్‌’ అనే కాన్సెప్ట్‌ భారత్‌లో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. హీరోయిన్స్‌ మాత్రమే కాదు.. ధైర్యవంతురాలైన ప్రతి మహిళా దేవతలా మారాలి. కాబట్టి మంగళసూత్రం మర్చిపోండి. నేను స్ట్రాంగ్‌ ఉమెన్‌ అని మీరు ఫీలైతే జీవితంలో సింగిల్‌గా ఉండిపోండి. స్ట్రాంగ్‌ ఉమెన్‌ మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరు’.. అంటున్నాడు పూరీ.
వినడానికి బానే ఉండచ్చు కానీ, పూరీ చెప్పినట్లు స్ట్రాంగ్‌గా ఉండడానికి, పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడడానికి, దేశానికి ఉపయోగపడడానికి అసలు సంబంధం ఏదైనా ఉందా? 
హీరోయిన్లు అయినంత మాత్రాన పెళ్లి చేసుకోకూడదు అనడం కరెక్టేనా? అలాగే ‘స్ట్రాంగ్ ఉమెన్’ అనుకుంటే సింగిల్‌గానే ఉండాలన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? 
పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నప్పుడు మాత్రమే దేశాన్ని మార్చగలుగుతామా? అలాగని సింగిల్‌గా ఉంటే ఈ సమాజం నుంచి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది? 
ఈ అంశాల గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకోండి!

కామెంట్‌ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని