ఈ కలర్‌ఫుల్ చపాతీలు ఆరోగ్యానికి ఎంత మంచివో!

ఈమధ్య కాలంలో చాలామంది తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, బరువు తగ్గేందుకు ఎక్కువగా చపాతీలనే తింటున్నారు. వీరితో పాటు స్థూలకాయం, మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు అన్నం బదులు చపాతీలనే తమ డైట్‌లో....

Updated : 23 Sep 2022 14:31 IST

ఈమధ్య కాలంలో చాలామంది తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, బరువు తగ్గేందుకు ఎక్కువగా చపాతీలనే తింటున్నారు. వీరితో పాటు స్థూలకాయం, మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు అన్నం బదులు చపాతీలనే తమ డైట్‌లో చేర్చుకుంటున్నారు. అయితే ఎవరికైనా ఎప్పుడూ ఒకే ఆహారాన్ని తినడం కొంచెం విసుగ్గానే ఉంటుంది. ఈ క్రమంలో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనిపించడం సహజం.

రంగు రంగుల చపాతీలు!

గోధుమ, రాగి, జొన్న, సజ్జలు... ఇలా ఏ పిండితో చేసినా చపాతీలు లేత గోధుమ రంగులోనే ఉంటాయి. అయితే ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో చపాతీలు తయారుచేయడం ఎప్పుడైనా చూశారా? అది కూడా ఎలాంటి కృత్రిమ రంగులు కలపకుండానే! అయితే ఓ సారి ట్రై చేద్దాం రండి.

కావాల్సిన పదార్థాలు

అరకప్పు- పిండి (గోధుమ, రాగి, జొన్న, సజ్జలు మొదలైనవి)

అరకప్పు - బీట్‌రూట్‌ ప్యూరీ (లేదా) పాలకూర ప్యూరీ

తయారీ విధానం

ఉడకబెట్టిన బీట్‌రూట్‌ ముక్కలు లేదా పాలకూరను మిక్సీలో వేసి ప్యూరీలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రలో చపాతీ పిండిని తీసుకుని అందులోకి బీట్‌రూట్‌ లేదా పాలకూర ప్యూరీ వేసి బాగా కలపాలి. బీట్‌రూట్‌ ప్యూరీ కలిపిన పిండి ఎరుపు రంగులోకి మారితే... పాలకూర ప్యూరీ కలిపిన పిండి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇక ఎప్పటిలాగే ఆ పిండిని చపాతీ ముద్దల్లా తయారుచేసుకుని పెనంపై కాల్చితే సరి... రంగు రంగుల చపాతీలు రడీ..! నెయ్యి వాడడం ఇబ్బంది లేదనుకునేవారు కొద్దిగా నెయ్యి వేసి కాల్చితే మహా రుచిగా ఉంటాయి. వీటిని ఏదైనా సబ్జీతో కలిపి తినవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు!

కృత్రిమ రంగులు ఉపయోగించకుండా తయారుచేసే ఈ రంగు రంగుల చపాతీలను పిల్లలు ఇష్టపడి తినే అవకాశం ఉంటుంది.

చపాతీల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీనిని ఆహారంగా చేర్చుకోవడం వల్ల మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఊబకాయం, మధుమేహం లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం.

జ్యూస్‌, సూప్‌, సలాడ్... ఇలా ఏ రూపంలో తీసుకున్నా మేలు చేస్తుంది బీట్‌రూట్‌. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.

బీట్‌రూట్లో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌, విటమిన్లు-ఎ, సి ఎదిగే పిల్లలకు బాగా తోడ్పడతాయి. వారి మెదడును చురుకుగా ఉంచి, జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.

రక్తప్రసరణ మెరుగ్గా ఉన్నప్పుడు ఎలాంటి గుండె సమస్యలు దరిచేరవు. ఈ విషయంలో బీట్‌రూట్‌కి మించింది లేదు.

ఇక పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో పాలకూర బాగా సహకరిస్తుంది.

అధిక బరువు, టైప్‌-2 డయాబెటిస్‌ను కూడా తగ్గిస్తుంది. ఎముకల్ని బలంగా ఉంచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

బీట్‌రూట్‌, పాలకూరలను ఉపయోగించి తయారుచేసే రంగురంగుల చపాతీల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నారుగా... మరి మీరు కూడా వీటిని ట్రై చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని