ఆ 9 నెలలు పని చేయాలనుకుంటున్నారా?

గర్భం ధరించామని తెలిసినప్పట్నుంచి సున్నితంగా మారిపోతుంటారు మహిళలు. ఈ క్రమంలో చిన్న చిన్న పనులు చేసుకోవడానికీ భయపడిపోతుంటారు. కారణం.. తాము చేసే పనుల వల్ల తమ కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమోనని! అయితే కొంతమంది మాత్రం నెలలు...

Published : 07 Nov 2022 18:32 IST

గర్భం ధరించామని తెలిసినప్పట్నుంచి సున్నితంగా మారిపోతుంటారు మహిళలు. ఈ క్రమంలో చిన్న చిన్న పనులు చేసుకోవడానికీ భయపడిపోతుంటారు. కారణం.. తాము చేసే పనుల వల్ల తమ కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమోనని! అయితే కొంతమంది మాత్రం నెలలు నిండుతున్న కొద్దీ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంటారు. రోజువారీ కూలీ పనులు చేసే మహిళల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా ఎంతోమంది నిండు గర్భంతోనే తమ తమ పనుల్లో కొనసాగడం మనం చూస్తూనే ఉంటాం. నిజానికి గర్భం ధరించినా ఇలా యాక్టివ్‌గా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు. ఆరోగ్యం సహకరిస్తే గనుక డాక్టర్‌ సలహా మేరకు ప్రసవం సమీపించే దాకా తమ తమ పనుల్లో కొనసాగచ్చంటున్నారు. పైగా ఇలా తల్లి చురుగ్గా పనిచేయడం వల్ల అటు పుట్టబోయే పిల్లలు కూడా చురుగ్గా ఉంటారట! అలాగని పని పైనే పూర్తి ధ్యాస పెడుతూ కాబోయే తల్లులు ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకూడదని, తమ తమ విధుల్లో కొనసాగే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

⚛ కొన్ని ఉద్యోగాల్లో రోజంతా కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయాల్సి రావచ్చు.. మరికొన్ని వృత్తుల్లో ఎక్కువ సమయం నిల్చొనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే గర్భిణిగా ఇలా ఎక్కువసేపు నిల్చున్నా/కూర్చున్నా ఇబ్బందే! కాబట్టి మీ పనిని బట్టి నిర్ణీత వ్యవధుల్లో నిలబడుతూ, కూర్చుంటూ, అటూ ఇటూ తిరుగుతూ, విరామం తీసుకుంటూ ఉండాలి. తద్వారా శరీరంపై పని భారం పడకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ కూర్చున్నా, నిల్చున్నా శరీర భంగిమను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా పొట్టపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో కాస్త ఎక్కువ సమయం నిల్చోవాల్సి వచ్చినా.. రెండు కాళ్లను మరీ దగ్గరగా కాకుండా కాస్త దూరంగా ఉంచడం, అలాగే ఒక కాలిని ముందు మెట్టుపై లేదంటే ఒక చిన్న స్టూల్‌పై ఉంచేలా చూసుకోండి. తద్వారా మీ శరీర బరువు లోయర్‌ బ్యాక్‌పై పడకుండా ఉంటుంది.

⚛ పనిలో పడిపోయి భోజనం చేయడం మర్చిపోకూడదు. డాక్టర్‌ సూచన మేరకు సరైన పోషకాహారం తీసుకోవడంతో పాటు తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినేలా ప్లాన్‌ చేసుకోవాలి. అలాగే మధ్యమధ్యలో తినడానికి పండ్ల ముక్కలు, నట్స్‌, సలాడ్స్‌.. వంటివి మంచి ప్రత్యామ్నాయాలు!

⚛ మీ బరువును బట్టి తగినన్ని నీళ్లు తాగడం, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ ఇక కూర్చున్నప్పుడు కూడా పాదాల్ని నేలకు ఆనించడం కాకుండా.. ఫుట్‌రెస్ట్‌ (చిన్న స్టూల్ లాంటిది)పై ఉంచే ఏర్పాటు చేసుకోండి. తద్వారా పాదాల్లో వాపు రాకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ ఆహారపు కోరికల పేరుతో బయటి ఆహారం తినడం అస్సలు మంచిది కాదు.. ఎప్పుడైనా సరే ఇంటి ఆహారమే శ్రేయోదాయకం అనే విషయం మర్చిపోవద్దు.

⚛ ఇంటి నుంచి పనిచేసినా, ఆఫీసుకు వెళ్లినా మీపై అధిక పని ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ఈ క్రమంలో వేళకు పనులన్నీ పూర్తయ్యేలా ఉదయమే చక్కటి ప్రణాళిక వేసుకుంటే సాయంత్రానికల్లా పనులన్నీ చకచకా పూర్తవుతాయి. తిరిగి త్వరగా ఇంటికి చేరుకోవచ్చు.

⚛ మీ ఆఫీస్‌ లేదా పని ప్రదేశం మీ ఇంటి నుంచి దూరంగా ఉన్నట్లయితే మీరు అంత దూరం వెళ్లగలరో లేదో ముందే ఆలోచించుకోండి. ఈ క్రమంలో మీ గైనకాలజిస్ట్‌ సలహా తీసుకోవడం తప్పనిసరి. ఒకవేళ అంత దూరం వెళ్లే వీల్లేకపోతే ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు ఉంటే దాన్ని వినియోగించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్