Updated : 15/03/2022 18:44 IST

Radhe Shyam: వింటేజ్ కాస్ట్యూమ్స్‌తో అదరగొట్టింది!

(Photo: Instagram)

‘సినిమాలో ఒక పాత్రకు ప్రాణం పోయాలంటే నటనతో పాటు.. పాత్రకు తగినట్లుగా నటీనటుల కోసం ఎంచుకునే కాస్ట్యూమ్స్‌ కూడా కీలక పాత్ర పోషిస్తాయం’టున్నారు ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఎకా లఖానీ. చరిత్రాత్మక కథల్లో, అదీ పాశ్చాత్య వింటేజ్‌ స్టైల్స్‌తో భారతీయ సినిమాకు హంగులద్దడంలో ఆమె దిట్ట! ఇందుకు తాజా ఉదాహరణే.. ‘రాధే శ్యామ్‌’ సినిమాతో తెరపై ఆమె చేసిన ఫ్యాషన్‌ గారడీ! ఇందులోని పాత్రలకు తగినట్లుగా యూరోపియన్‌ వింటేజ్‌ స్టైల్స్‌ జోడించి ఆమె రూపొందించిన దుస్తులు.. మేటి డిజైనర్లనే కాదు.. సామాన్య ప్రేక్షకుల్నీ ఎంతగానో మెప్పించాయి. ‘వావ్‌.. వాట్‌ ఎ క్రియేషన్‌’ అనేలా చేశాయి. ఈ నేపథ్యంలో.. అవకాశమొచ్చినప్పుడల్లా పాశ్చాత్య వింటేజ్ స్టైల్స్‌ని భారతీయ సినిమాకు జోడిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోన్న ఈ కాస్ట్యూమ్‌ క్వీన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ఏ రంగంలోనైనా మనదైన ప్రత్యేకతను చాటుకోవాలంటే సృజనే ముఖ్యం. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలోనే సినిమాల్లో నటీనటుల పాత్రలకు తనదైన కాస్ట్యూమ్స్‌తో ప్రాణం పోస్తున్నారు ముంబయి డిజైనర్‌, స్టైలిస్ట్‌ ఎకా లఖానీ. తాజాగా రాధే శ్యామ్‌ సినిమాతో మరోసారి తన మార్క్‌ను ప్రదర్శించారు. మరో డిజైనర్‌ తోట విజయభాస్కర్‌తో కలిసి ఈ చిత్రం కోసం పనిచేశారామె.

బాలనటిగా ఎంట్రీ!

చిన్న వయసులోనే బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు లఖానీ. ‘అభయ్‌-ది ఫియర్‌లెస్‌’ అనే సినిమాలో నటించారు. 1994లో 42వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా ఈ సినిమా ‘ఉత్తమ పిల్లల చిత్రం’గా అవార్డు గెలుచుకుంది. ఆపై మరో రెండు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి మెప్పించిన ఆమె.. ఆ తర్వాత తన పూర్తి దృష్టిని చదువు పైకి మళ్లించారు. చిన్న వయసు నుంచే సృజనాత్మక వాతావరణంలో పెరిగారు లఖానీ. ఆమె తండ్రి వృత్తి రీత్యా టెక్స్‌టైల్‌ డిజైనర్‌ కావడంతో వాళ్లకంటూ సొంతంగా ఓ బ్లాక్‌ ప్రింటింగ్‌ యూనిట్‌ ఉండేది. దీన్ని ఉపయోగించి కొత్త కొత్త రంగులు రూపొందించడం, వాటిని దుస్తులపై ముద్రించడం.. వంటి పనులన్నీ తన తండ్రి చేస్తుంటే ఆసక్తిగా గమనించిన ఆమెకు.. ఫ్యాషన్‌ అంటే క్రమంగా మక్కువ పెరిగింది. దీంతో అప్పటిదాకా డాక్టర్‌ కావాలనుకున్న లఖానీ.. తన తండ్రి ఈ దిశగా ప్రోత్సహించడంతో ఫ్యాషన్ వైపు వడివడిగా అడుగులు వేసింది.

ఫ్యాషన్‌పై మక్కువతో 18 కోర్సులు!

అయితే ఫ్యాషన్‌పై మక్కువతో ముంబయిలోని ఓ కళాశాలలో Apparel Manufacture and Design విభాగంలో మూడేళ్ల పాటు డిప్లొమా కోర్సు చేసింది లఖానీ. ఇదే సమయంలో L'Officiel పత్రికలో ఇంటర్న్‌గానూ పనిచేసింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన ఓ ఫ్యాషన్‌ ప్రాజెక్ట్‌కి ‘బెస్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డిజైన్‌’, ‘బెస్ట్‌ కలెక్షన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’.. వంటి పురస్కారాలు దక్కాయి. ఆపై ఫ్యాషన్‌లోనే విభిన్న విభాగాల్లో సర్టిఫికేషన్‌ కోర్సులు చేయడానికి న్యూయార్క్‌ వెళ్లిందామె. ఇలా ఐదేళ్ల పాటు అక్కడే గడిపిన ఆమె.. 17-18 షార్ట్‌ టర్మ్‌ కోర్సులు పూర్తిచేసింది. ఇక ఇండియాకు తిరిగొచ్చాక మణిరత్నం దర్శకత్వం వహించిన ‘రావణ్‌’ సినిమాలో తొలిసారి ఆమెకు అవకాశమొచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఈ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన సబ్యసాచి ముఖర్జీ దగ్గర అసిస్టెంట్‌ డిజైనర్‌గా పనిచేసింది లఖానీ.

‘వింటేజ్‌ క్వీన్‌’గా ఎదిగింది!

