‘నారీ శక్తి’కి నిలువెత్తు రూపాలు!

ఉనికే లేని గిరిజన భాషకు లిపిని రూపొందించిన ఘనత ఒకరిదైతే..శారీరక లోపాన్ని అధిగమించి నృత్యంతో ప్రపంచాన్ని మెప్పించారు మరొకరు..విషసర్పాలతో ఆడుకుంటూ.. వాటికి ప్రాణ దాతగా మారారు ఇంకొకరు..మహిళ తలచుకుంటే ఆరు నూరైనా.. తాను అనుకున్నది సాధించగలదని నిరూపించారు ఇలాంటి ఎందరో మహిళామణులు.

Published : 09 Mar 2022 12:34 IST

(Photos: Twitter)

ఉనికే లేని గిరిజన భాషకు లిపిని రూపొందించిన ఘనత ఒకరిదైతే..

శారీరక లోపాన్ని అధిగమించి నృత్యంతో ప్రపంచాన్ని మెప్పించారు మరొకరు..

విషసర్పాలతో ఆడుకుంటూ.. వాటికి ప్రాణ దాతగా మారారు ఇంకొకరు..

మహిళ తలచుకుంటే ఆరు నూరైనా.. తాను అనుకున్నది సాధించగలదని నిరూపించారు ఇలాంటి ఎందరో మహిళామణులు. నలుగురిలో ‘ఒక్క’రిగా.. మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి స్త్రీమూర్తులకు ఏటా అందించే అత్యుత్తమ పురస్కారమే ‘నారీ శక్తి’ అవార్డు. 2020, 2021 కి గాను తాజాగా మొత్తం 29 మంది మహిళలు ఈ పురస్కారం అందుకున్నారు. అందులో మన తెలుగు మహిళ కూడా ఉండడం గర్వకారణం.

ఏటా ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని పురస్కరించుకొని.. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళామణులకు ‘నారీ శక్తి’ అవార్డు అందించడం ఆనవాయితీ! ఈ నేపథ్యంలోనే 2020, 2021కి గాను తాజాగా 29 మంది మహిళలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో విజయ గాథ!

గిరిజన భాషకు ‘అక్షర’ ప్రాణం పోసి..!

గిరిజనులంటే ఈ సమాజంలో ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. హక్కుల దగ్గర్నుంచి అవకాశాల దాకా.. ప్రతి విషయంలోనూ వారిపై వివక్షే నెలకొందని చెప్పచ్చు. పైగా వాళ్ల భాష మాటలకే కానీ.. అక్షరాలకూ నోచుకోలేదు. ఓ గిరిజన మహిళగా ఇది తాను జీర్ణించుకోలేకపోయానంటున్నారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ సతుపతి ప్రసన్నశ్రీ. ఈ క్రమంలోనే 19 భారతీయ గిరిజన భాషలకు లిపిని రూపొందించి.. తద్వారా ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కారామె. వైజాగ్‌లో పుట్టి పెరిగిన ఆమె పూర్వీకులు ప్రకాశం జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో నివసించేవారు. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలోని ఆంగ్ల శాఖకు ప్రొఫెసర్‌గా, ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతోన్న ప్రసన్న.. దక్షిణ భారతంలోని యూనివర్సిటీల్లో గిరిజన నేపథ్యం ఉన్న ఏకైక మహిళా ఆంగ్ల ప్రొఫెసర్‌గా కీర్తి గడించారు.

ఒక గిరిజన యువతిగా ఈ సమాజంలో నెలకొన్న అసమానతల్ని దగ్గర్నుంచి గమనించిన ఆమె.. గిరిజనులకంటూ ప్రత్యేక లిపి ఉండాలని ఆకాంక్షించారు. ‘నాన్న రైల్వేలో ఉద్యోగం చేసేవారు. దాంతో ఆయన బదిలీల రీత్యా వివిధ నగరాలకు వెళ్లేదాన్ని.. ఈ క్రమంలోనే ఎన్నో భాషలు నేర్చుకున్నా. అయితే మన దేశంలో ఎన్నో ఆదివాసీ తెగలున్నాయి. కానీ వాటికంటూ ప్రత్యేకమైన లిపి/భాష లేదనే చెప్పాలి. నిజానికి ఈ సమాజానికి గిరిజనులే ఆది! వాళ్ల దగ్గర బోలెడంత జ్ఞానం, మేధా సంపత్తి ఉన్నా.. అణచివేతకు గురవుతున్నారు. చాలామంది వారిని అసలు మనుషుల్లా కూడా చూడట్లేదు. అంతెందుకు.. మొదట్లో నన్ను గౌరవించిన వారు కూడా నేను ఆదివాసీ మహిళని తెలిశాక.. వారి ప్రవర్తన మార్చుకునే వారు. కానీ ఆ తర్వాత్తర్వాత ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పు వచ్చింది.

