Published : 30/10/2021 19:24 IST

ఇప్పుడు అబ్బాయిలకూ ట్రైనింగ్ ఇస్తుంది!

(Photo: Instagram)

క్రికెట్‌లో మగవారితో సమానంగా మహిళలూ రాజ్యమేలుతున్నారు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఫార్మాట్‌ ఏదైనా మైదానాన్ని దున్నేస్తూ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నారు. ఇలా తమ ఆటతీరుతో అద్భుతాలు సృష్టిస్తోన్న మహిళా క్రికెటర్లు.. అవకాశమొస్తే ఆటలో ఎలాంటి బాధ్యతలనైనా స్వీకరించేందుకు ‘సై’ అంటున్నారు. ఇందుకు తగ్గట్టే క్రికెట్‌తో పాటు వివిధ క్రీడల్లో కోచ్‌లుగా, మెంటార్లుగా, ఫిట్‌నెస్‌ ట్రైనర్లుగా... ఎంపికవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ సారా టేలర్ క్రికెట్లో నూతన అధ్యాయానికి తెరలేపింది. గతంలో అంతర్జాతీయ క్రికెట్‌లో పురుషులతో పోటీ పడి రికార్డులు సృష్టించిన ఆమె.. తాజాగా ఓ పురుషుల క్రికెట్‌ జట్టు (ఫ్రాంఛైజీ జట్టు)కు కోచ్‌గా ఎంపికైంది. అబుదాబీ టీ20 లీగ్‌లో భాగంగా అబుదాబీ జట్టుకు సహాయక కోచ్‌గా నియమితురాలైంది. అయితే ఇదివరకే ఇంగ్లండ్‌ దేశవాళీ జట్టు ససెక్స్‌ కౌంటీకి వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా సేవలందిస్తోన్న సారా.. తాజాగా అబుదాబీ జట్టుకు సహాయక కోచ్‌గా నియమితురాలవడం విశేషం. ఇలా మరో అరుదైన ఘనత తన పేరిట లిఖించుకుందీ క్రికెట్‌ బ్యూటీ.

మన‘సారా’ ఆడలేనంటూ !

పురుషులకే సొంతమనే క్రికెట్‌లో ఆమె బ్యాట్ పట్టిందంటే బౌండరీల వర్షం... టన్నుల కొద్దీ పరుగులు.. ఇక వికెట్ల వెనుక నిల్చుంటే మహేంద్రసింగ్ ధోనీలా మెరుపువేగంతో బెయిల్స్ పడగొట్టే సామర్థ్యం... సారా టేలర్‌ ఆటతీరుకు ఇవి మచ్చుతనకలు మాత్రమే!అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు రకాల ఫార్మాట్ల (టెస్ట్, వన్డే, టీ20)లో ఇంగ్లండ్ మహిళా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆమె మంచి స్ట్రోక్ ప్లేయర్గా గుర్తింపు పొందింది. తన అసమాన ఆటతీరుతో జట్టుకు యాషెస్, ప్రపంచకప్‌లతో పాటు ఎన్నో అద్భుత విజయాలు అందించింది. ఇలా తన అత్యద్భుత ఆటతీరుతో మహిళా క్రికెట్‌లో శిఖరాగ్రానికి చేరుకున్న ఆమె.. 2019 సెప్టెంబర్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. అంతకుముందు నుంచే మానసిక ఆందోళన సమస్యతో పోరాడుతున్న సారా మనస్ఫూర్తిగా ఆడలేకపోతున్నానంటూ ఆటకు గుడ్‌బై చెప్పింది.

రికార్డుల రారాణి!

