Aarya Vora: ప్రాణాలకు తెగించి ప్రి-వెడ్డింగ్‌ షూట్‌.. ఎవరీ ఆర్య?

పెళ్లికి ముందు ఫొటోషూట్స్‌ తీయించుకోవడం, వాటిని జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మలచుకోవడం ఈతరం జంటలకు కొత్త కాదు. అయితే ఈ క్రమంలో కొన్ని జంటలు సాహసాలు చేసేందుకూ వెనకాడట్లేదు. తాజాగా ఓ జంట చేసిన అలాంటి సాహసమే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated : 22 Mar 2024 12:43 IST

(Photos: Instagram)

పెళ్లికి ముందు ఫొటోషూట్స్‌ తీయించుకోవడం, వాటిని జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మలచుకోవడం ఈతరం జంటలకు కొత్త కాదు. అయితే ఈ క్రమంలో కొన్ని జంటలు సాహసాలు చేసేందుకూ వెనకాడట్లేదు. తాజాగా ఓ జంట చేసిన అలాంటి సాహసమే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మైనస్‌ డిగ్రీల చలిలో రొమాంటిక్‌గా నడుస్తూ ప్రి-వెడ్డింగ్‌ షూట్‌ చేయించుకోవాలనుకున్నారు ఆర్యా వోరా - రంజిత్‌ శ్రీనివాస్‌ దంపతులు. తీరా షూట్‌ ముగిశాక చలికి తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది ఆర్య. అయితే ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఫొటోషూట్‌ తీయించుకొనే సాహసం చేసిన ఈ జంట నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మరి, ఇంతకీ ఎవరీ ఆర్యా వోరా? ప్రి-వెడ్డింగ్‌ షూట్‌ కోసం ఎందుకింత సాహసం చేయాలనుకుంది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

బాలీవుడ్‌ బుల్లితెరతో అనుబంధం ఉన్న వారికి ఆర్యా వోరాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘దేవోంకే దేవ్‌ మహాదేవ్‌’ సీరియల్‌లో సిద్ధిగా ఆమె దేశవ్యాప్తంగా సుపరిచితురాలే! దీంతో పాటు ‘మై ఫ్రెండ్‌ గణేశా’ సీరియల్‌లో అదితి పాత్రలో మెరిసిందామె. అయితే ఆమెకు సాహసాలంటే భలే సరదా. ఓవైపు నటిగా కొనసాగుతూనే.. మరోవైపు తాను వెళ్లిన పర్యటక ప్రదేశాలు, చేసిన సాహసాలకు సంబంధించిన విశేషాల్ని ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఆర్య.

సాహసాలపై మక్కువతో..!

ఈ క్రమంలోనే బుల్లితెరను వదిలి పూర్తిస్థాయి ట్రావెల్‌, లైఫ్‌స్టైల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అవతారమెత్తింది ఆర్య. ఇప్పటికే 41 దేశాల్ని చుట్టేసిన ఆమె.. అక్కడి విశేషాల్ని రీల్స్‌ రూపంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది. అక్కడి బీచ్‌ల అందాల్ని, చేసిన సాహసాల్ని ఫొటోలు, వీడియోల రూపంలో తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరోవైపు తాను ట్రావెలింగ్‌లో ధరించిన దుస్తులు, యాక్సెసరీస్‌ని విక్రయించడానికి తన పేరుతో ఓ ఈ-కామర్స్‌ వేదికను కూడా ప్రారంభించిందీ ట్రావెల్‌ లవర్.

‘ప్రయాణాలంటే ఎవరికైనా ఇష్టమే! కానీ వివిధ కారణాల రీత్యా అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారి కోసం ఆయా ప్రాంతాల ప్రత్యేకతల్ని కళ్లకు కట్టినట్లు చూపించడానికి, నా కళ్లతో వారు ఆ ప్రదేశాన్ని సందర్శించిన అనుభూతిని సొంతం చేయడానికి ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాను..’ అంటోన్న ఆర్య.. సాహసాలు, వినోదం.. తదితర అంశాలపై కంటెంట్‌ను రూపొందిస్తూ డిజిటల్ క్రియేటర్‌గా పేరు తెచ్చుకుంది.

చావు అంచుల దాకా వెళ్లొచ్చింది!

