బరువు తగ్గినా బొద్దుగా ఉండడమంటేనే ఇష్టం!

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అభినయంతో పాటు అందమూ ఉండాల్సిందే. ప్రధానంగా శరీర సౌష్టవం.. అంటే నాజూగ్గా ఉండే అమ్మాయిలకే అక్కడ క్రేజ్‌ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారే ఎక్కువ రోజులు చిత్ర పరిశ్రమలో కొనసాగుతారు. అందుకే సినిమా అవకాశాల కోసం చాలామంది ఇష్టం లేకున్నా బరువు తగ్గి స్లిమ్‌గా మారిపోతుంటారు. ఈనేపథ్యంలో తాను కూడా అలాగే చేశానంటోంది ప్రముఖ బుల్లితెర నటి షెహ్‌నాజ్‌ కౌర్‌ గిల్‌. గతంలో బొద్దుగా కనిపించిన ఈ భామ కొన్ని నెలల క్రితం సన్నజాజి తీగలా మారిపోయింది.

Updated : 30 Jun 2021 20:38 IST

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అభినయంతో పాటు అందమూ ఉండాల్సిందే. ప్రధానంగా శరీర సౌష్టవం.. అంటే నాజూగ్గా ఉండే అమ్మాయిలకే అక్కడ క్రేజ్‌ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారే ఎక్కువ రోజులు చిత్ర పరిశ్రమలో కొనసాగుతారు. అందుకే సినిమా అవకాశాల కోసం చాలామంది ఇష్టం లేకున్నా బరువు తగ్గి స్లిమ్‌గా మారిపోతుంటారు. ఈనేపథ్యంలో తాను కూడా అలాగే చేశానంటోంది ప్రముఖ బుల్లితెర నటి షెహ్‌నాజ్‌ కౌర్‌ గిల్‌. గతంలో బొద్దుగా కనిపించిన ఈ భామ కొన్ని నెలల క్రితం సన్నజాజి తీగలా మారిపోయింది. అదెంతలా అంటే.. సుమారు ఆరు నెలల్లో 12 కిలోల దాకా తగ్గిందట ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు తన వెయిట్‌ లాస్‌ జర్నీని సోషల్‌ మీడియా వేదికగా మనందరితో పంచుకుంది.

బిగ్‌బాస్‌తో సూపర్‌ క్రేజ్‌

సంప్రదాయ సిక్కు కుటుంబానికి చెందిన షెహ్‌నాజ్‌ చిన్నప్పుడే నటి కావాలనుకుందట. అందుకే యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా పాడడం నేర్చుకుంది.  మొదట మోడల్‌గా కెరీర్‌ ఆరంభించింది. వరుసగా మ్యూజిక్‌ ఆల్బమ్‌లు, వీడియోలు చేసింది. ఇదే పాపులారిటీతో బాలీవుడ్‌ బుల్లితెరపై అడుగుపెట్టింది. కొన్ని పంజాబీ సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అయితే బిగ్‌బాస్‌-13 సీజన్‌తో తన క్రేజ్‌ను అమాంతం పెంచేసుకుంది షెహ్‌నాజ్‌. ఈ రియాలిటీ షోలో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచి హిందీ సినీ ప్రియులకు మరింత చేరువైంది. ప్రస్తుతం ఆమె ప్రముఖ హిందీ నటులు సోనమ్‌ బాజ్వా, దిల్జీత్ దొసాంజ్‌లతో కలిసి ‘హోన్‌స్లా రఖ్‌’ అనే సినిమాలో నటిస్తోంది.

బొద్దుగా కనిపించడమంటేనే ఇష్టం!

ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ డాబూ రత్నానీతో కలిసి ఆమె నిర్వహించిన ఫొటోషూట్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా యూట్యూబ్‌ ద్వారా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆమె తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఒక అభిమాని ‘మీరు ఇప్పటి కంటే బిగ్‌బాస్‌-13 లోనే అందంగా  ఉన్నారు’ అని చెప్పగా...‘మీ ప్రేమకు ధన్యవాదాలు. అప్పుడూ నేనే.. ఇప్పుడూ నేనే.. అయితే మరింత అందంగా కనిపించాలని కోరుకున్నాను. ఇప్పటికీ ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఈ క్రమంలోనే ఇలా నాజూగ్గా మారుతున్నా. మీరు మళ్లీ తిరిగి నన్ను బొద్దుగా చూడాలని కోరుకుంటే...ఏ క్షణంలోనైనా నన్ను నేను లావుగా మార్చుకోగలను. అదేమంత పెద్ద కష్టం కాదు. ఇప్పుడు తింటున్న దానికంటే కొంచెం ఎక్కువ తింటే సరిపోతుంది.. మీరన్నట్లుగా బొద్దుగా కనిపించడమంటేనే నాకూ ఇష్టం’.

జిమ్‌కి వెళ్లను!

‘అయితే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే మాత్రం మన లుక్‌ను మార్చుకోవాల్సిందే. అక్కడ నాజూగ్గా, సన్నజాజి తీగలా ఉన్న అమ్మాయిలకే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఇక అధిక బరువును తగ్గించుకోవడానికి నేనేమీ పెద్ద పెద్ద వ్యాయామాలు చేయలేదు. జిమ్‌కు వెళ్లడం నాకేమాత్రం ఇష్టం ఉండదు. అందుకే ఆహారపుటలవాట్లలో కొన్ని మార్పులు చేసుకున్నా. బరువు తగ్గాలంటే చక్కెర, ఉప్పుకు దూరంగా ఉండాలని నా వ్యక్తిగత సహాయ సిబ్బంది తరచూ నాతో చెబుతుండేవారు. అయితే మనం ఎంత పరిమాణంలో ఆహారం తీసుకుంటున్నామన్న దానిపైనే మన బరువు, ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నేను ఇదే చిట్కా ఫాలో అయ్యాను. మీరు కూడా అధిక బరువును తగ్గించుకోవాలంటే నాలాగే తక్కువగా తినడం అలవాటు చేసుకోండి.’

ఇదే నా డైట్‌ ప్లాన్‌..!

‘ఇక నా డైట్‌ ప్లాన్‌ విషయానికొస్తే..

* ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో మూంగ్‌ సలాడ్‌ (పెసళ్లతో చేసిన సలాడ్‌), టీ తీసుకుంటా.

* మధ్యాహ్నం లంచ్‌లోకి అన్నం, పప్పుతో పాటు సబ్జీ (కాయగూరలన్నీ కలిపి తయారుచేసే కూర) తీసుకుంటాను.

* ఇక రాత్రికి పాలు మాత్రమే తాగుతాను.

* మాంసం, చాక్లెట్స్‌, ఐస్‌క్రీమ్స్‌.. వంటివి నా మెనూలో నుంచి పూర్తిగా తొలగించా. నటిగా రాణించాలనేది నా చిన్ననాటి కోరిక. అందుకోసమే కొన్నేళ్లుగా కష్టపడుతున్నాను. అందుకు ప్రతిఫలమే ఈ లుక్‌. అయితే కోరుకున్న పేరు ప్రతిష్ఠలు, డబ్బు వచ్చాయి కదా.. అని ఇక్కడితో ఆగిపోలేను. నేను కోరుకున్న దారిలో అత్యుత్తమంగా నన్ను చూడాలనుకుంటున్నాను. అందుకోసం కష్టపడుతూనే ఉంటాను’ అని చెబుతోందీ అందాల తార.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్