అందాల తారల ‘వ్యాపార’ మంత్రం!

‘బ్యూటీ విత్‌ బ్రెయిన్స్‌’ అంటుంటారు. ఇది మన సినీ తారలకు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. ఓవైపు తమ అందం, అభినయంతో సినీరంగాన్ని ఏలుతూనే.. మరోవైపు వ్యాపార ప్రయాణాన్నీ ప్రారంభించారు కొందరు ముద్దుగుమ్మలు.

Updated : 15 Sep 2023 19:19 IST

(Photos: Instagram)

‘బ్యూటీ విత్‌ బ్రెయిన్స్‌’ అంటుంటారు. ఇది మన సినీ తారలకు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. ఓవైపు తమ అందం, అభినయంతో సినీరంగాన్ని ఏలుతూనే.. మరోవైపు వ్యాపార ప్రయాణాన్నీ ప్రారంభించారు కొందరు ముద్దుగుమ్మలు. ఈ క్రమంలో తమ ఆలోచనలకు సాంకేతికతను జోడించి ఆన్‌లైన్ / డిజిటల్ వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా నయనతార కూడా చేరిపోయింది. త్వరలోనే ఓ బ్యూటీ ఉత్పత్తుల బ్రాండ్‌ను ప్రారంభించనున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసిందీ బ్యూటీ. ఈ నేపథ్యంలో.. అటు నటనతో అలరిస్తూనే.. ఇటు వ్యాపారంలోనూ సత్తా చాటుతోన్న కొందరు ముద్దుగుమ్మల బిజినెస్‌ స్టోరీస్‌ ఏంటో తెలుసుకుందాం రండి..

నయనతార – 9 స్కిన్

ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా.. సొంత ప్రతిభతో లేడీ సూపర్‌స్టార్‌ స్థాయికి ఎదిగింది నయనతార. ఆమె నటించిన ‘జవాన్‌’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ శుభ సమయంలోనే ఫ్యాన్స్‌కు మరో శుభవార్త చెప్పింది నయన్‌. త్వరలోనే తాను ఓ సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లు తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిందీ బ్యూటీ.

‘స్వీయ ప్రేమ మన ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడిస్తుంది. అలాంటి ప్రేమను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడానికే కొన్ని చర్మ సౌందర్య ఉత్పత్తుల్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ‘9 స్కిన్‌’ పేరుతో బ్యూటీ వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాం. మా ఆరేళ్ల కృషికి ఫలితమీ బ్రాండ్‌. నానో టెక్నాలజీ వంటి ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించి సహజసిద్ధంగా రూపొందించిన ఈ బ్యూటీ ఉత్పత్తులు.. అందాన్నే కాదు.. స్వీయ ప్రేమనూ పెంచుతాయి. సెప్టెంబర్‌ 29న ఆన్‌లైన్‌ వేదికగా మా ఉత్పత్తుల్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం..’ అంటూ తన వ్యాపారాన్ని ఫ్యాన్స్‌కి పరిచయం చేసింది నయన్‌. తన భర్త విఘ్నేష్‌, సింగపూర్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్త డైసీ మోర్గాన్‌తో కలిసి ఈ బ్రాండ్‌ను ప్రారంభించనుందీ తమిళందం. అయితే ఇప్పుడే కాదు.. ప్రముఖ చర్మ వ్యాధి నిపుణురాలు డాక్టర్‌ రెనితా రాజన్‌తో కలిసి ‘ది లిప్‌బామ్‌ కంపెనీ’ పేరుతో ఈ మధ్యే తన తొలి వ్యాపారాన్ని ప్రారంభించింది నయన్‌. మొక్కల ఆధారిత, వీగన్‌ ఉత్పత్తులతో.. అన్ని వయసుల వారికి, అమ్మాయిలకు, అబ్బాయిలకు.. సహజసిద్ధమైన లిప్‌బామ్స్‌ తయారుచేయడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం.