2006లో పదిహేడేళ్లకే ఇంగ్లండ్ జాతీయ క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టిన సారా స్టార్ బ్యాట్స్‌వుమన్‌గా పేరు సంపాదించింది. మూడు ఫార్మాట్లలోనూ ఆడిన ఆమె... వన్డేలు, టీ20ల్లో తన సొగసైన ఆటతీరుతో ఇంగ్లండ్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించింది. 2008లో తన సహచర క్రికెటర్ కరోలిన్ ఆట్కిన్స్‌తో కలిసి మొదటి వికెట్‌కు 268 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో మొత్తం 6,533 పరుగులు చేసిన ఆమె ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. అదేవిధంగా అద్భుత వికెట్ కీపింగ్ సామర్థ్యమున్న సారా మొత్తం 232 మందిని పెవిలియన్‌కు పంపించింది. తన ఆటతీరుకు గుర్తింపుగా 2012, 2013, 2014 సంవత్సరాలకు గాను వరుసగా ఐసీసీ 'బెస్ట్ ఉమన్ క్రికెటర్'గా అవార్డులు సొంతం చేసుకుంది.

అనుకోని కుదుపు!

జీవితం చాలా విచిత్రమైనది. ఎవరి ఊహలకూ అందదు.. సారా జీవితంలోనూ ఇదే జరిగింది. అద్భుతమైన ఆటతీరుతో అమితమైన వేగంతో ఆకాశాన్ని అందుకున్న సారాను డిప్రెషన్ అంతే వేగంగా పాతాళానికి పడేసింది. మనసులో ఏదో తెలియని భయం ఆమెను కుదురుగా ఉండనీయలేదు. బయట కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ఈ క్రికెటర్‌ మనసంతా ప్రతికూల ఆలోచనలతో నిండిపోయింది. దీంతో ఆమె ఆటతీరు కూడా గాడి తప్పింది. 2013 నాటికి ఆమె పరిస్థితి మరింత దిగజారింది. మానసిక ఆందోళనతో పూర్తిగా ఫామ్ కోల్పోయిన ఈ ఇంగ్లిష్ క్రికెటర్ 2016 వరల్డ్‌కప్‌లో కేవలం 49 పరుగులే చేసి జట్టుకు భారంగా మారింది.

ఎవరూ వద్దనిపించింది..!

‘నా మానసిక ఆందోళనతో నలుగురిలో కలవలేకపోయేదాన్ని. మూడేళ్లుగా ఒంటరితనాన్ని అనుభవించా. ట్రైనింగ్‌కి వెళ్లడం, తిరిగి రూమ్కి రావడం, గదిని శుభ్రం చేసుకోవడం.. ఇలా ఏదో ధ్యాసలో ఉండిపోయేదాన్ని. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వాళ్లు, మీడియా, ఆఖరికి క్రికెట్‌, దానికి సంబంధించిన శిక్షణను కూడా పక్కన పెట్టాలన్న ఆలోచనలు వచ్చేవి. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు నా పరిస్థితి వర్ణనాతీతం! ఒంటరిగా హోటల్‌ గదిలోనే కూర్చొని ఏడ్చేదాన్ని. మనసులో ఇంత భారం పెట్టుకొని ఆటకు న్యాయం చేయలేననిపించింది. అందుకే కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉండాలనుకున్నా..’ అంటూ ఓ సందర్భంలో తన డిప్రెషన్‌ గురించి పెదవి విప్పిందీ ఇంగ్లిష్‌ క్రికెటర్.

అమ్మ అనురాగంతో !

