Milk Options: ఈ పాల గురించి తెలుసా?

పాలు సంపూర్ణ పోషకాహారం అని చెబుతుంటారు వైద్యులు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వారు, డైట్‌ పాటించే వారు వీటికి దూరంగా ఉండడం సహజమే! ఇలాంటి వారు మార్కెట్లో దొరికే ఇతర పాల ప్రత్యామ్నాయాల్ని ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

Published : 11 Mar 2024 21:29 IST

పాలు సంపూర్ణ పోషకాహారం అని చెబుతుంటారు వైద్యులు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వారు, డైట్‌ పాటించే వారు వీటికి దూరంగా ఉండడం సహజమే! ఇలాంటి వారు మార్కెట్లో దొరికే ఇతర పాల ప్రత్యామ్నాయాల్ని ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా వారికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు ఇవి ఆరోగ్యానికీ మేలు చేస్తాయంటున్నారు. మరి, ఇంతకీ మార్కెట్లో అందుబాటులో ఉన్న విభిన్న పాల ప్రత్యామ్నాయాలేంటి? ఎవరికి ఏ పాలు మేలు చేస్తాయి? వీటి వల్ల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలేంటి? నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

కొంతమందికి పాలు/పాల పదార్థాలు పడవు.. మరికొందరిలో జీర్ణవ్యవస్థ పాలలోని చక్కెరల్ని జీర్ణం చేసుకోలేదు. ‘లాక్టోజ్‌ ఇన్‌టాలరెన్స్‌’గా పిలిచే ఈ సమస్య కారణంగా పాలను దూరం పెట్టే వారు కొందరుంటారు. ఇంకొంతమందిలో పలు అనారోగ్యాలు, డైట్‌ పాటించడం, ఆహారపు ఆంక్షల వల్ల పాలను ఆహారంలో చేర్చుకోలేరు. ఇలాంటి వారు మార్కెట్లో దొరికే విభిన్న పాల ప్రత్యామ్నాయాలు ఎంచుకోవచ్చు.

ప్రత్యామ్నాయాలు!

⚛ సోయా పాలు - సోయా బీన్స్‌ నుంచి తయారయ్యే ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయంటున్నారు నిపుణులు. ఆవు పాలతో సమానమైన పోషకాల్ని ఈ పాల నుంచి పొందచ్చంటున్నారు.

⚛ కొబ్బరి పాలు - పచ్చి కొబ్బరి నుంచి తీసిన ఈ పాలు చిక్కగా, క్రీమీగా ఉంటాయి. మంచి కొవ్వులు, విటమిన్‌ ‘సి’ పుష్కలంగా లభించే ఈ పాలలో క్యాలరీలు చాలా తక్కువ! అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం అంటున్నారు నిపుణులు.

⚛ ఓట్స్‌ పాలు - ముడి ఓట్స్‌ లేదా ఓట్‌మీల్‌ను నీటితో కలిపి వీటిని తయారుచేస్తారు. క్రీమీగా ఉండే ఈ పాలు రుచికి కాస్త తియ్యగా ఉంటాయి. ఈ పాలలో పుష్కలంగా ఉండే ఫైబర్‌ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. పాల ప్రత్యామ్నాయాలన్నింటిలోకెల్లా ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

⚛ బియ్యపు పాలు - మిల్లులో ఆడించిన బియ్యం, నీళ్లు.. ఈ రెండూ కలిపి ఈ పాలను తయారుచేస్తారు. ఆవు పాల కంటే పల్చగా ఉండే ఈ పాలు తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. మాంగనీస్‌, సెలీనియం.. వంటి యాంటీ ఆక్సిడెంట్ల మిళితమైన ఈ పాలు అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి.. తద్వారా రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాదు.. క్యాన్సర్ల ముప్పును తగ్గించడంలోనూ ఈ పాలు శ్రేష్టమని నిపుణులు చెబుతున్నారు.