ఒక భాషే మనిషికి విద్యాబుద్ధులు నేర్పిస్తుంది.. వారు జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది. అందుకే ఉనికే లేని గిరిజన భాషలకు లిపితో ప్రాణం పోయాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో కొంతమంది గిరిజనుల నుంచి విమర్శలు ఎదురైనా సహించా. రూపురేఖలు, వేషం మార్చుకొని వారితో కలిసిపోయి మరీ ఈ దిశగా ప్రయత్నించా. లిపిని రూపొందించే క్రమంలో వాళ్ల సంస్కృతీ సంప్రదాయాలు, జీవనశైలి గురించి తెలుసుకున్నా..’ అంటారు ప్రసన్న.

కేవలం ప్రొఫెసర్‌గానే కాక.. రచయిత్రిగానూ తనను తాను నిరూపించుకున్నారామె. ఈ క్రమంలో 26 పుస్తకాలు రచించిన ఆమె.. జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ చోటు దక్కించుకున్నారు. 2015లో ఉత్తమ విద్యావేత్తగా సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డు కూడా అందుకున్నారు ప్రసన్న. తాజాగా 2021 కి గాను ‘నారీ శక్తి’ పురస్కారం దక్కించుకున్న ఆమె.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక మహిళగా నిలిచారు.


శారీరక లోపాన్ని అధిగమించి..!

శారీరక లోపాలున్న వారు ఏమీ సాధించలేరన్నది చాలామంది భావన. కానీ ఈ అభిప్రాయాన్ని మార్చాలనుకుంది పుణేకు చెందిన సైలీ నంద్‌కిషోర్‌ అగవనే. డౌన్‌ సిండ్రోమ్‌తో జన్మించిన ఆమె.. చిన్నతనంలో ఈ సమాజం నుంచి ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంది. సాధారణ పాఠశాలలో అందరు పిల్లలతో కలిసి చదువుకోవడానికి పెద్ద యుద్ధమే చేసినా ఫలితం దక్కలేదంటోందీ అమ్మాయి. నృత్యంపై మక్కువతో తొమ్మిదేళ్ల వయసులో అక్కతో కలిసి కథక్‌ డ్యాన్స్‌ తరగతుల్లో చేరిన సైలీ.. క్రమంగా ఇందులో ఆరితేరింది. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతార’న్నట్లు.. ఈ సాధనే తన జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టిందంటోందీ డ్యాన్సింగ్‌ గర్ల్‌. ప్రత్యేక అవసరాలున్న అమ్మాయే అయినా.. తన ప్రతిభతో సాధారణ అమ్మాయిలతో కలిసి డ్యాన్స్‌ చేసే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిర్వహించిన వివిధ డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొని అవార్డులు-రివార్డులు గెలుచుకుంది సైలీ.

ఈ డ్యాన్సింగ్‌ డాల్‌కు కంప్యూటర్‌ పరిజ్ఞానం, డాక్యుమెంట్లు రాయడం, బొమ్మలేయడంలోనూ ప్రావీణ్యం ఉంది. ఈ క్రమంలోనే పలు డ్రాయింగ్‌ పోటీల్లోనూ పాల్గొని బహుమతులు గెలుచుకుంది. మరోవైపు బుల్లితెరపై నిర్వహించే పలు ప్రముఖ డ్యాన్స్‌ రియాల్టీ షోల్లో పాల్గొని హృతిక్‌ రోషన్‌, మాధురీ దీక్షిత్‌.. వంటి తారల చేతుల మీదుగా రివార్డులు కూడా అందుకున్నానంటోంది సైలీ. ఇలా డ్యాన్స్‌నే తన వృత్తి-ప్రవృత్తులుగా మార్చుకున్న ఆమె.. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు కథక్‌ నేర్పిస్తోంది. ‘సైలీస్‌ డ్యాన్స్‌ క్లాసెస్‌’ పేరుతో తన ఇంటి వద్దే నృత్య శిక్షణ ఇస్తోంది. అంతేకాదు.. ఎన్నో స్కూళ్లు సైతం తమ విద్యార్థులకు డ్యాన్స్‌ నేర్పించేందుకు తనను ఆహ్వానిస్తున్నాయంటూ చెబుతోందీ డ్యాన్సింగ్ గర్ల్‌. శారీరక, మానసిక లోపాలున్నా.. వారిలో ఏదో ఒక ప్రత్యేకత దాగుంటుందంటూ.. దాన్ని తల్లిదండ్రులు గుర్తించి తమ పిల్లల్ని ప్రోత్సహించగలిగితే.. వాళ్లూ ఈ సమాజంలో ‘ఒక్క’రిగా గుర్తింపు పొందుతారని చెబుతోందీ పుణే అమ్మాయి. పేరెంట్స్‌లో ఆ స్పృహ కలిగించడానికే కృషి చేస్తున్నానంటోన్న సైలీ.. తాజాగా 2020 కి గాను ‘నారీ శక్తి’ పురస్కారం అందుకుంది.


పాముల ప్రాణ మిత్రురాలు!

పామును చూస్తే ఆమడదూరం పరిగెడతాం.. భయంతో దాన్ని హింసిస్తాం/చంపేస్తాం.. కానీ అవే విష సర్పాలతో స్నేహం చేస్తూ.. వాటికి రక్షణ కవచంలా మారారు మహారాష్ట్రకు చెందిన వనితా జగ్దియో బొరేడ్‌. వన్య ప్రాణి సంరక్షణ అంటే ప్రాణం పెట్టే ఆమె.. ‘Soyre Vanchare Multipurpose Foundation’ను స్థాపించింది. ప్రకృతి, వన్యప్రాణి సంరక్షణ దీని ముఖ్యోద్దేశం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సుమారు 50 వేలకు పైగా సర్పాల్ని రక్షించి.. అడవిలో వదిలిపెట్టిన వనిత.. దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచింది. పాముల్ని చూస్తే ఒక ప్రాణ స్నేహితురాలిని కలిశానన్న అనుభూతి కలుగుతుందంటోందీ స్నేక్‌ లవర్‌. అందుకే ఆమెను అంతా ‘స్నేక్‌ ఫ్రెండ్‌’, ‘సర్ప మిత్రా’ అన్న పేర్లతో పిలుస్తారు. ఇలా వన్య ప్రాణి సంరక్షణలో భాగంగా ఆమె చూపుతోన్న చొరవకు గుర్తింపుగా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌ వనశ్రీ అవార్డు’ను అందుకుంది. అంతేకాదు.. భారత ప్రభుత్వం ఆమెపై ఓ పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేసి గౌరవించింది. ఇక తాజాగా 2020 కి గాను ‘నారీ శక్తి’ పురస్కారం అందుకుందీ స్నేక్‌ లవర్.


వారికి ‘కంటి వెలుగై’!