మానసిక ఆందోళనతో ఆటపై పూర్తి దృష్టి పెట్టలేకపోయిన సారా.. 2016 మేలో క్రికెట్‌కు నిరవధిక విరామం ప్రకటించింది. తనకున్న సమస్యను ఎలాంటి దాపరికం లేకుండా బయటి ప్రపంచానికి బహిర్గతం చేసి 'ఇక.. ఆడలేనంటూ' తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఒక మహిళ సమస్యను మరొక మహిళే అర్థం చేసుకుంటుందంటారు. అలా సారా సమస్యను పూర్తిగా అర్థం చేసుకుంది ఆమె తల్లి. అలా అమ్మ అనురాగం.. వైద్యుల చికిత్స.. తన పెట్‌ ‘మిల్లీ’ తోడుతో కోలుకున్న సారా క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది.. బయటి ప్రపంచంలోకి ధైర్యంగా అడుగుపెట్టింది. అలా పదమూడు నెలల తరువాత కోచ్ రాబిన్‌సన్ పర్యవేక్షణలో తిరిగి ప్రాక్టీస్ షురూ చేసింది. పడిలేచిన కెరటంలా 2017లో తన దూకుడును ప్రదర్శిస్తూ.. ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ అందుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో 2019 ఫిబ్రవరిలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పూర్తిస్థాయి క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్టును సారాకు అప్పగించింది.

ఫొటోషూట్‌తో సాహసం!

పునరాగమనంతో అద్భుతంగా రాణించి జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంది సారా. అయితే గతంలో వెంటాడిన ఆందోళనే మళ్లీ ఆమెను ఆవహించింది. ఇదే కారణంతో 2019 జులైలో మహిళల టీ20 యాషెస్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకొని షాక్ ఇచ్చింది. ఆ తర్వాత క్రికెట్‌కు దూరమై.. మహిళా సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఓ పత్రిక కవర్ పేజీ కోసం నగ్నంగా ఫొటోషూట్‌లో పాల్గొని ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సారా మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెడుతుందని అందరూ భావించారు. కానీ వారందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. మానసిక ఆందోళనతో సరిగ్గా ఆటపై దృష్టి నిలపలేకపోతున్నానని... అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిందీ క్రికెట్‌ క్వీన్. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. ప్రస్తుతం టీ20 లీగ్‌ల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో ‘ది హండ్రెడ్‌’ లీగ్‌లో ‘వెల్ష్‌ ఫైర్‌’ జట్టుకి, కౌంటీల్లో ససెక్స్‌, నార్తర్న్‌ డైమండ్స్‌ జట్లకి ఆడుతోంది.

పురుషుల జట్టుకు కోచ్‌గా..!

17 ఏళ్ల ప్రాయంలోనే క్రికెట్‌లో అడుగుపెట్టిన సారాకు ఇంకా ఆడగలిగే సామర్థ్యమున్నా డిప్రెషన్ కారణంగా 30 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించింది. ఆ తర్వాత ఈస్ట్‌బౌర్న్‌లోని ఓ స్కూల్‌లో క్రీడలు, లైఫ్‌ కోచ్‌గా పని చేసింది. ‘ససెక్స్‌ మెంటల్‌ హెల్త్‌, వెల్‌ బీయింగ్‌ హబ్‌’ను నెలకొల్పేందుకు తన వంతు పాత్ర పోషించింది. 2021 మార్చిలో ససెక్స్‌ కౌంటీ పురుషుల క్రికెట్‌ జట్టుకు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించి.. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్రకెక్కింది సారా. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అబుదాబీ జట్టుకు సహాయక కోచ్‌గా నియమితురాలై మరో మైలురాయిని అందుకుంది.

‘ఇది కాస్త అసాధారణమైన విషయమే! పురుషుల ఫ్రాంఛైజీ క్రికెట్‌ జట్టుకు తొలి మహిళా కోచ్‌గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. అయితే ఇది నాతోనే ఆగిపోకూడదు. కోచింగ్‌ నా రక్తంలోనే ఉంది.. అందులోనూ పురుషులకు శిక్షణ ఇవ్వడం విభిన్నమైన అనుభూతి. ఈ సవాలును స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా..’ అంటోంది సారా.

తన ఆటతీరుతో ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్లో తారస్థాయిలో నిలిచిన సారా.. కోచ్‌గానూ అదే స్థాయిలో రాణించాలని కోరుకుందాం..!

ఆల్‌ ది బెస్ట్‌ సారా!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని