సరిపడినన్ని నీళ్లు తాగుతున్నారా?

నీరు.. జీవక్రియలకు ఎంతో అవసరం. సరిపడినన్ని నీళ్లు తాగితే మనకెదురయ్యే సగం ఆరోగ్య సమస్యలను ఇట్టే తగ్గించుకోవచ్చట! ఇది తెలిసినా సరే.. నీళ్లు తాగడానికి ఇష్టపడని వారు చాలామందే ఉంటారు. అందుకే నీళ్లు తాగడానికి కాస్త భిన్నమైన మార్గాలను....

Published : 24 Feb 2023 20:09 IST

నీరు.. జీవక్రియలకు ఎంతో అవసరం. సరిపడినన్ని నీళ్లు తాగితే మనకెదురయ్యే సగం ఆరోగ్య సమస్యలను ఇట్టే తగ్గించుకోవచ్చట! ఇది తెలిసినా సరే.. నీళ్లు తాగడానికి ఇష్టపడని వారు చాలామందే ఉంటారు. అందుకే నీళ్లు తాగడానికి కాస్త భిన్నమైన మార్గాలను వెతుక్కోవడం ద్వారా ప్రత్యేకించి వేసవిలో శరీరంలో నీటి మోతాదు తగ్గకుండా జాగ్రత్తపడచ్చు. తద్వారా ఎన్నో సమస్యల నుంచి దూరంగా ఉండే వీలుంటుంది.

ఈ క్రమంలో రోజూ కొన్ని వేళల్లో నీళ్లు తాగడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు..

ఉదయం లేవగానే తప్పనిసరిగా రెండు గ్లాసుల నీళ్లు తాగాలన్నది నిపుణుల సలహా. దీనివల్ల అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తాయి.

టిఫిన్ లేదా భోజనం ఇలా ఏ ఆహారానికైనా అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగాలి. దీనివల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.

స్నానం చేసే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. దీనివల్ల రక్తపోటు రాకుండా కాపాడుకోవచ్చు.

రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువట.

అందంగా తయారుచేస్తే..

ఏదైనా అందంగా, కంటికి ఇంపుగా ఉంటే ఆ పని ఇట్టే చేయాలనిపిస్తుంది. సాధారణంగా జిమ్‌కి వెళ్లడం ఇష్టం లేని వారికి కూడా అందమైన ట్రాక్‌సూట్ కొనుక్కుంటే దాన్ని వేసుకోవాలన్న ఆత్రుత జిమ్‌కి పరిగెత్తిస్తుంది. అలాగే అందంగా సర్దుకున్న డెస్క్ పనిలో ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇదే సూత్రం నీటికి కూడా వర్తిస్తుంది. అందుకే ఒక అందమైన రంగురంగుల లేదా మీకు నచ్చిన ఆకారంలో ఉన్న బాటిల్‌ని కొనుక్కోండి. దాని నిండా నీటిని నింపి మీకు ఎదురుగా పెట్టుకోండి. దీనివల్ల నీరు తాగే అవకాశాలు మెరుగవుతాయి. దాన్ని చూసినప్పుడల్లా నీళ్లు తాగాలన్న విషయం గుర్తొస్తుంది.

ఫ్లేవర్ కలపండి..

'నీటికి ఎలాంటి రుచి ఉండదు కాబట్టి తాగాలనిపించదు' అని చాలామంది అనుకోవడం సహజం. ఇలాంటప్పుడు నీటికి కొన్ని రకాల ఫ్లేవర్లను జోడించడం ద్వారా దాన్ని రుచిగా మార్చి, సులభంగా తాగేందుకు ప్రయత్నించవచ్చు. అయితే దీనికోసం మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లను కలపాల్సిన అవసరమేమీ లేదు. ఇంట్లోనే అందుబాటులో ఉన్న పండ్లతో నీటికి నోరూరించే రుచి తీసుకురావచ్చు. నీటిలో పండ్లు లేదా పుదీనా వంటి ఆకులు కలిపి కూడా వాటికి రుచిని తీసుకురావచ్చు. దీనికోసం పుదీనా, పుచ్చకాయ ముక్కలు, స్ట్రాబెర్రీలు, కీరా వంటి వాటిలో ఏదైనా ఎంచుకొని దాని ముక్కలను నీటిలో వేసి ఫ్రిజ్‌లో పెడితే సరి. పండ్లలో ఉన్న పోషకాలతో పాటు వాటి రుచి కూడా నీళ్లలోకి చేరిపోతుంది.

ఆకలి వేసినప్పుడు..

మన శరీరం కొన్నిసార్లు దాహాన్ని సైతం ఆకలిగా భావిస్తుందట. అందుకే మనకు దాహం వేసినప్పుడల్లా ఆకలేసినట్లుగా అనిపించి ఎక్కువగా తినేస్తుంటాం. దీనివల్ల అనవసరమైన క్యాలరీలు శరీరంలోకి చేరి, మరింత లావవుతాం.. అందుకే ఆకలిగా అనిపించినప్పుడు కొన్ని నీళ్లు తాగి చూడండి. ఆపై పది నిమిషాలు ఆగండి. ఒకవేళ ఆకలి తగ్గిపోతే ఫర్వాలేదు. లేదంటే మాత్రం ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఇలా చేయడం వల్ల బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

నీటితో ఆట..

నీళ్లు తాగడాన్ని ఒక పనిలా భావిస్తే అది కొన్నాళ్లకే బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. అందుకే రోజూ సరిపడినన్ని నీళ్లు తాగేందుకు ఓ చక్కటి పద్ధతిని పాటించవచ్చు. ఒక చిన్న పని పూర్తయితే చాలు.. కొన్ని నీళ్లు తాగేయండి. ఇదేవిధంగా నీళ్లు తాగాలని గుర్తు చేయడానికి వివిధ రకాల యాప్స్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్