Assembly Elections: అందాల రాణి.. ప్యాడ్ వుమన్..ఇప్పుడు ఎమ్మెల్యేలయ్యారు!

‘రాజకీయాలంటేనే రొంపి.. అందులో దిగలేం.. దిగితే బయటపడలేం..’ అనుకుంటారు చాలామంది. ‘కానే కాదు.. ప్రజా సేవకు ఇదో వారధి..’ అంటున్నారు పంజాబ్‌కు చెందిన ఇద్దరు మహిళలు. గాయనిగా ఒకరు, ప్యాడ్‌ ఉమన్‌గా మరొకరు పేరుగాంచినా.. అక్కడితో సరిపెట్టుకోకుండా.. ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇదే లక్ష్యంతో, నిండైన ఆత్మవిశ్వాసంతో తాజా......

Updated : 11 Mar 2022 18:25 IST

(Photos: Twitter)

‘రాజకీయాలంటేనే రొంపి.. అందులో దిగలేం.. దిగితే బయటపడలేం..’ అనుకుంటారు చాలామంది. ‘కానే కాదు.. ప్రజా సేవకు ఇదో వారధి..’ అంటున్నారు పంజాబ్‌కు చెందిన ఇద్దరు మహిళలు. గాయనిగా ఒకరు, ప్యాడ్‌ ఉమన్‌గా మరొకరు పేరుగాంచినా.. అక్కడితో సరిపెట్టుకోకుండా.. ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇదే లక్ష్యంతో, నిండైన ఆత్మవిశ్వాసంతో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగి విజయదుందుభి మోగించారు. వారే ఆమ్‌ ఆద్మీ పార్టీ మహిళా అభ్యర్థులు జీవన్‌ జ్యోత్‌ కౌర్‌, అన్‌మోల్‌ గగన్‌మాన్‌. వీరిద్దరూ పోటీ పడిన తొలిసారే విజయం సాధించడం విశేషం! చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం అంటోన్న ఈ మహిళా నాయకుల నేపథ్యాలివీ!

‘ప్యాడ్‌ ఉమన్‌’ నుంచి రాజకీయ నేతగా..!

మన సేవలు మరింతమందికి విస్తరించాలంటే అది రాజకీయాల ద్వారానే సాధ్యమవుతుందంటోంది అమృత్‌సర్కి చెందిన జీవన్‌ జ్యోత్‌ కౌర్‌. ‘ప్యాడ్‌ ఉమన్‌’గా, సమాజ సేవకురాలిగా పేరుగాంచిన ఆమె.. అమృత్‌సర్ (తూర్పు )అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందింది. అంతేకాదు.. పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్‌ పార్టీకి చెందిన బిక్రమ్‌ సింగ్ మజీఠియా.. వంటి ప్రముఖ నేతల్ని ఆమె ఓడించడం విశేషం.

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రజా సేవలో లీనమయ్యారు కౌర్‌. 1996లో ‘Sri Hemkunt Education (SHE)’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారామె. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే దీని ముఖ్యోద్దేశం. ఈ నేపథ్యంలోనే ఓ పాఠశాలను కూడా నడిపిస్తున్నారు. మరోవైపు ‘EcoShe’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. పర్యావరణహిత శ్యానిటరీ న్యాప్‌కిన్లను రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలకు అందిస్తున్నారు. ఇలా మహిళల వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తోన్న ఆమెను అక్కడి వారు ‘ప్యాడ్‌ ఉమన్‌’ అని పిలుచుకుంటారు. అంతేకాదు.. మురికివాడల్లో నివసించే పేద ప్రజలకు పునరావాసం కల్పించే యోచనతో ప్రారంభించిన ‘మిషన్‌ అబాద్‌’లో భాగంగా.. జలంధర్‌లోని ఓ మురికివాడను ఆమె దత్తత కూడా తీసుకున్నారట! సామాన్య ప్రజల అభివృద్ధి కోసం ఆమె పడుతోన్న ఈ తపనే.. ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ దృష్టిని ఆకర్షించేలా చేసింది. ఈ క్రమంలోనే 2016లో ఆప్‌ పార్టీలో చేరారు కౌర్.

ఐదేళ్ల రాజకీయ ప్రయాణంలో..!

