Updated : 09/02/2022 20:11 IST

Work From Home: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇలా చేస్తే బోర్‌ కొట్టదు!

కరోనాకు ముందు వరకు కనీసం ఒక్క రోజైనా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు ఇస్తే బాగుండు.. అని అనుకున్న వాళ్లంతా ఇప్పుడు ఆఫీస్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్నారు. చాలామందికి అంతలా బోర్‌ కొట్టేసింది ఈ పని విధానం. ఒకే చోట కదలకుండా పనిచేయడంతో పాటు రోజంతా ఒంటరిగా ఇంటికే పరిమితమవడం ఈ అసహనానికి ప్రధాన కారణాలుగా చెప్పచ్చు. అయితే ఇంటి నుంచి పనే అయినా అందుకు కొన్ని లొకేషన్లను ఎంచుకుంటే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ బోర్‌ కొట్టదంటున్నారు నిపుణులు. తద్వారా ఉత్పాదకతనూ పెంచుకోవచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా లొకేషన్లు? రండి.. తెలుసుకుందాం..!

ప్రయాణిస్తూ పనిచేస్తే..!

ఆఫీస్‌ పనులతో బిజీగా ఉండే వారికి ప్రయాణిస్తూ పనిచేయడం కొత్త కాదు. కొన్ని సందర్భాల్లో సొంత వాహనం, పబ్లిక్‌ రవాణాలో ప్రయాణం చేస్తూ మరీ ల్యాప్‌టాప్‌/ఐప్యాడ్‌లో తమ పనులు ముగించుకునే వారిని మనం చూస్తుంటాం. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో కాస్త వైవిధ్యం కోరుకునే వారు ఇలా ప్రయాణిస్తూ ఆఫీస్‌ పనిని కొనసాగించడం మేలంటున్నారు నిపుణులు. అయితే ఇందుకోసం సొంత కార్లలో లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్తూ పనులు చేసుకోవచ్చు.. కార్లు లేని వారు ఎంచక్కా దగ్గర్లోని నచ్చిన ప్రదేశానికి బైక్‌పై వెళ్లి.. అక్కడి ప్రశాంత వాతావరణంలో ఆఫీస్‌ పని చకచకా ముగించుకోవచ్చు. అయితే మీరు వెళ్లే చోట నెట్‌వర్క్‌ ఇబ్బందులేవీ లేకుండా చూసుకోవడం మాత్రం తప్పనిసరి. ఇలా ఇష్టమైన ప్రదేశంలో పనిచేస్తే అటు ఆసక్తి, తద్వారా ఉత్పాదకత మెరుగవుతుంది. కనీసం వారానికోరోజు లేదంటే పదిహేను రోజులకోసారి ఇలా కొత్తగా ప్రయత్నించారంటే.. మానసిక ఒత్తిళ్లన్నీ మటుమాయమై పని పైనే పూర్తి ఏకాగ్రత పెట్టగలరనడంలో సందేహం లేదు. కావాలంటే ఓసారి ట్రై చేసి చూడండి!

వాళ్లింటికి వెళ్లండి!

ఆఫీస్‌లో సహచరులతో మాట్లాడుతూ, చేసే పని గురించి చర్చిస్తూ పని చేయడం కొంతమందికి అలవాటు. ఇలా చేస్తేనే వారికి పనిచేసిన సంతృప్తి దక్కుతుంది. కానీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఇది ప్రత్యక్షంగా సాధ్యం కాదనే చెప్పాలి. అలాగని వీడియో కాల్‌, ఫోన్లో మాట్లాడుతూ పనిచేయడం వల్ల సమయం ఎక్కువగా వృథా అవుతుంటుంది. మరి, ఇలా జరగకూడదంటే.. మీకు దగ్గర్లోని కొలీగ్‌/స్నేహితుల ఇంటికి వెళ్లి ఆ రోజంతా అక్కడే పని చేసుకుంటే.. భలే ఉంది కదా ఈ ఐడియా?! చదువుకునే రోజుల్లో కంబైన్డ్‌ స్టడీస్‌లా అన్నమాట! ఇలా మీరు కోరుకున్నట్లుగా వాళ్లతో కలిసి పనిచేయడం వల్ల పనిలో మరింత ఉత్పాదకతను పెంచుకోవచ్చు.. ఎప్పుడూ ఇంటి నుంచే పని అనే బోర్‌ ఫీలింగ్‌కి స్వస్తి పలకచ్చు. అయితే ఒకవేళ స్నేహితులు/కొలీగ్స్‌ ఎవరూ లేకపోతే.. మీ భాగస్వామి కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నట్లయితే.. వారితో కలిసి నచ్చిన ప్రదేశానికి వెళ్లి.. ఎంచక్కా అక్కడే ఇద్దరూ ఆఫీస్‌ పని ముగించుకోవడం.. లేదంటే ఇంట్లోనే ఇష్టమైన ప్రదేశంలో కూర్చొని మధ్యమధ్యలో కాసేపు కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకోవచ్చు. తద్వారా ఒత్తిళ్లు అధిగమించి ఉత్పాదకతను పెంచుకోవచ్చు.

‘వర్కేషన్‌’ ట్రై చేస్తారా?

