మహిళలు పుట్టుకతోనే సమర్థులు.. సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి మన సొంతం!

మహిళలు ‘ఆకాశంలో సగభాగం’ అని చెప్పుకొంటున్నా వారికి సమాన అవకాశాలు దక్కడంలో మాత్రం ఇంకా వెనకబడే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ కంపెనీల్లో కేవలం 4 శాతానికి మాత్రమే స్త్రీలు సీఈవోలుగా ఉండడమే ఇందుకు ఉదాహరణ. చాలామంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి కృషి చేస్తున్నా వివిధ కారణాలతో మధ్యలోనే తమ ప్రయత్నాన్ని విరమిస్తున్నారు.

Updated : 02 Feb 2022 20:35 IST

మహిళలు ‘ఆకాశంలో సగభాగం’ అని చెప్పుకొంటున్నా వారికి సమాన అవకాశాలు దక్కడంలో మాత్రం ఇంకా వెనకబడే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ కంపెనీల్లో కేవలం 4 శాతానికి మాత్రమే స్త్రీలు సీఈవోలుగా ఉండడమే ఇందుకు ఉదాహరణ. చాలామంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి కృషి చేస్తున్నా వివిధ కారణాలతో మధ్యలోనే తమ ప్రయత్నాన్ని విరమిస్తున్నారు. ఈ క్రమంలో - ఇలాంటివారికి స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ‘మహిళా సాధికారత శక్తి’ అనే అంశంపై ఓ వెబినార్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజాకిరణ్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ క్రమంలో మహిళలు పుట్టుకతోనే సమర్థులని, నిర్ణయాత్మక శక్తిని సైతం కలిగి ఉంటారని చెప్తూ మహిళలు వివిధ రంగాల్లో రాణించడానికి అవసరమైన వివిధ సూచనలు అందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- ‘సాధికారత వల్ల మహిళలు, వారికి వారుగా సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వారిని వారు మరింత మెరుగుపరుచుకోగలుగుతారు. వారికి వారు చైతన్యవంతులు కావడంతో పాటు వారి కుటుంబాన్ని, సమాజాన్ని చైతన్యవంతం చేయగలుగుతారు. ఇది వారి సామాజిక హక్కు’ అని తెలిపారు.

బహుముఖ సామర్థ్యం!

మహిళలు నిస్వార్థ గుణంతో తమ భవిష్యత్తును త్యాగం చేస్తూ కుటుంబానికి అంకితమవుతున్నారని ఆమె తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ కంపెనీల్లో కేవలం 4 శాతానికి మాత్రమే స్త్రీలు సీఈవోలుగా ఉన్నారని ఆమె చెప్పారు. చాలామందికి నైపుణ్యాలున్నా.. కెరీర్‌ కంటే కుటుంబానికి ప్రాముఖ్యం ఇవ్వడం, కుటుంబం నుంచి తగిన సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఇలా జరుగుతోందని ఆమె చెప్పారు. 10 శాతం కంటే తక్కువ దేశాల్లో మహిళలు దేశాధినేతలుగా ఉన్నారని పేర్కొన్నారు. మహిళలకు సహజంగానే బహుముఖ సామర్థ్యం ఉంటుందని, దానివల్ల వ్యాపార, వాణిజ్య రంగాల్లో తప్పక రాణిస్తారని తెలిపారు. నిర్వహణ సామర్థ్యం, సంక్షోభ సమయాలను దీటుగా ఎదుర్కొనే శక్తి వారి సొంతమన్నారు. స్వతంత్ర భావాలు కలిగేందుకు, విచక్షణ జ్ఞానాన్ని పెంచేందుకు విద్య తోడ్పడుతుందని పేర్కొన్నారు.

ఆత్మవిశ్వాసమే తొలి మెట్టు!

‘మనకు మనం సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలంటే దానికి ఉత్తమమైన మార్గం విద్యను అందించడం. ప్రతి ఒక్కరూ గ్రామాలు, పట్టణాల్లోని పిల్లలకు విద్యను అందించడంతో పాటు దిగువ తరగతులకు చెందిన ఆడపిల్లలకు విద్యావకాశాలు కల్పించాలి. ఈ క్రమంలో వారిలో ఉండే భయాందోళనలను తొలగించాలి’ అని ఆమె పేర్కొన్నారు. చేపట్టబోయే వాణిజ్య, వ్యాపారాలకు సంబంధించిన సృజన నైపుణ్యాలనూ అభ్యసించాలని సూచించారు. పిల్లలకు విద్యను అందించడం, వారికోసం సంపద సృష్టించడమే కాకుండా జీవన నైపుణ్యాలను పెంపొందించాలని, సవాళ్లను ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దాలని తల్లిదండ్రులను కోరారు. మహిళలు.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడమే విజయానికి తొలి మెట్టు అని శైలజాకిరణ్‌ తెలిపారు. 1995లో మార్గదర్శి రూ.350 కోట్ల టర్నోవర్‌ సాధించగా.. మరో 15-20 ఏళ్లలో రూ.10 వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలని లక్ష్యం పెట్టుకొని క్రమంగా దాన్ని సాధించామని తెలిపారు. మార్గదర్శి సంస్థ అభివృద్ధిలో భాగంగా.. వేల మంది సిబ్బందితో లక్షల మంది వినియోగదారులతో సాగించిన వ్యాపార అనుభవాలను వివరించారు. మార్గదర్శి వంటి సంస్థలను నిర్వహించడంలో ప్రజల నమ్మకాన్ని చూరగొనడం అత్యంత ముఖ్యమని చెప్పారు.

రామోజీ ఫౌండేషన్‌ రంగారెడ్డి జిల్లాలోని నాగన్‌పల్లి, కృష్ణా జిల్లాలో పెద్దపారుపూడిలను దత్తత తీసుకొని, వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతోందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక యువతకు మంచి విద్య అందించడం సహా వారిలో నైపుణ్యాలు పెంపొందిస్తున్నట్లు వివరించారు.

తానా కల్చరల్ కో ఆర్డినేటర్‌ తూనుగుంట్ల శిరీష, తానా పూర్వ మహిళా అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల, ఏలూరి మాధురి, తానా కార్యవర్గం సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శైలజాకిరణ్ పూర్తి ప్రసంగం కోసం ఈ కింది వీడియోని చూడండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్