తన జీవితంలోని ప్రతి దశనూ సాహసాలతో ముడిపెట్టే ఆర్య.. తన పెళ్లినీ అడ్వెంచరస్‌గా మలచుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తన ప్రి-వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌లోని స్పితి లోయలో షూట్‌ చేయించుకోవాలనుకుంది. అక్కడ ఎప్పుడూ మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అలా -22 డిగ్రీల ఉష్ణోగ్రతలో, వెస్ట్రన్‌ అవుట్‌ఫిట్స్‌లో ఇటీవలే ఫొటోషూట్‌కు సిద్ధమైందామె. రొమాంటిక్‌గా తన ఇష్టసఖుడి చేతిలో చెయ్యేసి, స్లో మోషన్‌లో నడుస్తూ షూట్‌ చేయించుకోవాలనుకుంది ఆర్య. అయితే అనుకున్నట్లుగానే షూట్‌ పూర్తయినా.. ఆ తర్వాతే స్పృహ తప్పిపోయినంత పనిచేసిందామె. ఇందుకు కారణం.. గడ్డకట్టించే చలిలో వెచ్చదనాన్ని పంచే దుస్తులు ధరించకపోవడంతో హైపోథెర్మియా (శరీరంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం) బారిన పడింది ఆర్య. అయితే ఆ తర్వాత తేరుకొన్న ఆమె.. తానెదుర్కొన్న ప్రతికూల పరిస్థితులపై ఇన్‌స్టా వేదికగా స్పందించింది.

‘షూట్‌ పూర్తయ్యేసరికి నేను హైపోథెర్మియా బారిన పడ్డా. నాపై ఎవరో యాసిడ్‌ పోస్తున్నట్లు అనిపించింది. ఆ బాధను తట్టుకోలేకపోయా. దాదాపు చావు అంచుల దాకా వెళ్లాను. అదృష్టవశాత్తూ.. నాకు కాబోయే భర్త రాన్‌, నా స్నేహితుల సహాయంతో బయటపడ్డా..’ అంటూ తన అనుభవాల్ని గుదిగుచ్చింది ఆర్య.

పెళ్లీ అక్కడే!

అయితే ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు అదే స్పితి లోయలో -20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రదేశంలోనే ఈ జంట వివాహం చేసుకోవడం మరో విశేషం. నిజానికి ఇలా తమ ప్రి-వెడ్డింగ్‌ ఫొటోషూట్‌, పెళ్లి కోసమే ఇక్కడికి వచ్చామని చెబుతోంది ఆర్య.

‘సముద్ర మట్టానికి 12,500 అడుగుల ఎత్తులో ఉంది స్పితి లోయ. మంచు దుప్పటి కప్పుకున్న ఈ ప్రదేశంలో ఫొటోషూట్‌ అయినా, పెళ్లైనా జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతుల్ని పంచుతుంది. అందుకే సాహసమని తెలిసినా ఇక్కడే పెళ్లి చేసుకోవాలనుకున్నాం.. ఈ క్రమంలోనే ముంబయి నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌కు రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నాం.. దాదాపు 1200 కిలోమీటర్లు ప్రయాణించాం.. మా ఈ ప్రయాణం ‘అతి పొడవైన రోడ్‌ ట్రిప్‌ వివాహ యాత్ర’గా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది..’ అంటూ తమ సాహస యాత్ర గురించి పంచుకుందీ కొత్త పెళ్లి కూతురు.

ఇంత సాహసం.. అవసరమా?!

ఇలా తమ 13 ఏళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకున్నారు ఆర్య-రంజిత్‌. అయితే ఈ క్రమంలో వీళ్లు చేసిన ప్రి-వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ సాహసానికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆర్య చేసిన సాహసానికి మద్దతుగా నిలిస్తే.. మరికొందరు.. సోషల్‌ మీడియాలో పేరు కోసం ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదంటూ విమర్శిస్తున్నారు. సాహసాలు చేయడమంటే ఎంత మక్కువ ఉన్నా.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి సాహస కృత్యాలకు పాల్పడడం వెర్రితనమే అవుతుంది.. అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. మరి, ఆర్య చేసిన పనిపై మీ స్పందనేంటి?





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్