కృతీ సనన్‌ - హైఫెన్

సవాళ్లతో కూడిన పాత్రలు ఎంచుకోవడంలో ముందుండే బాలీవుడ్‌ భామ కృతీ సనన్‌.. మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తోంది. స్వతహాగా అందాన్ని సంరక్షించుకోవడమంటే ఇష్టమని చెప్పే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే వైశాలీ గుప్తా అనే మరో మహిళా వ్యాపారవేత్తతో కలిపి ‘హైఫెన్‌’ పేరుతో ఓ స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌ని కూడా ప్రారంభించింది. జీవహింసకు వ్యతిరేకంగా ప్రకృతిలో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ ఉత్పత్తుల్ని తయారుచేస్తున్నట్లు చెబుతోంది కృతి.

‘హైఫెన్ ప్రారంభం నా జీవితంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది! అందం విషయంలో నాకు ముందు నుంచీ కాస్త శ్రద్ధ ఎక్కువ. ఈ మక్కువనే వ్యాపార సూత్రంగా మలచుకోవడం ఓ కొత్త అనుభూతి. జీవ హింసకు వ్యతిరేకంగా ప్రకృతిలో లభించే ఎన్నో ఔషధ గుణాలతో కూడిన పదార్థాలనే ఈ ఉత్పత్తుల తయారీలో వాడుతున్నాం. వీటితో చర్మానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి..’ అంటూ చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ఇదే కాదు.. గతేడాది ‘ది ట్రైబ్‌’ పేరుతో ఓ ఫిట్‌నెస్‌ యాప్‌ను ప్రారంభించిన కృతి.. ఈ వేదికగా ఔత్సాహికులకు ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతోంది. స్టూడియో సెషన్స్‌, వర్చువల్‌ సెషన్స్‌, నిపుణులతో డైట్‌ సలహాలు, వ్యక్తిగత లేదా బృంద తరగతులు.. వంటి సదుపాయాలెన్నో తన యాప్‌లో ఉన్నాయంటోందీ బాలీవుడ్‌ భామ.


ఆలియా భట్, Ed-A-Mamma

నటిగా, నిర్మాతగానే కాకుండా.. పలు సేవా కార్యక్రమాలతోనూ మెప్పిస్తోన్న బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌.. ప్రస్తుతం వ్యాపారవేత్తగానూ రాణిస్తోంది. రెండేళ్ల క్రితం ‘Ed-A-Mamma’ పేరుతో ఆన్‌లైన్‌లో పిల్లల క్లాతింగ్‌ లైన్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ వేదికగా పిల్లలకు సంబంధించిన అన్ని రకాల దుస్తులు, గర్భం ధరించిన మహిళల కోసం మెటర్నిటీ వేర్‌ను అందిస్తోంది.

‘ఈ వ్యాపారం ప్రారంభిద్దామనుకున్నప్పుడు నా మనసులో ఎన్నో ఆలోచనలు. నా సినిమాలతో ఫ్యాన్స్‌ను మెప్పించినట్లు.. ఫ్యాషన్ లవర్స్‌ని ఆకట్టుకోగలనా అనిపించింది. అయితే నాకున్న ఫాలోయింగ్‌తో కాకుండా విభిన్న దుస్తులతోనే వినియోగదారుల్ని ఆకట్టుకోవాలనుకున్నా. ఈ క్రమంలోనే మార్కెట్లో కాస్త పరిశోధించి, లోతుగా ఆలోచించి ఈ బ్రాండ్‌ను ప్రారంభించా. నా పిల్లి పేరు ఎడ్వర్డ్‌, దానికి నేను అమ్మను.. ఈ రెండూ కలిసేలా దీనికి పేరు పెట్టా..’ అంటూ ఓ సందర్భంలో పంచుకుంది ఆలియా. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్రాండ్‌ రూ. 150 కోట్లకు పైగా లాభాల్ని ఆర్జించింది. ఇక ఆలియా.. వ్యాపారవేత్త ఈషా అంబానీతో కలిసి మరో వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే! ఇలా తాను సొంతంగా వ్యాపారం ప్రారంభించడమే కాదు.. ‘ఫూల్‌’, ‘నైకా’, ‘స్టైల్‌ క్రాకర్‌’.. వంటి సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టిందీ బాలీవుడ్‌ బేబ్.


