గర్భం ధరించినా ఎలా పరిగెడుతోందో చూడండి!

గర్భం ధరించిన మహిళలు బరువులెత్తకూడదు.. వ్యాయామాలు చేయకూడదు.. అనేది ఒకప్పటి మాట! కానీ ఈ తరం మహిళలు కడుపుతో ఉన్నా వృత్తిఉద్యోగాల్లో కొనసాగడం, క్రీడల్లో పాల్గొనడం, ఈ సమయంలో ఫిట్‌గా ఉండడానికి వ్యాయామాలు చేయడం.. ఇలా తమ అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికి ప్రెగ్నెన్సీ అడ్డు కానే కాదు అని నిరూపిస్తున్నారు. యూఎస్‌కు చెందిన హెప్టాథ్లెట్‌ లిండ్సే ఫ్లాచ్‌ కూడా ఇదే కోవకు చెందుతుంది. ప్రస్తుతం 18 వారాల (సుమారు నాలుగున్నర నెలలు) గర్భిణి అయిన ఆమె..

Updated : 30 Aug 2022 14:22 IST

Photos: Instagram

గర్భం ధరించిన మహిళలు బరువులెత్తకూడదు.. వ్యాయామాలు చేయకూడదు.. అనేది ఒకప్పటి మాట! కానీ ఈ తరం మహిళలు కడుపుతో ఉన్నా వృత్తిఉద్యోగాల్లో కొనసాగడం, క్రీడల్లో పాల్గొనడం, ఈ సమయంలో ఫిట్‌గా ఉండడానికి వ్యాయామాలు చేయడం.. ఇలా తమ అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికి ప్రెగ్నెన్సీ అడ్డు కానే కాదు అని నిరూపిస్తున్నారు. యూఎస్‌కు చెందిన హెప్టాథ్లెట్‌ లిండ్సే ఫ్లాచ్‌ కూడా ఇదే కోవకు చెందుతుంది. ప్రస్తుతం 18 వారాల (సుమారు నాలుగున్నర నెలలు) గర్భిణి అయిన ఆమె.. తాజాగా యూఎస్‌ ఒలింపిక్‌ టీమ్‌ ట్రయల్స్‌లో పాల్గొంది. చిట్టిపొట్టతో ప్రతి పోటీలోనూ తోటి క్రీడాకారిణులతో ఉత్సాహంగా పోటీ పడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. ‘అమ్మతనం ప్రతి మహిళ జీవితంలో ఓ అద్భుత ఘట్టం.. అయితే అక్కడితో మహిళల జీవితం ఆగిపోతుందంటే మాత్రం నేను ఒప్పుకోను’ అంటోన్న లిండ్సే తన గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి..

యూఎస్‌ఏకు చెందిన 31 ఏళ్ల లిండ్సే ఫ్లాచ్‌ హెప్టాథ్లెట్‌గా కొనసాగుతోంది. హెప్టాథ్లెట్‌ అంటే.. 100 మీటర్ల హర్డిల్స్‌, హై జంప్‌, షాట్‌పుట్‌, 200 మీటర్ల స్ప్రింట్‌, లాంగ్‌ జంప్‌, జావెలిన్‌ థ్రో, 800 మీటర్ల పరుగు.. వంటి ఏడు విభిన్న క్రీడల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అమెరికాలోని ఓరెగాన్‌ రాష్ట్రంలోని యూజీన్‌ పట్టణంలో ఇటీవలే యూఎస్‌ ఒలింపిక్‌ టీమ్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. అయితే అప్పటికే గర్భం ధరించిన లిండ్సే.. గర్భంతోనే ఈ పోటీల్లో పాల్గొంది. అంతేకాదు.. ఇతర క్రీడాకారిణులతో పోటాపోటీగా ట్రయల్స్‌ పూర్తిచేసింది.

అమ్మైతే కెరీర్‌ ముగిసినట్లు కాదు!

ఈ పోటీలకు ముందే తాను గర్భిణిని అని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిందీ అథ్లెట్‌. అయినా పోటీలకు హాజరవడంతో అందరూ తనది స్వార్థమన్నారు.. కానీ తాను మాత్రం డాక్టర్‌ సలహా మేరకే పోటీలకు హాజరవుతున్నానని, అయినా గర్భం ధరించినంత మాత్రాన మహిళల కెరీర్‌ ముగిసినట్లు కాదంటోంది లిండ్సే.