‘రావణ్‌’ సినిమాతో తన కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ నైపుణ్యాలను మరింతగా పెంచుకున్న లఖానీ.. ‘ఉరుమి’ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేసింది. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయించిన చారిత్రక కథ ఇది! ఈ కథకు తగ్గట్లే సినిమాలోని నటీనటులకు కాస్ట్యూమ్స్‌ని డిజైన్‌ చేశారు లఖానీ. నాటి కాలపు భారతీయ డిజైన్లతో పాటు పోర్చుగీసు వారి ఆహార్యాన్ని అవపోసన పట్టి.. ఆనాటి వింటేజ్‌ లుక్స్‌ని తీర్చిదిద్దారామె. ఇక ఇటీవలే విడుదలైన ‘రాధే శ్యామ్‌’ సినిమాతో యూరోపియన్‌ వింటేజ్‌ స్టైల్స్‌తో భారతీయ సినిమాకు వన్నెలద్దారు. ఇందులో పూజా హెగ్డే ధరించిన భారతీయ, మోడ్రస్‌ దుస్తుల్లో ఆమె మార్క్‌ ప్రస్ఫుటమైందంటున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు.

తన పన్నెండేళ్ల కెరీర్‌లో.. ‘సంజూ’, ‘ది స్కై ఈజ్‌ పింక్‌’, ‘ఎన్‌హెచ్‌ 10’, ‘ఓకే జానూ’, ‘24’.. వంటి ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్స్‌ అందించిన లఖానీ.. ఆయా సినిమాల్లో పాత్రను బట్టి దుస్తులకు భారతీయ సంప్రదాయ వన్నెలద్దారు . తన కెరీర్‌లో మణిరత్నం, రాజ్ కుమార్ హిరానీ, కరణ్‌ జోహర్.. ఈ ముగ్గురు దర్శకులతో పనిచేయాలని కోరుకున్నానని.. ఆయా సినిమాలతో ఈ కల నెరవేరిందని చెబుతున్నారామె. ఇలా కేవలం సినిమాలకే కాదు.. వ్యక్తిగతంగా హీరో హీరోయిన్లకు, పెళ్లిళ్లు-ఇతర శుభకార్యాలకూ దుస్తుల్ని రూపొందిస్తుంటారు లఖానీ. తన కృషికి గుర్తింపుగా పలు అవార్డులు-రివార్డులూ అందుకున్నారామె.

వాటిని రీసైక్లింగ్‌ చేయాల్సిందే!

సాధారణంగా ఒక సినిమాలో వాడిన దుస్తులు మరో సినిమా కోసం వాడరు చాలామంది కాస్ట్యూమ్‌ డిజైనర్లు. అయితే తాను మాత్రం ఈ దుస్తుల్ని రీసైకిల్‌ చేయడం, లేదా తిరిగి ఉపయోగించే పద్ధతిని ప్రాచుర్యంలోకి తేవాలనుకుంటున్నానని చెబుతున్నారు లఖానీ. తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించచ్చంటున్నారు.

‘నేను దుస్తుల సంఖ్య కంటే దుస్తుల నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తా. ఎన్ని ఎక్కువ కాస్ట్యూమ్స్‌ రూపొందించానన్న దాని కంటే ఒకే కాస్ట్యూమ్‌ అయినా అది ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచి పోవాలనేది నా ఆకాంక్ష. అలాగే ప్రస్తుతం చాలామంది కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నారు. అలాంటి వారికి యూనివర్సిటీల్లోనే సినిమా కోణంలో నుంచి ఫ్యాషన్‌ సబ్జెక్టును బోధించాలి.. ఆ దిశగానే సాధన చేయించాలి.. తద్వారా వారికి కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌పై మరింత పట్టు పెరుగుతుంది..’ అంటారు లఖానీ. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే సినిమా కోసం పనిచేస్తున్నారామె. చారిత్రక కాల్పనిక కథ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే విడుదలైన ఐశ్వర్యారాయ్‌, త్రిష లుక్స్‌ ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే!

ప్రేరణ పాత్రలోకి అలా..!

పాత్రకు తగ్గ కాస్ట్యూమ్స్‌ ఉంటేనే అందులో పూర్తిగా ఒదిగిపోవచ్చని ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది అందాల తార పూజా హెగ్డే. ‘రాధే శ్యామ్‌’ కోసం లఖానీతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతి అని.. తాను రూపొందించిన దుస్తులే తాను ప్రేరణ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు ప్రేరేపించాయంటోంది.

‘ఇప్పటికే మన దేశంలో చరిత్రాత్మక చిత్రాలెన్నో రూపొందాయి. అయితే రాధే శ్యామ్‌ ఇందుకు భిన్నం. ఎందుకంటే ఈ చిత్రం ఇటలీలో చిత్రీకరించారు. ఆ దేశ సంప్రదాయాలకు తగినట్లుగానే యూరోపియన్‌ స్టైల్‌ కాస్ట్యూమ్స్‌ని రూపొందించారు. నిజానికి లఖానీ డిజైన్‌ చేసిన ఈ దుస్తులు ధరించగానే ఏదో యూనిఫాం వేసుకున్న ఫీలింగ్‌ కలిగేది. ఈ భావనే నన్ను ప్రేరణ పాత్రలో పూర్తిగా లీనమయ్యేలా చేసింది..’ అంటూ చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ఇక ఇందులో తాను ధరించిన మర్మెయిడ్‌ డ్రస్‌, ఫ్లోరల్‌ అవుట్‌ఫిట్స్‌, హెడ్‌ స్కార్ఫ్స్‌, నీ-లెంత్‌ స్కర్ట్స్‌.. వంటి ఫ్యాషన్స్‌ ఆమె అందానికి వింటేజ్‌ హంగులద్దాయని చెప్పచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని