First Women : అంబులెన్స్‌ తోలేస్తున్నారు!

సాధారణంగా ఏ అంబులెన్స్‌ చూసినా మగవాళ్లే డ్రైవర్లుగా ఉండడం చూస్తుంటాం. ఎందుకంటే అంత చాకచక్యంగా, వేగంగా వాహనం నడిపే ఓర్పు, నేర్పు పురుషులకే ఉంటుందనేది చాలామంది అభిప్రాయం. కానీ ఈ మూసధోరణిని బద్దలు కొట్టి ఆడవాళ్లూ అందుకు సమర్థులే అని నిరూపించింది హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల నాన్సీ కట్నోరియా.

Published : 05 Feb 2022 17:24 IST

సాధారణంగా ఏ అంబులెన్స్‌ చూసినా మగవాళ్లే డ్రైవర్లుగా ఉండడం చూస్తుంటాం. ఎందుకంటే అంత చాకచక్యంగా, వేగంగా వాహనం నడిపే ఓర్పు, నేర్పు పురుషులకే ఉంటుందనేది చాలామంది అభిప్రాయం. కానీ ఈ మూసధోరణిని బద్దలు కొట్టి ఆడవాళ్లూ అందుకు సమర్థులే అని నిరూపించింది హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల నాన్సీ కట్నోరియా. చిన్నతనం నుంచీ డ్రైవింగ్‌ అంటే ఇష్టపడే ఆమె.. ఏకంగా ఆ రాష్ట్ర తొలి మహిళా అంబులెన్స్‌ డ్రైవర్‌గా ఈ మధ్యే విధుల్లో చేరింది. దీంతో తమిళనాడుకు చెందిన వీరలక్ష్మి తర్వాత దేశంలోనే రెండో మహిళా అంబులెన్స్‌ డ్రైవర్‌గా ఘనత సాధించింది నాన్సీ.

హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌లో పుట్టిపెరిగింది నాన్సీ కట్నోరియా. చిన్న వయసు నుంచే డ్రైవింగ్‌ నేర్చుకోవాలన్న పట్టుదల పెంచుకుందామె. అంతేకాదు.. సమాజానికి తన వంతుగా సేవ చేయాలన్న ఆలోచనా తన మనసులో నాటుకుపోయింది. అయితే ఈ రెండు కలల్ని నెరవేర్చుకోవడానికి హిమాచల్‌ రోడ్డు రవాణా సంస్థ (HRTC) డ్రైవింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకుంది నాన్సీ.


కల నెరవేరిన వేళ..!

ఇటీవలే రెండు నెలల శిక్షణ పూర్తిచేసుకున్న ఆమెను అక్కడి నుర్‌పుర్‌ సివిల్‌ ఆస్పత్రిలో 102 అంబులెన్స్‌ సర్వీస్‌ డ్రైవర్‌గా నియమించారు. దీంతో ఈ మధ్యే విధుల్లో చేరిన ఆమె.. తన ఆశయం నెరవేరిందంటూ సంబరపడిపోతోంది. ‘102 అత్యవసర అంబులెన్స్‌ సర్వీస్‌ డ్రైవర్‌గా విధుల్లో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సమాజానికి సేవ చేయాలన్నది నా ఆశయం. అది కూడా నాకెంతో ఇష్టమైన డ్రైవింగ్‌ విభాగంలో అంటే మరింత ఆనందంగా ఉంది. చిన్నప్పట్నుంచి డ్రైవింగ్‌పై నాకున్న మక్కువను చూసి అమ్మానాన్నలు ఈ దిశగా నన్ను ప్రోత్సహించారు. నాకో ద్విచక్రవాహనం కూడా కొనిచ్చారు. దానిపైనే ఊరంతా చక్కర్లు కొట్టేదాన్ని. అయితే కొంతమంది గిట్టని వాళ్లు మాత్రం నేను ఎంచుకున్న మార్గాన్ని తప్పు పడుతున్నారు. కానీ నేను మాత్రం నా మనసు చెప్పిందే వింటా.. నా విధులు నేను సక్రమంగా నిర్వర్తిస్తా..’ అంటోంది నాన్సీ.


క్యాబ్‌ నుంచి అంబులెన్స్‌ దాకా..!

పురుషులు పాగా వేసిన ఎన్నో రంగాల్లోకి మహిళలు ప్రవేశించడం, గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలు కొట్టడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. తమిళనాడుకు చెందిన వీరలక్ష్మి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 2020లో తమిళనాడు ప్రభుత్వం కొత్తగా కొన్ని 108 అంబులెన్స్‌ వాహనాల్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే మహిళా సాధికారతను ప్రోత్సహించే ఉద్దేశంతో వీరలక్ష్మి అనే మహిళను 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా నియమించింది. దీంతో దేశంలోనే తొలి మహిళా అంబులెన్స్‌ డ్రైవర్‌గా నిలిచిందామె.

‘నాకు క్యాబ్‌ డ్రైవర్‌గా పూర్వానుభవం ఉంది. ఈ క్రమంలోనే అంబులెన్స్ డ్రైవర్‌ పోస్ట్‌ కోసం అప్లై చేశా. ఇంటర్వ్యూలో అర్హత సాధించా. అయితే ఈ రంగంలో నేనే తొలి మహిళను అన్న విషయం ఆ తర్వాతే నాకు తెలిసింది. ఒక అంబులెన్స్‌ డ్రైవర్‌గా రోడ్డుపై వేగంగా వాహనం నడపడానికి భయపడను. ఈ వృత్తిలో సమాజానికి నా వంతుగా సహాయం చేస్తున్నానన్న సంతృప్తి నాకు దక్కుతుంది..’ అంటుంది వీరలక్ష్మి. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించిందామె. ఇలా తన వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా ఇద్దరు పిల్లల తల్లిగా వారి ఆలనా పాలనకు, ఇంటి బాధ్యతలకూ తగిన సమయం కేటాయిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్