‘అమ్మను కాబోతున్నానని తెలిశాక ఎంతో ఆనందపడ్డా.. పోటీలకు ముందు నా ప్రెగ్నెన్సీ గురించి అందరితో పంచుకున్నా. అయితే ఈ క్రమంలో కొందరు నాది ధైర్యమని ప్రశంసిస్తే.. మరికొందరు స్వార్థమని విమర్శించారు. పుట్టబోయే బేబీని రిస్క్‌లో పెడుతున్నారని, గర్భం ధరించిన తర్వాత ఇలాంటి కఠినమైన పనులు చేయకూడదని అన్నారు. ఇక మరో విషయం ఏంటంటే.. ఇక్కడితో నా కెరీర్‌ ముగిసిపోయినట్లే అన్న వారూ ఉన్నారు. కానీ ఇందుకు నేను ఒప్పుకోను. నా జీవితంలో ఇప్పటిదాకా ఒక దశ ముగిసిపోయింది.. ఇప్పుడు కాబోయే అమ్మగా కొత్త ఇన్నింగ్స్‌లోకి అడుగుపెడుతున్నా. మన జీవితంలో ప్రతి ముగింపుకి ఒక కొత్త ప్రారంభం ఉంటుంది.. ఇక తెలిసి తెలిసి నా బేబీని నేనెందుకు రిస్క్‌లో పెడతాను. అందుకే ముందు డాక్టర్‌ సలహా తీసుకున్నాకే పోటీలకు హాజరవుదామని నిర్ణయించుకున్నా..’ అంటోందీ లేడీ అథ్లెట్‌.

శరీరాన్ని కష్టపెట్టలేదు!

ఈ పోటీల్లో పాల్గొనడానికి తొలి త్రైమాసికం నుంచే సాధన మొదలుపెట్టానంటోంది లిండ్సే. ‘నేను, నా కడుపులో పెరుగుతోన్న బిడ్డ.. ఇద్దరం ఆరోగ్యంగా ఉండాలన్న విషయం మనసులో పెట్టుకొనే ఈ పోటీల కోసం సాధన ప్రారంభించా. ఈ క్రమంలో ఏ వర్కవుట్‌/ప్రాక్టీస్‌ అయినా సరే.. శరీరానికి సౌకర్యవంతంగా ఉన్నంత వరకే చేయడం మంచిదని నా డాక్టర్‌ సలహా ఇచ్చారు. అయితే మొదటి త్రైమాసికంలో సుమారు 12 వారాల దాకా వికారం, వాంతులు ప్రాక్టీస్‌కు కాస్త అడ్డంకిగా మారాయి. అయినా శరీరం సహకరించినప్పుడు సాధన చేశా. ఇక ఈ క్రమంలో డీహైడ్రేషన్‌ను అధిగమించడం కోసం నిపుణుల సలహా మేరకు ద్రవాహారం ఎక్కువగా తీసుకున్నా. పండ్లు, కాయగూరలు, మాంసాహారం, నీళ్లు.. నా శరీరానికి తక్షణ శక్తిని అందించేందుకు దోహదపడ్డాయి. ఇక రెండో త్రైమాసికంలోకి అడుగుపెట్టాక నా శరీరం మరింత తేలిగ్గా, చురుగ్గా అనిపించింది. అప్పుడు క్రీడలపై మరింత దృష్టి పెట్టగలిగా..’ అంటూ ఓ సందర్భంలో పంచుకుందీ కాబోయే అమ్మ.

మొత్తం 18 మంది క్రీడాకారిణులు పాల్గొన్న ఈ హెప్టాథ్లాన్‌ పోటీల్లో 15వ స్థానంలో నిలిచింది లిండ్సే. అయినా గర్భంతోనూ తాను ఆ స్థానాన్ని అందుకోవడం గ్రేట్‌ అంటున్నారంతా! ఇలా ఈ అమెరికన్‌ అథ్లెట్‌ యూఎస్‌ ఒలింపిక్‌ టీమ్‌ ట్రయల్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

గమనిక: లిండ్సే అథ్లెట్‌ కాబట్టి గర్భంతో ఉన్నా పోటీల కోసం డాక్టర్‌ సలహా మేరకు వ్యాయామాలు, సాధన చేయగలిగింది. అయితే గర్భిణిగా ఉన్నప్పుడు ఒక్కొక్కరి ఆరోగ్యం, శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. అలాగే ఈ సమయంలోనూ వ్యాయామం చేయడం తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యానికి మంచిదే! అయితే గర్భిణులు ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు లేదంటే ఏదైనా పోటీలో పాల్గొనే ముందు.. ఒకసారి వైద్యుల సలహా తీసుకొని వారు సరేనంటేనే ముందుకు సాగడం మంచిది. తద్వారా ముందు ముందు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్