తప్పు చేయనప్పుడు అపరాధ భావనెందుకు?!

దాదాపు 96 శాతం మంది మహిళలదీ ఇదే పరిస్థితట! వీరంతా ఎలాంటి తప్పు చేయకపోయినా ఏదో ఒక అంశం గురించి రోజుకు ఒకసారైనా అపరాధ భావనకు లోనవుతున్నారని ఓ అధ్యయనం చెబుతోంది. అయితే ఇలాంటి ప్రతికూల ఆలోచనలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని...

Published : 18 Aug 2022 19:09 IST

‘అటు ఇంటి పనులు, ఇటు ఆఫీస్‌ హడావిడిలో పడిపోయి పిల్లలకు అసలు సమయమే కేటాయించలేకపోతున్నాను..’ అంటూ తనను తానే అసహ్యించుకుంటోంది ప్రగతి.

‘ఎంత పకడ్బందీగా ప్లాన్‌ చేసుకున్నా సమయానికి పనులు పూర్తి కావట్లేదు.. నిజంగా దురదృష్టమంటే నాదే..!’ ఇలా తనపై తానే విసుక్కుంటుంటుంది కోమలి.

వీళ్లే కాదు.. దాదాపు 96 శాతం మంది మహిళలదీ ఇదే పరిస్థితట! వీరంతా ఎలాంటి తప్పు చేయకపోయినా ఏదో ఒక అంశం గురించి రోజుకు ఒకసారైనా అపరాధ భావనకు లోనవుతున్నారని ఓ అధ్యయనం చెబుతోంది. అయితే ఇలాంటి ప్రతికూల ఆలోచనలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని.. తద్వారా దాని ప్రభావం శారీరక, మానసిక ఆరోగ్యంపై పడుతోందని నిపుణులు అంటున్నారు. అందుకే చేయని తప్పుకు పశ్చాత్తాపపడే బదులు.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే అన్ని విధాలా పైచేయి సాధించచ్చంటున్నారు. మరి, ఇంతకీ మహిళలు ఏయే విషయాల్లో అపరాధ భావనకు లోనవుతారు? దాన్నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

వాళ్లను నిర్లక్ష్యం చేస్తున్నా!

ఇటు ఇంటి పనులు, అటు కెరీర్‌ను బ్యాలన్స్‌ చేసుకోవడంలో శారీరకంగా, మానసికంగా నలిగిపోతుంటారు మహిళలు. ఈ క్రమంలో 24 గంటల సమయం కూడా వారికి సరిపోదంటే అతిశయోక్తి కాదు. అయినా తమ గురించి మర్చిపోయి.. ఇంట్లో పిల్లలకు, భర్తకు సమయం కేటాయించలేకపోతున్నామన్న అపరాధ భావం చాలామందిని వేధిస్తుంటుంది. ఓవైపు పనులతో శారీరకంగా ఒత్తిడి ఎదుర్కొంటూనే.. ఇలాంటి ఆలోచనలతో మానసికంగానూ ఆందోళన చెందుతుంటారు. దీనివల్ల ఒక్కోసారి ఓపిక నశించి.. తమను తామే అసహ్యించుకోవడం, కోపగించుకోవడం.. వంటివీ చాలామంది విషయంలో చూస్తుంటాం. అయితే దీనికి బదులు ఒక్క క్షణం పాజిటివ్‌గా ఆలోచించి చూడమంటున్నారు నిపుణులు. ఒక పని చేసేటప్పుడు మరో ఆలోచన చేయకుండా.. దానిపైనే పూర్తి దృష్టి పెట్టమంటున్నారు. అంటే.. ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఆఫీస్‌ పనులపై, ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు, అనుబంధాల పైనే పూర్తి దృష్టి పెట్టడం వల్ల సమయం సద్వినియోగం అవుతుంది.. పైగా మీలో ఉన్న అసంతృప్తీ తొలగిపోతుంది. కావాలంటే ఓసారి ప్రయత్నించి చూడండి!

ఛీ.. ఛీ.. నా శరీరమే ఇంత!