నెలల తరబడి ఇంటి నుంచి పనిచేస్తూ విసిగిపోయిన వారిని ‘వర్కేషన్‌’కి వెళ్లమని సలహా ఇస్తున్నారు నిపుణులు. అంటే నచ్చిన ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లి.. ఓవైపు పనిచేస్తూ, మరోవైపు అక్కడి అందాల్ని ఆస్వాదించడమన్నమాట! కరోనాకు ముందు నుంచే ఈ పద్ధతి మన దేశంలో ఆచరణలో ఉన్నప్పటికీ.. కరోనా వచ్చాక మాత్రం బాగా ప్రాచుర్యం పొందిందని చెప్పచ్చు. ఈ పని విధానాన్ని కోరుకునే ఉద్యోగుల కోసం ప్రస్తుతం కొన్ని టూరిజం సంస్థలు ప్రత్యేక ప్యాకేజీల్ని సైతం అందిస్తున్నాయి. ఇందుకు మీరు చేయాల్సిందల్లా సంస్థ నియమ నిబంధనల ప్రకారం.. ముందే యాజమాన్యం నుంచి అనుమతి తీసుకొని మీకు నచ్చిన చోటికెళ్లి అక్కడ్నుంచే వారాల తరబడి పనులు పూర్తి చేయచ్చు.. మరోవైపు వారాంతాలు, ఆఫీస్‌ పనులు ముగిశాక టూర్‌ని కూడా ఎంజాయ్‌ చేయచ్చు. అలాగే మీరు వెళ్లిన ప్రదేశంలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉందో, లేదో ముందే గమనించుకోవడం తప్పనిసరి. ఇలా సేదదీరుతూ పని చేయడం వల్ల పనిలో నాణ్యత తప్పకుండా పెరుగుతుందంటున్నారు నిపుణులు.

అన్నీ అక్కడే..!

ఇంటి నుంచి పనిచేసే మహిళలకు.. ఆఫీస్‌ పనులే ఊపిరి సలపకుండా ఉన్నాయంటే.. ఇంటి పనులతో వాళ్లపై అదనపు భారం పడుతుందని చెప్పచ్చు. ఇది ఒక రకంగా వారి మానసిక ఆరోగ్యాన్ని, పరోక్షంగా ఆఫీస్‌ పనిలో ఉత్పాదకతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఒక రోజు ఇంటి పనులన్నింటికీ స్వస్తి చెప్పి.. ఓ రిసార్ట్‌ లేదా హోటల్‌ గదిని బుక్‌ చేసుకొని.. అక్కడ్నుంచి విధులు నిర్వర్తించమంటున్నారు. ఈ క్రమంలో ఉదయం కాఫీ దగ్గర్నుంచి.. రాత్రి డిన్నర్‌ దాకా.. మీకు ఇష్టమైన పదార్థాలు ఆర్డర్‌ చేసుకొని.. మీ గదికే తెప్పించుకోవచ్చు. ఎంచక్కా వాటి రుచిని ఆస్వాదిస్తూ.. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో పనులు పూర్తి చేసుకోవచ్చు. నిజంగా ఈ తరహా పని విధానం రోజువారీ ఒత్తిళ్ల నుంచి కాస్త ప్రశాంతతను చేకూరుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

వీలైతే కప్పు కాఫీ..!

పని ఇంటి నుంచే అయినా.. ఆఫీస్‌లోలాగే నిర్ణీత వ్యవధుల్లో బృంద సమావేశాలు, ఆయా పనుల గురించి కొలీగ్స్‌/బాస్‌తో జరిగే చర్చలు.. వంటివన్నీ కామనే! అయితే ఇవన్నీ నేరుగా కాకుండా వీడియో కాల్స్‌ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ తరహా పని విధానంతో విసిగెత్తిపోయిన వారు.. ఈసారి మీటింగ్స్‌ కోసం ఓ కాఫీ షాప్‌ని బుక్‌ చేసుకోవచ్చు. కొలీగ్స్‌తో కలిసి కమ్మని కాఫీ తాగుతూ ఆఫీస్‌ పనులు, ఇతర విషయాల గురించి చర్చించచ్చు. తద్వారా ఇంటి నుంచి పనికి కాస్త బ్రేక్‌ ఇచ్చినట్లవుతుంది.. మనసూ పునరుత్తేజితమవుతుంది. అయితే ఇలాంటి బృంద సమావేశాల కోసం వెళ్లే వారంతా మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ.. కరోనా జాగ్రత్తల్ని పాటించడం మాత్రం మరవద్దు.

గమనిక: ఇంటి నుంచి పనిలో కాస్త వైవిధ్యం కోరుకునే వారు ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవడంలో తప్పు లేదు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. కొవిడ్‌ బారిన పడకుండా కనీస జాగ్రత్తలు పాటించడం, మీరు పని చేసుకునే ప్రదేశంలో ఆఫీస్‌ పనికి అంతరాయం కలగకుండా నెట్‌వర్క్‌తో పాటు ఇతర వసతులు సమకూర్చుకోవడం ముఖ్యం. తద్వారా పనిపై పూర్తి మనసు లగ్నం చేయచ్చు.. ఫలితంగా పనిలో నాణ్యతను, ఉత్పాదకతను పెంచుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని