‘ఫోన్‌ హాలిడే’ తీసుకుంటున్నారా?

ఈ రోజుల్లో మనకు ఏది కావాలన్నా మన చేయి ముందు ఫోన్‌ దగ్గరికే వెళ్తుంది. ఎక్కడికి వెళ్లినా.. ఎవరితో ఉన్నా ఫోన్‌ పక్కన లేకపోతే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. ఇలా ఇంతలా ఫోన్‌కి అలవాటు...

Published : 20 Apr 2023 15:09 IST

ఈ రోజుల్లో మనకు ఏది కావాలన్నా మన చేయి ముందు ఫోన్‌ దగ్గరికే వెళ్తుంది. ఎక్కడికి వెళ్లినా.. ఎవరితో ఉన్నా ఫోన్‌ పక్కన లేకపోతే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. ఇలా ఇంతలా ఫోన్‌కి అలవాటు పడిపోయాం. అయితే సౌకర్యం, కాలక్షేపం.. ఇలా కారణమేదైనా మొబైల్‌ని ఇలా మితిమీరి వాడడం వల్ల పలు మానసిక, శారీరక సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే ‘ఫోన్‌ హాలిడే’ తీసుకోమంటున్నారు.

క్రమంగా తగ్గించండి..!

ఏ అలవాటైనా సరే ఒక్కసారిగా మానుకోవడం కాస్త కష్టమే! స్మార్ట్‌ ఫోన్‌కు విపరీతంగా అలవాటు పడిన వారు కూడా ఒకేసారి దాన్ని మానలేరు. అందుకే క్రమంగా తగ్గించడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు ప్రస్తుతం ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఫోన్‌ చూడడం మీ అలవాటైతే.. దానిని 1 గంటకు మార్చుకోండి. కొద్దిరోజుల తర్వాత దానిని 2 గంటలకు పెంచండి. దీనివల్ల మీకు అధికంగా ఫోన్‌ను ఉపయోగించే అలవాటు క్రమంగా దూరమవుతుంది.

ఎంతసేపు వాడుతున్నారో తెలుసుకోండి..!

రోజులో మీ ఫోన్‌ను ఎంతసేపు వాడుతున్నారో గమనించుకోండి. దీనివల్ల రోజులో మీరు ఎంత సమయం ఫోన్‌పై వెచ్చిస్తున్నారో సులభంగా అర్థమవుతుంది. అంతేకాదు.. గంటలో ఎన్నిసార్లు ఫోన్‌ని వాడారు? ఎంత సమయం గడిపారు..? తదితర విషయాలను ట్రాక్‌ చేసే మొబైల్‌ యాప్స్‌ ప్లే స్టోర్‌లో చాలానే అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌ వాడకాన్ని తగ్గించుకోవడానికి ఇవీ ఉపయోగపడతాయి.

ప్రణాళిక ప్రకారం..

రోజులో ఫోన్‌ను ఎంతసేపు వాడాలి? ఏ సమయంలో వాడాలి..? మొదలైన విషయాలపై సరైన ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రతిరోజూ ఆ ప్రణాళిక ప్రకారమే ఫోన్‌ను ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు మీరు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఫోన్‌ వాడాలని నిర్ణయించుకున్నారు. 7 గంటల తర్వాత కచ్చితంగా ఫోన్‌ను పక్కన పెట్టాలి. దీనికోసం మీరు అలారం కూడా పెట్టుకోవచ్చు.

ఫోన్‌ సెట్టింగ్స్‌ను మార్చండి..!

నిర్ణీత సమయం కంటే ఎక్కువగా ఫోన్‌ని ఉపయోగించినప్పుడు ఓ అలర్ట్‌ మెసేజ్‌ వచ్చేలా మీ ఫోన్‌ సెట్టింగ్స్‌ను సెట్‌ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతున్న విషయాన్ని మీరు మర్చిపోయినా.. అదే మీకు గుర్తు చేస్తుంది.

ఫోన్‌ను దూరంగా ఉంచండి..!

మీరు ఆఫీస్‌లో ఉన్నప్పుడు.. చదువుకుంటున్నప్పడు లేదా మరో ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు.. ఫోన్‌ను సైలెంట్‌ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల మీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పనిపై పూర్తి దృష్టి పెట్టగలుగుతారు. తద్వారా ఫోన్‌ వాడకం కూడా తగ్గుతుంది.

ఫోన్‌ హాలిడే తీసుకోండి..!

వృత్తిగత, వ్యక్తిగత పనుల వల్ల వారం మొత్తం ఎలాగో ఫోన్‌ను పూర్తిగా పక్కనపెట్టడం కుదరదు. అందుకే కనీసం వారాంతాల్లోనైనా ఫోన్‌ను పూర్తిగా పక్కన పెట్టి వేరే పనులపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఈ సమయంలో మీరు మీ సన్నిహితుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని మిస్‌ అవ్వకుండా.. మీరు ఫోన్‌కు దూరంగా ఉండబోతున్నారనే విషయాన్ని ముందుగానే వారికి తెలియజేయండి. మరీ అత్యవసరమైతే తప్ప ఫోన్లో సంప్రదించద్దని ముందుగానే సూచించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్