10 కోట్లు కూడబెట్టి 35 ఏళ్లకే రిటైరైంది.. ప్రపంచాన్ని చుట్టేస్తోంది!

ఈ ప్రపంచంలో చాలా విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అది మన దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే అంత భరోసా. అంటే డబ్బును ఎంత పొదుపు చేస్తే అంత మంచిదని. అందుకే సంపాదనతో సంబంధం లేకుండా

Published : 04 Oct 2021 20:11 IST

ఈ ప్రపంచంలో చాలా విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అది మన దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే అంత భరోసా. అంటే డబ్బును ఎంత పొదుపు చేస్తే అంత మంచిదని. అందుకే సంపాదనతో సంబంధం లేకుండా నెల జీతంలో ఎంతో కొంత పక్కన పెట్టాలంటారు ఆర్థిక నిపుణులు. భవిష్యత్‌లో కరోనా లాంటి సంక్షోభాలను ఎదుర్కోవడంతో పాటు పిల్లల చదువులు, కెరీర్‌, ఇతర అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుందంటారు.

35 ఏళ్లకే రిటైర్మెంట్..!

ఈ నేపథ్యంలో యూకేకు చెందిన కేటీ డొనెగన్‌ అనే ఓ మహిళ 35 ఏళ్లకే ఉద్యోగ విరమణ తీసుకుంది. ఇంకొన్నేళ్ల పాటు పనిచేసే శక్తి సామర్థ్యాలున్నా జాబ్‌ను వదిలేసి భర్తతో పాటు హాయిగా విదేశాల్లో విహరిస్తోంది. ‘మరి ఉద్యోగాన్ని వదిలేసి విదేశాలు ఎలా తిరుగుతోంది?’ అనే కదా మీ అనుమానం. ఎందుకంటే రిటైర్మెంట్‌ తీసుకునే నాటికే ఆమె సుమారు రూ. 10 కోట్లు కూడబెట్టింది. అందులో కొంత మొత్తాన్ని స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టింది. దానిపై వస్తోన్న ఆదాయంతోనే ఇప్పుడిలా విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తోంది. మరి కేటీ ఇంత డబ్బును ఎలా పొదుపు చేసిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి.

నా ఆర్థిక భరోసాకు కారణమదే!

‘సాధారణంగా ఉద్యోగ విరమణ తీసుకున్న వాళ్లకు ఖాళీ సమయం బాగా దొరుకుతుంటుంది. ఎక్కువసేపు వారి మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. ప్రస్తుతం నాకు కూడా బోలెడు ఖాళీ సమయం దొరుకుతోంది. కానీ నేను ఆడుకోవడానికి మనవళ్లు, మనవరాళ్లెవరూ లేరు. ఎందుకంటే ఇప్పుడు నా వయసు కేవలం 37 ఏళ్లు మాత్రమే. 35 ఏళ్లకే రిటైర్మెంట్‌ తీసుకున్న నా ఆర్థిక భరోసాకు కారణమేంటంటే... చిన్నప్పటి నుంచి నేను పోగు చేసుకున్న డబ్బులే.’

అప్పు నాకు నచ్చదు!

‘నేను లండన్‌లో ఉక్స్‌బ్రిడ్జ్‌ నగరంలో పెరిగాను. అమ్మ అలిసన్‌ ఓ టీచర్‌. నాన్మ క్రిస్‌ మార్కెట్‌ రీసెర్చర్‌గా పనిచేశారు. మా అమ్మానాన్నలకు వచ్చే ఆదాయంతో ఉన్నంతలో సౌకర్యంగానే ఉండేవాళ్లం. అయితే వారెప్పుడూ విందులు, విలాసాలకు ఎక్కువగా ఖర్చుపెట్టింది నేను చూడలేదు. ఆ లక్షణమే నాకు వచ్చింది. చిన్నప్పుడు అమ్మానాన్నలు ఇచ్చిన పాకెట్‌ మనీని అనవసరంగా ఖర్చు పెట్టేదాన్ని కాదు. పద్ధతిగా దాచుకునేదాన్ని. అలా క్రమంగా నా సేవింగ్స్‌ పెరిగిపోతుంటే మనసులో తెలియని ఆనందం కలిగేది. 18 ఏళ్ల వయసులో ఆక్స్ఫర్డ్‌ యూనివర్సిటీలో చేరాను. కానీ మ్యాథ్స్‌ అర్థం కాక ఏడాదికే బయటికొచ్చేశాను. ఆ తర్వాత చదువుతూనే ఇంటి నుంచి ఆఫీస్‌ అడ్మినిస్ట్రేటివ్‌ పనులు చేయడం మొదలుపెట్టాను. అప్పుడే గంటకు సుమారు రూ.900 సంపాదించడం మొదలుపెట్టాను’ 

రెస్టరంట్లకు వెళ్లడం తగ్గించేశాను!

