ఒక్క ‘అరగంట’ పక్కన పెట్టి చూడండి!

ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్‌ అరచేతిలో లేనిదే క్షణం కదలట్లేదు. పడుకున్నా, నిద్ర లేచినా.. బాత్‌రూమ్‌లో ఉన్నా, బయట ఉన్నా.. అలుపు లేకుండా మనం పనిచేస్తున్నాం.. దానికీ పని చెప్తున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే.. స్మార్ట్‌ఫోనే మన లోకంగా....

Updated : 30 Aug 2022 14:01 IST

ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్‌ అరచేతిలో లేనిదే క్షణం కదలట్లేదు. పడుకున్నా, నిద్ర లేచినా.. బాత్‌రూమ్‌లో ఉన్నా, బయట ఉన్నా.. అలుపు లేకుండా మనం పనిచేస్తున్నాం.. దానికీ పని చెప్తున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే.. స్మార్ట్‌ఫోనే మన లోకంగా మారిపోయింది. అయితే ఇంత విచ్చల విడిగా దీన్ని వాడడం వల్ల అటు ఆరోగ్యం, ఇటు అనుబంధాలు.. రెండూ దెబ్బతింటాయని చెబుతున్నారు నిపుణులు. అదే ఒక్క అరగంట దీన్ని పక్కన పెడితే మనకు ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

సృజనాత్మకత పెరుగుతుంది!

‘మన దగ్గర ఉన్న అత్యంత విలువైన ఆస్తి మన మెదడే..!’ అన్నాడో మహానుభావుడు. సాధారణంగానే మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అది ఒకేసారి ఎక్కువ పనులు చేయలేకపోవచ్చు.. కానీ అత్యంత వేగంగా ఒక పని నుంచి మరో పని మీదకు మన దృష్టిని మళ్లించే శక్తి మన మెదడు సొంతం. అయితే మనలో నిక్షిప్తమై ఉన్న ఇలాంటి సూపర్‌ కంప్యూటర్‌.. నిరంతరాయంగా స్మార్ట్‌ ఫోన్‌ను వినియోగించడం వల్ల మొద్దుబారిపోతుందంటున్నారు నిపుణులు. తద్వారా ప్రతి క్షణం మొబైలే లోకంగా గడుపుతూ కొత్త ఆలోచనలు చేయలేకపోతున్నామంటున్నారు. అందుకే రోజులో ఒక్క అరగంట సమయం మొబైల్‌ను పక్కన పెట్టి.. మన ఆలోచనల్ని ఇతర అంశాలపైకి మళ్లిస్తే.. అది మరింత చురుగ్గా మారుతుందంటున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త ఆలోచనలూ మెదడులో జనిస్తాయి. ఇదే క్రమంగా మనలో సృజనాత్మకత పెరిగేందుకు  దోహదం చేస్తుంది. తద్వారా ఎన్నో సమస్యల్ని మనకు మనమే పరిష్కరించుకోగలుగుతాం.

నిద్రకు అంతరాయం ఉండదు!

ఆరోగ్యానికి, నిద్రకు అవినాభావ సంబంధం ఉంది. రోజూ రాత్రిళ్లు కనీసం ఎనిమిది గంటలైనా నిద్రకు సమయం కేటాయిస్తేనే ఎలాంటి అనారోగ్యాల్లేకుండా ఉండచ్చు. అయితే చాలామంది రాత్రీ, పగలూ అనే తేడా లేకుండా స్మార్ట్‌ ఫోన్‌ను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట వినోదం పేరుతో దీంతో కాలక్షేపం చేస్తున్నారు. ఫలితంగా ఆలస్యంగా పడుకోవడం, ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం వల్ల నిద్ర కరువవుతోంది. దీనివల్ల మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌, యాంగ్జైటీ, స్థూలకాయం, గుండె సంబంధిత సమస్యలు.. ఇలా ఎన్నెన్నో అనారోగ్యాలు దీంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి వీటి బారిన పడకుండా ఉండాలంటే.. రాత్రి మీరు పడుకునే సమయం కంటే ఓ అరగంట ముందు స్మార్ట్‌ ఫోన్‌ను పూర్తిగా పక్కన పెట్టేయండి.. నోటిఫికేషన్లు ఆఫ్‌ చేసేయండి.. మనసులో ఏ ఆలోచన లేకుండా పడుకోండి.. హాయిగా నిద్ర పడుతుంది.. ఆరోగ్యమూ మెరుగవుతుంది.

కంటికి, మెడకు.. మంచిది!

రోజుకు అరగంటకు మించి స్మార్ట్‌ ఫోన్‌ వాడడం వల్ల.. పదేళ్లలో మెదడు సంబంధిత సమస్యల బారిన పడే ముప్పు అధికంగా ఉంటుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. ఇదే కాదు.. స్మార్ట్‌ ఫోన్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌ కంటి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇక దీన్ని నిరంతరాయంగా వాడడం వల్ల కొన్నేళ్లకు మెడ నొప్పి కూడా వస్తుందంటున్నారు నిపుణులు. ఈ తిప్పలన్నీ తప్పాలంటే.. రోజుకు అరగంట చొప్పున మొబైల్‌ను పక్కన పెట్టి చూడండి.. అటు మానసికంగా, ఇటు శారీరకంగా, మరోవైపు కంటికీ ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది.

కెరీర్‌కూ మేలు!

స్మార్ట్‌ ఫోన్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల వ్యక్తిగతంగా, ఆరోగ్య పరంగానే కాదు.. కెరీర్‌కూ ముప్పు తప్పదని కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పనిలో ఉత్పాదకతను తగ్గించడం దగ్గర్నుంచి.. సహోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించలేకపోవడం, వ్యక్తిగత ఒత్తిళ్లు చేసే పనిపై ప్రతికూల ప్రభావం చూపడం, ప్రవర్తన లోపాలు.. ఇలాంటి సమస్యలన్నీ తెచ్చిపెడతాయి. వీటివల్ల అటు చేసే పనిపై దృష్టి పెట్టలేం.. ఇటు ప్రశాంతంగానూ ఉండలేం. అదే.. వ్యక్తిగత సమయాల్లో ఓ అరగంట పాటు స్మార్ట్‌ ఫోన్‌ను పక్కన పెట్టడంతో పాటు ఆఫీస్‌ సమయాల్లో దీనికి దూరంగా ఉండడం వల్ల చాలా ప్రయోజనాల్ని పొందచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్