⚛ నట్‌ మిల్క్‌ - బాదం, పల్లీలు, హేజల్‌నట్స్‌, జీడిపప్పు.. మొదలైన గింజ ధాన్యాలతో తయారుచేసిన పాలు కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండడంతో పాటు క్యాల్షియం, విటమిన్‌ ‘డి’, విటమిన్‌ ‘బి12’.. వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి గుండె సమస్యల ముప్పును తగ్గించి ఎముకల దృఢత్వాన్ని పెంపొందిస్తాయి.


ఎవరికి.. ఏ పాలు?!

అయితే మార్కెట్లో ఇన్ని పాల ప్రత్యామ్నాయాలున్నా.. వీటిని ఎంచుకునే క్రమంలో కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వాటిలో ఉన్న పోషకాలు, ఆహార ప్రాధాన్యతలు, శరీర అవసరాల్ని బట్టే ఆయా పాలను ఎంచుకోవడం వల్ల ఆరోగ్యపరంగా మేలు జరుగుతుందంటున్నారు.

⚛ కొంతమంది బరువు తగ్గే పనిలో ఉంటారు. ఇలాంటి వారు గేదె/ఆవు పాలకు బదులుగా బాదం, సోయా, ఓట్స్‌తో తయారుచేసిన పాలను తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. వీటిలో ప్రొటీన్లు అధికంగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అలాగే చెడు కొవ్వులు అసలే ఉండవు. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

⚛ కొన్ని రకాల క్యాన్సర్లు, ఫైబ్రాయిడ్లు, థైరాయిడ్‌ సమస్యలతో బాధపడే వారు ఈస్ట్రోజెన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని పూర్తిగా దూరం పెట్టాలి. ఈ క్రమంలో సోయా పాలను మినహాయించి ఇతర పాల ప్రత్యామ్నాయాల్ని డైట్‌లో చేర్చుకోవచ్చంటున్నారు నిపుణులు.

⚛ లాక్టోజ్‌ ఇన్‌టాలరెన్స్‌ ఉన్న వారికి బాదం, సోయా, ఓట్‌ మిల్క్‌ శ్రేష్టమని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే తీసుకొనే టీ/కాఫీ దగ్గర్నుంచి స్వీట్ల తయారీలోనూ ఈ పాలనే ఉపయోగించడం మంచిదంటున్నారు.

⚛ కొంతమందిలో కొన్ని రకాల గుండె సమస్యలుంటాయి. మరికొంతమందిలో ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తుంటుంది. ఇలాంటి వారు ఏ పాలను తీసుకున్నా అందులో వెన్న పూర్తిగా లేకుండా చూసుకోవాలి. తద్వారా చెడు కొవ్వులు శరీరంలోకి చేరకుండా, ఆయా సమస్యల ముప్పు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ క్యాల్షియం, రైబోఫ్లేవిన్‌, విటమిన్‌ ‘డి’, అయోడిన్‌, పొటాషియం, జింక్‌.. వంటి ఎన్నో పోషకాలు మిళితమై ఉన్న ఆవు పాలు దాదాపు అందరికీ మంచివంటున్నారు నిపుణులు. అయితే వయసు పెరిగే కొద్దీ జీర్ణవ్యవస్థకు వీటిని అరిగించుకునే శక్తి తగ్గుతుంది. అలాగే రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లకు సంబంధించిన కుటుంబ చరిత్ర కలిగిన వారు కూడా వయసు పెరుగుతున్న కొద్దీ పాలను మితంగా తీసుకోవడం లేదంటే పూర్తిగా పక్కన పెట్టేయడం మంచిదంటున్నారు నిపుణులు.

అయితే పాలకు బదులు ప్రత్యామ్నాయాలుగా తీసుకునే వీటిలో అన్నీ అందరికీ సరిపడకపోవచ్చు. అందుకే వాటిని కొద్దికాలం వాడి చూసి, ఏవైనా తేడాలు గమనిస్తే- వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్