‘2005లో ఒక ప్రాజెక్టు కోసం కోస్టారికాకు వెళ్లాను. అక్కడే నాకు అలన్‌(భర్త) పరిచయమయ్యాడు. ఒకరికొకరం బాగా దగ్గరయ్యాం. అయితే ప్రాజెక్టు పూర్తయ్యాక నేను మళ్లీ యూకే వచ్చేసి డిగ్రీ పూర్తి చేసే పనిలో పడిపోయాను. ఈ సమయంలోనే నేను అనవసర ఖర్చులు తగ్గించాను. కొత్త దుస్తులు కొనుగోలు చేయడం, రెస్టరంట్లకు వెళ్లడం తగ్గించేశాను. ముఖ్యంగా ఎవరి దగ్గరా అప్పులు చేయలేదు. ఎందుకంటే ‘అప్పు’ అనే పదం నాకు అసలు నచ్చదు. 2008లో నా డిగ్రీ పూర్తైన వెంటనే అలన్‌తో కలిసి హ్యాంప్‌షైర్‌లోని అలన్‌ అమ్మ వాళ్లింటికి మారిపోయాం. దీనివల్ల ఇంటి కోసం ప్రత్యేకంగా డిపాజిట్‌ కట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. అక్కడే బిజినెస్‌ ప్రొఫెషనలిస్ట్గా నాకు ఉద్యోగం దొరికింది. ఏడాదికి సుమారు రూ.28.62 లక్షల వేతనం. అలన్‌కు కూడా టీచింగ్‌ ప్రొఫెషన్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా ఆదాయం వచ్చేది’..

ఈ మెయిల్స్‌తో పెళ్లికి ఆహ్వానించాం!

‘అలన్, నేను అధికారికంగా 2013లో పెళ్లి చేసుకున్నాం. ఇందుకోసం అతి తక్కువ ఖర్చుతో ఓ కమ్యూనిటీ హాలు బుక్‌ చేసుకున్నాం. ఖరీదైన వెడ్డింగ్ ఇన్విటేషన్లకు బదులు స్నేహితులు, బంధువులకు ఈ మెయిల్‌ ద్వారా ఆహ్వానాలు పంపాం. పెళ్లి వేడుకల్లో విందులు, వినోదాలకు ఎక్కువగా చోటివ్వలేదు. ఇక దాంపత్య బంధంలోకి అడుగుపెట్టాక పరస్పరం పొదుపు ప్రణాళికలు వేసుకున్నాం. ఇద్దరమూ ప్యాకెట్‌ ఫుడ్సే తిన్నాం. కొత్త కారు కొనే బదులు సెకండ్‌ హ్యాండ్‌ స్కోడా కారు తీసుకున్నాం. ఎక్కువగా ఖర్చయ్యే నైట్‌ పార్టీలకు వెళ్లే బదులు స్నేహితులనే ఇంటికి ఆహ్వానించి పార్టీ చేసుకున్నాం. 2014లో ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చింది. జీతం కూడా పెరిగింది. ఏడాదికి సుమారు 58 లక్షల వేతనం అందుకునేదాన్ని. అలన్‌ ఆదాయం కూడా బాగా పెరిగింది. అయితే సంపాదనతో సంబంధం లేకుండా ఇద్దరమూ కలిసి ప్రతినెలా సుమారు 3 లక్షలు పక్కన పెట్టేవాళ్లం.’

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాం!

‘అదే పాత ఇల్లు... అదే సెకండ్‌ హ్యాండ్‌ కారు’ అని బంధువులు, స్నేహితులు మా జీవన విధానం గురించి వివిధ రకాలుగా మాట్లాడుకునేవారు. అయితే మేం వాటిని పట్టించుకోలేదు. సేవింగ్స్‌ పెంచుకోవడంపై మరింత దృష్టి సారించాం. అప్పుడే ఒక బ్లాగ్‌లో FIRE (Financial Independence Retire Early) గురించి చదివాను. స్టాక్‌ మార్కెట్‌ గురించి అవగాహన పెంచుకున్నాను. ఆర్థిక స్వేచ్ఛ కోసం ఉద్యోగాన్ని వదిలేసి ఫ్రీలాన్స్‌ కాంట్రాక్టర్‌గా పని చేయడం మొదలు పెట్టాను. మరికొంత ఆదాయం కోసం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. లాభాలు బాగానే వచ్చాయి. 2018 సెప్టెంబర్‌ నాటికే నేను 9 కోట్ల దాకా కూడబెట్టాను. అయితే 10 కోట్ల లక్ష్యం మాత్రం 2019 ఏప్రిల్‌లో పూర్తైంది. మా ఆదాయం, ఆదాలు పెరిగినా ఇప్పటికీ అనవసర ఖర్చుల జోలికి వెళ్లడం లేదు. ఇప్పుడు కూడా మేం స్టాక్‌ మార్కెట్లో వచ్చిన ఆదాయంతోనే విదేశీ పర్యటనలు కొనసాగిస్తున్నాం. గతేడాది థాయిలాండ్‌, మెక్సికో, న్యూ ఓర్లియన్స్‌ దేశాలు విహరించాం. త్వరలో కొలంబియా, బగోటా దేశాల పర్యటనలకు బయలుదేరుతున్నాం’ అని తన పొదుపు పాఠాలను వివరించింది కేటీ. తను పొదుపు చేయడమే కాదు... ఆసక్తి ఉన్నవారికి ఆర్ధిక అంశాల పట్ల అవగాహన కలిగించడానికి ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తోంది కేటీ.

కేటీ పొదుపు పాఠాలు విన్నారు కదా.. మరి మీరు డబ్బుని ఎలా పొదుపు చేస్తున్నారు? మీ పొదుపు ప్రణాళికలేమిటో మాతో పంచుకోండి.. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్