టెర్రీ సిండ్రోమ్‌ కారణంగా పుట్టిన ఆరు నెలలకే కంటి చూపును పూర్తిగా కోల్పోయింది చెన్నైకి చెందిన టిఫానీ మరియా బ్రార్‌. దీంతో స్కూల్‌, సమాజం నుంచి బహిష్కరణకు గురైంది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదామె. తన తండ్రి ఉద్యోగ రీత్యా గ్రేట్‌ బ్రిటన్‌ వెళ్లిన ఆమె అక్కడే పాఠశాల విద్యాభ్యాసం కొనసాగించింది.. ఆ తర్వాత ఇండియా చేరుకుంది. ఇక్కడా స్కూల్లో ఎన్ని విమర్శలు ఎదురైనా.. పట్టుదలతో చదివి 12వ తరగతిలో సీబీఎస్‌ఈ టాపర్‌గా నిలిచింది. ఇంగ్లిష్‌ లిటరేచర్‌ పూర్తి చేసిన అనంతరం.. దేశంలోని వివిధ నగరాల్లో పర్యటించిందామె. ఈ క్రమంలోనే దృష్టి లోపం ఉన్న వారి వెతలు తెలుసుకుంది. వారిలో ఆసక్తి ఉన్నా సౌకర్యాలు లేక చదువుకోలేకపోతున్నారని, ట్యాలెంట్‌ ఉన్నా సమాజంలో మనలేకపోతున్నారని గ్రహించింది.
ఇలాంటి మూసధోరణుల్ని బద్దలుకొట్టి చూపు లేని వారికి అండగా నిలబడడం కోసం 2012లో ‘జ్యోతిర్గమయా ఫౌండేషన్‌’ను స్థాపించింది. చూపు లేని వారికి, పాక్షిక దృష్టి లోపం ఉన్న వారి కోసం ఏర్పాటు చేసిన మొబైల్‌ స్కూల్‌ ఇది! ‘అంధులు పాఠశాలకు వెళ్లలేకపోతేనేం.. పాఠశాలే వారి వద్దకు వస్తుంది..’ అంటోన్న ఆమె.. ప్రస్తుతం తన స్వచ్ఛంద సంస్థ వేదికగా బ్రెయిలీ లిపి, కంప్యూటర్‌ నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు, శారీరక కదలికలు.. తదితర అంశాలపై అంధులకు శిక్షణ ఇస్తోంది. మరోవైపు ఆర్టిస్ట్‌గా, టీచర్‌గా, మోటివేషనల్‌ స్పీకర్‌గానూ కొనసాగుతోందీ బ్రేవ్‌ లేడీ. ఇలా తన కృషికి గుర్తింపుగా యూఎస్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నుంచి ‘హోల్‌మన్‌ ప్రైజ్‌’ అందుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది టిఫానీ. తాజాగా 2020 కి గాను ‘నారీ శక్తి’ పురస్కారం అందుకుంది.

 


ఆమె ‘వైన్‌’కు అంతర్జాతీయ గుర్తింపు!

సహజ పద్ధతుల్లో, వివిధ రకాల పండ్లతో వైన్‌ తయారుచేస్తూ.. అంతర్జాతీయ గుర్తింపు సంపాదించింది అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సుబన్‌సిరి ప్రాంతానికి చెందిన టగే రీటా తఖే. 17 ఏళ్ల పాటు ఆ రాష్ట్ర గ్రామీణ పనుల శాఖలో ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించిన ఆమె.. తనకంటూ సొంతంగా, కొత్తగా ఏదైనా చేయాలనుకుంది. ఈ క్రమంలోనే వైన్‌ తయారీలో అనుభవమున్న భర్త నుంచి మెలకువలు నేర్చుకుంది. అయితే ఏది చేసినా ఆరోగ్యకరంగా అందించాలన్నదే ఆశయంగా పెట్టుకుందామె. ఈ క్రమంలోనే ‘నారా అబా’ బ్రాండ్‌ పేరుతో కివీ వైన్‌ తయారుచేయడం ప్రారంభించిందామె.

సహజ పద్ధతుల్లో పండించిన కివీ పండ్లతో.. అంతే సహజంగా తయారుచేసే ఈ వైన్‌లో పోషకాలు మెండుగా ఉంటాయంటోంది రీటా. ప్రస్తుతం కివీతో పాటు, ప్లమ్‌, పియర్‌, పీచ్‌, అడవి యాపిల్‌.. తదితర పండ్లతోనూ రుచికరమైన, ఆరోగ్యకరమైన వైన్‌ తయారుచేస్తోన్న ఆమె పానీయానికి దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇలా దేశంలోనే వైన్‌ తయారుచేస్తోన్న తొలి మహిళగా కీర్తి గడించిన రీటా.. 2018లో ఐక్యరాజ్య సమితి, నీతి ఆయోగ్‌ సంయుక్తంగా అందజేసిన ‘విమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా అవార్డు’ అందుకుంది. మరోవైపు ‘నార్త్‌ఈస్ట్‌ ఆంత్రప్రెన్యూర్‌ అవార్డు’నూ తన సొంతం చేసుకుందీ వైన్‌ లేడీ. ఇక తాజాగా 2021 కి గాను ‘నారీ శక్తి’ పురస్కారం అందుకుంది.

వీరితో పాటు తమ సేవలతో ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చిన మరికొంతమంది మహిళామణులు తాజాగా నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. తద్వారా తమ శక్తియుక్తుల్ని చాటి ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్