అందం, చర్మ ఛాయ, బరువు.. ఈ విషయాల్లో సమాజం నిర్దేశించిన ప్రమాణాల్నే పాటిస్తుంటారు కొందరు మహిళలు. ఎవరో ఏదో అన్నారని.. వాళ్ల మాటలు తప్పని నిరూపించడానికి తమ శరీరాన్ని కష్టపెట్టడానికీ వెనకాడరు. ఉదాహరణకు.. అధిక బరువున్న వారు బరువు తగ్గడానికి విపరీతంగా శ్రమిస్తుంటారు. అయినా ఫలితం లేకపోతే.. ‘ఛీ.. ఛీ.. నా శరీరమే ఇంత! అప్రయత్నంగా బరువు పెరుగుతోంది.. కానీ ఎంత ప్రయత్నించినా తగ్గదే!’ అని తమను తామే నిందించుకుంటారు. నిజానికి కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే బరువు పెరిగిపోవచ్చు. అలాంటప్పుడు ఇతరుల మాటలు పట్టించుకొని బాధపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. బరువు తగ్గుతారా, పెరుగుతారా అన్న విషయంలో పూర్తిగా మీ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యమిస్తూ.. ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు అంగీకరించుకునేలా స్వీయ ప్రేమను పెంచుకోవాలి. ఇదే ఇటు వ్యక్తిగతంగా, అటు కెరీర్‌ పరంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.

దురదృష్టమంటే నాదే!

చాలామంది ఫలానా పని ఫలానా సమయంలో పూర్తి చేయాలి అనుకుంటారు.. కానీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంటుంది. కొన్నిసార్లు దీన్ని పట్టించుకోకపోయినా.. మరికొన్నిసార్లు మాత్రం పని పూర్తికాక విసుగు చెందుతాం. ‘నిజంగా దురదృష్టమంటే నాదే! ఏదైనా పని అనుకున్నానంటే అది కచ్చితంగా ఆగిపోతుంది. ఇక నుంచి ఏదీ ముందుగా ప్లాన్‌ చేసుకోను.. ఎలా ఉంటే అలా జరుగుతుంది..’ అని మనల్ని మనం నిందించుకుంటామే కానీ దీన్ని పూర్తిచేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి మాత్రం ఆలోచించం. నిజానికి ఇది మన ఒక్కరి సమస్యే కాదు.. మన కుటుంబంలో పెద్దలు, ఇతర సభ్యులు కూడా ఎదుర్కొనే ఉంటారు. కాబట్టి వాళ్ల సలహా తీసుకోవడంలో తప్పు లేదు. అలాగే చిన్న విషయానికే విసుగు చెందకుండా.. ఓపికతో ప్రయత్నిస్తే పనులు పూర్తవడంతో పాటు ఫలితాలూ ఆశించినట్లుగా వస్తాయంటున్నారు నిపుణులు.

ఏంటో.. ఈ మతిమరుపు!

మహిళలకు తమకున్న రోజువారీ హడావిడిలో తమకు సంబంధించిన ప్రత్యేక సందర్భాల్ని కూడా త్యాగం చేస్తుంటారు. అయినా అందుకు ఫీలవ్వరు. అదే ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రత్యేక సందర్భాల గురించి మర్చిపోతే మాత్రం అయ్యో అని బాధపడతారు.  నిజానికి దీనివల్ల మానసిక ప్రశాంతత కోల్పోవడం తప్ప మరే ఉపయోగమూ ఉండదు. ఇలా బాధపడే బదులు.. ‘జరిగిందేదో జరిగిపోయింది.. ఇకపై మర్చిపోను!’ అంటూ ఓ రిమైండర్‌ పెట్టుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన కొన్ని అకేషన్స్‌ని కూడా ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు మిస్‌కాకుండా జాగ్రత్తపడచ్చు. ఇలాంటి చిన్న చిన్న పనులే మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయంటున్నారు నిపుణులు.

ఇక వీటితో పాటు తలకు మించిన పనుల్ని నెత్తిన వేసుకోకుండా నిర్మొహమాటంగా ‘నో’ చెప్పడం, ఎంత బిజీగా ఉన్నా మీకంటూ కాస్త సమయం కేటాయించుకోవడం, మనసుకు నచ్చిన పనులు చేయడం, ప్రతి విషయంలో హైరానా పడిపోకుండా అవసరమైతే పెద్ద వాళ్ల సలహాలు తీసుకోవడం.. ఇవన్నీ మీపై అదనపు భారాన్ని తగ్గించడంలో, స్వీయ ప్రేమను పెంచుకోవడంలో సహాయపడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్