దీపికా పదుకొణె - 82°E

సినిమాల్లో నటనతోనే కాదు.. ఆయా ఈవెంట్లతో తన అందం, ఫ్యాషన్‌ సెన్స్‌తోనూ ఆకట్టుకుంటుంది అందాల తార దీపికా పదుకొణె. సౌందర్యం విషయంలో తాను పాటించే చిట్కాల్ని సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. అందం విషయంలో ఎవరికి వారు పలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటోంది. ఇలా చెప్పడమే కాదు.. గతేడాది నవంబర్‌లో ముంబయికి చెందిన జిగర్‌ షాతో కలిసి ‘82°E’ అనే చర్మ సంరక్షణ బ్రాండ్‌కు తెరతీసింది. ప్రయోగశాలలో పరీక్షించిన వీగన్‌ పదార్థాలతో సౌందర్యోత్పత్తుల్ని తయారుచేస్తూ ఈ బ్రాండ్‌ వేదికగా ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది దీప్స్.

‘రోజువారీ సౌందర్య సంరక్షణను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించామం’టోన్న దీప్స్‌.. సీరమ్‌, క్లెన్సర్‌, మాయిశ్చరైజర్‌, టోనర్‌.. వంటి వివిధ రకాల ఉత్పత్తుల్ని అందుబాటులో ఉంచింది. మరోవైపు.. ‘Epigamia’, ‘Blu Smart’.. వంటి స్టార్టప్స్‌లోనూ పెట్టుబడులు పెట్టిందీ బాలీవుడ్‌ బ్యూటీ.


ట్వింకిల్‌ ఖన్నా, ట్వీక్‌ ఇండియా

నటిగా, రచయిత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్‌ భామ ట్వింకిల్‌ ఖన్నా. ఇంటీరియర్‌ డిజైనర్‌గానూ పేరున్న ఈ ముద్దుగుమ్మ.. ముంబయిలో ‘Gurlein’, ‘Manchanda’.. పేర్లతో రెండు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ స్టోర్లు నడుపుతోంది. మహిళా అంశాలపై ఎక్కువగా స్పందించే మిసెస్‌ అక్షయ్‌.. అన్ని వర్గాల మహిళల కోసం ‘ట్వీక్‌ ఇండియా’ పేరుతో ఓ డిజిటల్‌ మీడియా సంస్థను ప్రారంభించింది. మహిళలపై వివక్ష, మూసధోరణుల్ని బద్దలుకొట్టడమే లక్ష్యంగా ఈ వేదికను ప్రారంభించానంటోందీ డేరింగ్‌ బ్యూటీ.
‘సామాజిక నిర్ణయాలతో సంబంధం లేకుండా మహిళల కోసం ఓ స్వేచ్ఛా వేదికను ఏర్పాటుచేయాలన్న లక్ష్యంతోనే ట్వీక్‌ ఇండియాను ప్రారంభించా. అన్ని వర్గాల మహిళలు.. ఇక్కడ తమ సమస్యల్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా పంచుకోవచ్చు. బుల్లీయింగ్‌, లింగ సమానత్వం, ఆరోగ్యం, బాడీ షేమింగ్‌, మానసిక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. వంటి అనేక సమస్యలకు నిపుణులు-సెలబ్రిటీల సలహాలు పొందచ్చు..’ అంటూ తన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ గురించి ఓ సందర్భంలో పంచుకుంది ట్వింకిల్.

వీరే కాదు.. ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు హైదరాబాద్‌, విశాఖపట్నంలలో పలు జిమ్‌ సెంటర్లున్నాయి. ఇక సమంత ‘సాకీ’ పేరుతో దుస్తుల వ్యాపారంలో రాణిస్తుండగా, కత్రినా కైఫ్‌ ‘కే బ్యూటీ’తో చర్మ సౌందర్యోత్పత్తుల వ్యాపారంలో దూసుకుపోతోంది.

ఇలా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడమే కాదు.. ఇది వరకే ఉన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన ముద్దుగుమ్మలూ కొందరున్నారు. వారిలో సారా అలీ ఖాన్‌ (Souled Store), కత్రినా కైఫ్‌ (Nykaa), ప్రియాంక చోప్రా (Bumble), కాజల్‌ అగర్వాల్‌ (Okie Gaming), మౌనీ రాయ్‌ (Ultimate Gurus), అతియా శెట్టి (Stage3), సమంత (SustainKart).. తదితరులు ఆయా ఆన్‌లైన్ / డిజిటల్ వ్యాపారాల్లో భాగమయ్యారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్