Office Tips: మూడ్‌ బాగోలేదా? అయితే ఇలా చేయండి!

మనసు పెట్టి పని చేస్తేనే అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిగతంగా ఎదగగలం. అయితే ప్రతిరోజూ మూడ్‌ ఒకేలా ఉండచ్చు..

Updated : 25 Apr 2022 20:18 IST

మనసు పెట్టి పని చేస్తేనే అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిగతంగా ఎదగగలం. అయితే ప్రతిరోజూ మూడ్‌ ఒకేలా ఉండచ్చు.. ఉండకపోవచ్చు. ఓసారి ఇంట్లో సమస్యలు, మరోసారి పని ఒత్తిడి.. ఇలా ఏదో ఒకరకంగా మనసుపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ఇలాంటప్పుడు రోజులా ఉత్సాహంగా పనిచేయడం కుదరదు. అయినా సరే మానసిక ఒత్తిడితోనే పనిని కొనసాగిస్తామంటే.. దాని ప్రభావం చేసే పనిపై, కెరీర్‌పై పడుతుంది. మరి, ఇలా జరగకూడదంటే.. ఆఫీస్‌లో మూడ్‌ బాగోలేనప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

దీనికీ సెలవు కావాలి!

చాలామంది ఏవైనా ఆరోగ్య సమస్యలున్నప్పుడే ఎక్కువగా సెలవులు పెడుతుంటారు. అంతేకానీ.. మూడ్‌ బాగోలేదనో, ఒత్తిడిగా ఉందనో.. సెలవు పెట్టే వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. అయితే ఇదే ఒత్తిడితో ఆఫీస్‌కి వెళ్తే.. పని చేస్తున్నప్పుడు కూడా మీకున్న సమస్యే పదే పదే గుర్తొస్తుంది. తద్వారా అటు పనిచేయలేం.. ఇటు కాస్త విశ్రాంతి తీసుకున్నట్లూ ఉండదు. కాబట్టి ఇలాంటప్పుడు ఆఫీస్‌కి ఓ రోజు సెలవు పెట్టడమే మంచిదంటున్నారు నిపుణులు. ఇక ఆ రోజు మీ సమస్యకు అసలు కారణమేంటో తెలుసుకొని.. దాన్నుంచి విముక్తి పొందే మార్గం ఆలోచించచ్చు. అలాగే మీ మనసుకు సంతోషాన్నిచ్చే పనుల పైనా దృష్టి పెడితే సరికొత్త ఉత్సాహం మీ సొంతమవుతుంది. ఇదే జోష్‌తో మరుసటి రోజు ఆఫీస్‌లో అడుగుపెట్టారంటే.. పనులన్నీ చకచకా పూర్తి చేసుకోగలుగుతారు.

‘నో’ చెప్పడంలో తప్పు లేదు!

ఉదయం ఆఫీస్‌కి సంతోషంగానే వెళ్తాం.. పనుల్నీ ఉత్సాహంగా మొదలుపెడతాం.. ఇంతలోనే సహోద్యోగి రాలేదని ఆ పని మన మీద పడడం, లేదంటే మనం అనుకున్న పని కాకుండా బాస్‌ వేరే పని అప్పగించడం.. వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అదనపు పని భారం మనపై పడుతుంది. ఆ రోజంతా ఆ ఒత్తిడితోనే గడిచిపోతుంటుంది. కాబట్టి అనవసరంగా మనసు పాడు చేసుకోకుండా.. మీరు చేయగలిగినంత పనిని మాత్రమే స్వీకరించడం మంచిది.. అదనపు పని భారం పడుతుందనిపిస్తే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పడంలో తప్పు లేదు. తద్వారా ఇటు మీ మూడ్‌ పాడవకుండా, అటు పనికి అంతరాయం కలగకుండా జాగ్రత్తపడచ్చు.

‘బ్రేక్‌’ మంచిదే!