2017లో ఆప్‌ తరఫున ఏకైక మహిళా వలంటీర్‌గా వ్యవహరించిన కౌర్‌.. అప్పటి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎన్నికలు ముగిశాక ఆప్‌ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమితురాలైన ఆమె.. 2019 పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో క్యాంపెయిన్‌ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. ఇక ఈసారి ప్రత్యక్షంగా బరిలోకి దిగిన ఆమె.. ఎన్నికల ప్రచారంలో కొత్త వ్యూహాలకు తెర లేపారు. ‘జన్‌ సన్సద్స్‌’ పేరుతో ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించి.. ఇంటింటికీ వెళ్లి నాయకుల దగ్గర్నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారో, అభివృద్ధిలో భాగంగా ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పరిశుభ్రమైన తాగునీరు, మురుగునీటి వ్యవస్థ అభివృద్ధి, నివాస ప్రాంతాలపై ప్రమాదకరంగా వేలాడుతోన్న హైటెన్షన్‌ వైర్లను పునరుద్ధరించడం.. వంటి మార్పులన్నీ చేస్తానని ప్రజలకు వాగ్దానం చేశారామె. ఇక ఇప్పుడు వీటన్నింటినీ నెరవేర్చడానికి ఉవ్విళ్లూరుతున్నానంటున్నారు కౌర్.


గాయనిగా.. అందాల రాణిగా..!

పట్టుదల ఉంటే ఏ పనిలోనైనా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం పెద్ద కష్టం కాదంటోంది పంజాబ్‌లోని ఖరార్‌ నియోజకవర్గానికి చెందిన అన్‌మోల్‌ గగన్మాన్‌. ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి తొలిసారి బరిలోకి దిగిన ఆమె.. సుమారు 36 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించింది. ప్రస్తుతం పంజాబ్‌లోని ఆప్‌ యూత్‌ వింగ్‌ అధ్యక్షురాలిగా కొనసాగుతోన్న గగన్‌ను.. గగన్‌దీప్‌ కౌర్‌ మాన్‌గానూ పిలుస్తుంటారు.

పంజాబ్‌ ప్రజలకు గగన్‌ మంచి గాయనిగానూ సుపరిచితమే! పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో పుట్టిపెరిగిన ఆమె స్వస్థలం మొహాలీ. ఆమెకు చిన్నతనం నుంచే సంగీతం, డ్యాన్స్‌ అంటే మక్కువ! ఈ ఇష్టంతోనే సంగీతం, సైకాలజీ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిందామె. ఆపై ఇంగ్లండ్‌లో కొన్ని రోజులు గడిపిన ఆమె.. 2014లో అక్కడ నిర్వహించిన ‘ప్రపంచ జానపద డ్యాన్స్‌ పోటీ’లో విజయం సాధించింది. ఇండియాకు తిరిగొచ్చాక గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2015లో తాను విడుదల చేసిన ‘పంజాబో’ ఆల్బమ్‌లో ‘రాయల్‌ జత్తీ’ అనే పాటతో గుర్తింపు తెచ్చుకుందామె. అంతేకాదు.. పాటల రచయితగా, కంపోజర్‌గానూ పాపులరైంది గగన్‌. అయితే సంగీత రంగంలోకి ప్రవేశించక ముందే అందాల రాణిగానూ ముద్రవేసింది. 2013లో ‘మిస్‌ వరల్డ్‌ పంజాబన్‌’ పోటీల్లో భాగంగా ‘మిస్‌ మొహాలీ పంజాబన్‌’ కిరీటం గెలిచిందీ పంజాబీ కుడీ. ఇక తాజా ఎన్నికల్లో విజయం సాధించి నిండైన ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆమె.. ‘ఏమీ ఆశించకుండా ప్రజా సేవ చేయడంలోనే అసలైన సంతృప్తి దాగుంది..’ అంటూ తన ట్విట్టర్‌ బయో ద్వారా తాను ప్రజల మనిషినని చెప్పకనే చెబుతోంది గగన్.

ఇక మరోవైపు మణిపూర్‌ ఎన్నికల్లోనూ మహిళా శక్తి మార్మోగింది. మొత్తంగా 60 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఐదు స్థానాల్ని మహిళలు కైవసం చేసుకున్నారు. కాగా, ఇంత మంది మహిళలు ఎన్నికవడం ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్