కొన్ని సమయాల్లో అనుకోకుండా వచ్చే సమస్యలు, గత జ్ఞాపకాలు-ఆలోచనలు.. మనసును ప్రతికూల ఆలోచనల వైపు మళ్లిస్తుంటాయి. దీనివల్ల కూడా చేసే పనిపై ఏకాగ్రత నిలపలేం. ఇలాంటప్పుడు పని నుంచి కాస్త విరామం తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీతో బాగా స్నేహం చేసే మీ సహోద్యోగితో కలిసి అలా దగ్గర్లోని ఓ కాఫీ షాపుకో లేదంటే ఇద్దరూ కలిసి లంచ్‌కో వెళ్లి సరదాగా మాట్లాడుకోండి.. వీలైతే మీ మనసులో ఉన్న సమస్యలు, ప్రతికూల ఆలోచనల గురించి వారితో చెప్పండి. తద్వారా మీ మనసుకు ఊరట కలగడంతో పాటు అవతలి వ్యక్తి నుంచి సలహాలు/పరిష్కార మార్గాలూ పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీకు వీలైతే క్యాబిన్‌లోనే కాసేపు యోగా, ధ్యానం చేసినా మనసు రిలాక్సవుతుంది.

షెడ్యూల్‌ ప్రకారమే..!

ఇంటి నుంచి పని.. వినడానికి హాయిగానే ఉన్నా, చేయడానికి మాత్రం చాలామంది ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఎలాగూ ఇంటి నుంచే పని చేయడం కదా.. అన్న ఉద్దేశంతో సరైన సమయ పాలన పాటించకపోవడం, మధ్యమధ్యలో మొబైల్‌తో గడుపుతూ సమయం వృథా చేయడం.. వంటి పలు కారణాల వల్ల ఆ రోజు పని ఆలస్యమవుతుంటుంది. దీంతో షిఫ్ట్‌ పూర్తయ్యే సమయం దగ్గరపడే కొద్దీ పని భారం పెరిగిపోతుంది. దీనివల్ల కూడా మూడ్‌ దెబ్బతినే ఆస్కారం ఎక్కువ. కాబట్టి ఇంటి నుంచి పనిచేసినా, ఆఫీస్‌కి వెళ్లినా.. రోజూ ఓ షెడ్యూల్‌ వేసుకొని ఒకదాని తర్వాత మరొకటి చొప్పున పనులు పూర్తిచేయాలి. అలాగే ప్రాధాన్యం ఉన్న పనుల్ని మొదట పూర్తిచేయగలిగితే.. ఒత్తిడి ఉండదు. ఫలితంగా చురుగ్గా పనులు పూర్తి చేయగలుగుతారు. ఒకవేళ ఈరోజు సమయం లేదనుకుంటే వాటిని మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నా ఇబ్బంది ఉండదు.

ఇవి కూడా!

* నిద్ర లేకపోయినా దాని ప్రభావం మనసుపై పడుతుంది.. కాబట్టి రాత్రుళ్లు గ్యాడ్జెట్లు పక్కన పెట్టి నిద్రకు సరైన సమయం కేటాయించడం మంచిదంటున్నారు నిపుణులు.

* మనసును ఉత్సాహపరచడంలో ఆహారానిదీ కీలక పాత్రే. కాబట్టి నట్స్‌, గింజలు, డార్క్‌ చాక్లెట్‌, పులియబెట్టిన ఆహార పదార్థాలు, ఓట్స్‌, బెర్రీస్‌, అరటిపండ్లు.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

* చక్కెర, కెఫీన్‌.. వంటివి నిద్రకు అంతరాయం కలిగించడంతో పాటు ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి వీటిని వీలైనంత దూరం పెట్టడం ఉత్తమం. ముఖ్యంగా పడుకునే ముందు వీటిని అస్సలు తీసుకోకూడదంటున్నారు నిపుణులు.

* వ్యాయామానికి, మానసిక ప్రశాంతతకు చాలా దగ్గరి సంబంధం ఉందని పలు అధ్యయనాల్లో రుజువైంది. కాబట్టి రోజూ ఉదయం లేదా సాయంత్రం ఓ అరగంట పాటు ఏదైనా వ్యాయామం చేసేలా ప్లాన్‌ చేసుకోవడం మంచిది.

అయితే ఇన్ని చిట్కాలు పాటించినా కొంతమందిలో ఒత్తిడి, ఆందోళన.. వంటి మానసిక సమస్యలు ఓ పట్టాన తగ్గవు. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించడం, కౌన్సెలింగ్‌ తీసుకోవడం.. వంటివి చేస్తే కొంతవరకు ఫలితం ఉండచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్